Banjara Hills: ‘సురేష్‌బాబు, రాణా ఉద్దేశపూర్వకంగానే మోసం చేస్తున్నారు’
ABN, First Publish Date - 2023-02-12T12:51:34+05:30
దగ్గుబాటి సురేష్‌బాబు, రాణా ఉద్దేశపూర్వకంగానే మోసం చేస్తున్నారని బంజారాహిల్స్‌కు చెందిన
హైదరాబాద్/బంజారాహిల్స్: దగ్గుబాటి సురేష్‌బాబు, రాణా ఉద్దేశపూర్వకంగానే మోసం చేస్తున్నారని బంజారాహిల్స్‌కు చెందిన ప్రమోద్‌కుమార్ తెలిపారు. తన స్థలాన్ని కబ్జా చేయడంతో పోలీసులను ఆశ్రయించానని, వారు పట్టించుకోకపోవడంతో తాను కోర్టును ఆశ్రయించానని స్పష్టం చేశారు. ‘దగ్గుబాటి’ కుటుంబ సభ్యులు తనను కావాలని మోసం చేశారని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రమోదకుమార్ మాట్లాడుతూ ఫిలింనగర్ కో-ఆపరేటివ్ సొసైటీలోని ప్లాట్ నంబర్. 2లోని 1,007 గజాల స్థలాన్ని 2014లో సినీనిర్మాత సురేష్ బాబు నుంచి తాను లీజుకు తీసుకున్నానని, 2018లో కొనుగోలు కోసం రూ. 18 కోట్లకు ఒప్పందం చేసుకొని రూ. 5 కోట్లు ముందస్తుగా చెల్లించానని పేర్కొన్నారు.
కాగా భూమి ధరలు పెరగడంతో తనకు రిజిస్ట్రేషన్ చేయలేదని, 2019లో తాను కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. తనతో రూ.18 కోట్లకు ఒప్పందం చేసుకున్న సురే్‌షబాబు తన కుమారుడైన దగ్గుబాటి రాణా పేరుతో రూ. 9 కోట్లకు రిజిస్ట్రేషన్ చేశారని, కుమారుడు అవసరమైతే గిఫ్ట్ డీడ్ ఇవ్వొచ్చని అలా కాకుండా రిజిస్ట్రేషన్ చేయడం వెనుక వారి మోసాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. కాగా ఈ స్థలంలో తనకు సంబంధించిన ఆరుగురు కాపలాదారులు ఉన్నారని, కాగా నవంబర్ 1న ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు తన స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి కాపలాదారులను వెళ్లగొట్టి తమ కబ్జాలోకి తీసుకొన్నారన్నారు. దీనికితోడు వారిపై దాడికి పాల్పడ్డారన్నారు.
కాగా వీరిని సురేష్‌బాబు, రాణా దగ్గుబాటి పంపినట్లు అనుమానిస్తూ నవంబరు 3న నగర పోలీసు కమిషనర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలియజేశాడు. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము నాంపల్లిలోని కోర్టును ఆశ్రయించామని, కోర్టు కాగ్నిజెన్సీ తీసుకొని కేసులు నమోదు చేసిందన్నారు. తాను డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. న్యాయం జరిగే వరకూ పోరాడుతానని ప్రమోద కుమార్ స్పష్టం చేశారు.
Updated Date - 2023-02-12T13:10:14+05:30 IST