TSPSC Paper Leak Case: వాట్సప్ చాట్‌లో బయటపడ్డ సరికొత్త లింకులు
ABN, First Publish Date - 2023-03-19T22:11:35+05:30
ప్రవీణ్ (Pulidindi Praveen Kumar), రాజశేఖర్(Atla Rajashekar Reddy), రేణుక(Renuka)లను విడివిడిగా విచారించారు. వాట్సప్ చాట్‌లో సరికొత్త లింకులు బయటపడ్డాయి.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో నిందితుల రెండవ రోజు విచారణ ముగిసింది. 9 మంది నిందితులను 7 గంటల పాటు సైబర్ క్రైమ్, సిట్(SIT) దర్యాప్తు బృందం విచారించింది. నిందితుల నుంచి పలు కీలక విషయాలు రాబట్టింది. వాట్సప్ చాట్‌లో సరికొత్త లింకులు బయటపడ్డాయి. ప్రవీణ్ (Pulidindi Praveen Kumar), రాజశేఖర్(Atla Rajashekar Reddy), రేణుక(Renuka)లను విడివిడిగా విచారించారు. ముగ్గురు నిందితుల వాట్సప్ చాట్‌ని రిట్రీవ్ చేశారు. వాట్సప్ చాటింగ్ ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. రాజశేఖర్ చాలామందికి పేపర్లను ఇచ్చినట్లుగా సిట్ గుర్తించింది. ప్రవీణ్, రాజశేఖర్ కలిసి కుట్ర పూరితంగా పేపర్‌ను లీక్ చేసినట్లుగా సిట్ తేల్చింది. రాజశేఖర్, ప్రవీణ్‌ల వ్యక్తిగత కంప్యూటర్ నుంచి డాటాను అధికారులు రిట్రీవ్ చేశారు. రెండు కంప్యూటర్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. గ్రూప్ వన్ పేపర్‌ను చాలామందికి సర్క్యులేట్ చేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఐదు పేపర్ల సమాచారాన్ని అధికారులు వాట్సాప్‌లో గుర్తించారు.
ఈ నెల 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైన ఘటనలో డబ్బు చెల్లింపునకు సంబంధించి నిందితుల మధ్య గొడవ జరిగినట్లు, దాంతో ఈ విషయం పోలీసులకు చేరినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు రేణుక(Renuka).. తన తమ్ముడు రాజేశ్‌నాయక్ కోసం టీఎస్‌పీఎస్‌సీలో పనిచేసే ప్రవీణ్ ద్వారా ప్రశ్నపత్రాన్ని సంపాదించినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రశ్నపత్రాన్ని తమ తండాకే చెందిన నీలేశ్, శ్రీను, రాజేందర్‌నాయక్‌లకు ఇచ్చినందుకు రూ.10 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు పరీక్షకు ముందురోజు వీరందరినీ వనపర్తిలోని తన ఇంటికి పిలిపించుకొని అక్కడే వారితో ప్రశ్నలకు జవాబులను ప్రాక్టీస్ చేయించింది. పరీక్ష రోజు తన కారులోనే వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి పరీక్ష రాయించుకొని వచ్చింది.
కాగా, ఒప్పందం ప్రకారం పరీక్షకు ముందు ఒక్కొక్కరు రేణుకకు రూ.2లక్షల చొప్పున చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని పరీక్ష పూర్తయ్యాక ఇస్తామని చెప్పారు. దీంతో పరీక్ష ముగిసిన రోజు రాత్రి వనపర్తిలో రేణుక ఇంట్లో జరిగిన డిన్నర్ తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని అడిగింది. అయితే తమ వద్ద డబ్బులేదని, ఇవ్వలేమని వారు చేతులెత్తేశారు. దీంతో రేణుకకు, వారికి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఆ సమయంలో ఆవేశానికి లోనైన నీలేశ్‌నాయక్.. డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పేశాడు. పోలీసులు వెంటనే స్పందించి రేణుకతోపాటు ఆమె సోదరుడిని, నీలేశ్‌ని, మిగిలిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా చేరిన తర్వాత ఆమె నియామక పత్రంలో పేరులో ఒక అక్షరం పొరపాటుగా పడిందని, దానిని సరిచేసుకోవడానికి ఆమె టీఎస్‌పీఎస్‌సీని సంప్రదించి, పలుమార్లు హైదరాబాద్‌లోకి కార్యాలయానికి వెళ్లారని ఆ క్రమంలోనే ఆమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడిందని చెబుతున్నారు. వారి పరిచయం కాస్తా స్నేహంగా మారి, ఆపై సాన్నిహిత్యం పెరిగి ఇంతటి అక్రమానికి దారితీసిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ప్రవీణ్‌కు ఎక్కువ మంది మహిళలతోనే మొబైల్ కాంటాక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు.. అతడు మహిళలతో సన్నిహితంగా మాట్లాడిన చాటింగ్‌లు, నగ్న చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు.
ప్రవీణ్‌తో రెగ్యులర్‌గా కాంటాక్టులు, చాటింగ్‌లు చేస్తున్న వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు సమాచారం. సుమారు 60 మంది మహిళలతో ప్రవీణ్‌కు కాంటాక్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసును విచారిస్తుస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ 60 మందినీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా 2017 నుంచి ప్రవీణ్ మొబైల్ ఫోన్ డేటాను పోలీసులు రికవరీ చేయనున్నట్లు తెలిసింది. 2017 నుంచి టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో ఎన్ని పబ్లిక్ పరీక్షలు జరిగాయి? ఆ సమయంలో ప్రవీణ్ ఏవైనా అక్రమాలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.
Updated Date - 2023-03-19T22:12:22+05:30 IST