Nokia: 60 ఏళ్ల తర్వాత ‘లోగో’ మార్చిన నోకియా.. కొత్త లోగో ఎలా ఉందో తెలుసా..
ABN, First Publish Date - 2023-02-27T17:32:57+05:30
నోకియా(Nokia).. ఒకప్పుడు ఈ పేరు వినిపిస్తే చాలు వైబ్రేషన్స్ కనిపించేవి.
న్యూఢిల్లీ: నోకియా(Nokia).. ఒకప్పుడు ఈ పేరు వినిపిస్తే చాలు వైబ్రేషన్స్ కనిపించేవి. మొబైల్ ఫోన్‌కు పర్యాయపదంగా మారిన ఈ పేరు ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్ల(Smart Phones) రాకతో క్రమంగా అభిమానుల మనసుల నుంచి కనుమరుగైంది. చైనా ఫోన్లు, శాంసంగ్ దూకుడు ముందు నిలవలేకపోయింది. చాలాకాలం తర్వాత మళ్లీ స్మార్ట్‌ఫోన్లతో అభిమానులను పలకరించింది. అయినప్పటికీ మునుపటి దూకుడును సొంతం చేసుకోలేకపోయింది. తాజాగా, ఈ స్మార్ట్‌ఫోన్, టెలికం ఎక్విప్‌మెంట్ కంపెనీ తన లోగో(Nokia Logo)ను మార్చి సరికొత్తగా అభిమానులను పలకరించింది. నోకియా తన లోగోను మార్చడం 60 ఏళ్లలో ఇదే తొలిసారి. లోగో మాత్రమే కాదు, తన వ్యాపార వ్యూహాన్ని కూడా మార్చి కొత్త శకానికి నాంది పలికింది.
నోకియా(Nokia) పదాన్ని ఐదు వేర్వేరు ఆకృతుల కలయికతో రూపొందించింది. పాత ఐకానిక్ లోగో నీలం రంగుతో ఉండేది. ఇప్పుడు ఐదు వేర్వేరు రంగులతో రూపొందించింది. ఫలితంగా లోగో ఉపయోగించే సందర్భాన్ని బట్టి రంగును ఉపయోగించనుంది. స్మార్ట్‌ఫోన్లతో తమ అనుబంధం ఉందని, ఇప్పుడు తమది బిజినెస్ టెక్నాలజీ కంపెనీ అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్‌మార్క్ పేర్కొన్నారు.
నోకియా నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
కాగా, నోకియా తాజాగా సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. దీని పేరు ‘నోకియా జి22’(Nokia G22). ఇది యూనిసోక్ టి606 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ కలిగిన ఈ ఫోన్‌లో 5,050 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. 20W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, 6.52 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ ప్యానెల్, వెనకవైపు 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో మూడు కెమెరాలు, సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ రీడర్ వంటి స్పెసిఫికేషన్లు కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12తో పనిచేస్తుంది. నోకియా జి22 ప్రారంభ ధర దాదాపు రూ. 15,650. మెటియర్ గ్రే, లాగూన్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.
Updated Date - 2023-02-27T17:32:59+05:30 IST