ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్న తారకరత్న తల్లిదండ్రులు
ABN, First Publish Date - 2023-02-20T10:43:59+05:30
తారకరత్న పార్థీవ దేహం ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకుంది. తారకరత్న తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీత ఇప్పుడే ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్నారు. ఫిలిం ఛాంబర్‌కు నందమూరి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు.
హైదరాబాద్ : తారకరత్న పార్థీవ దేహం ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకుంది. తారకరత్న తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీత ఇప్పుడే ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్నారు. ఫిలిం ఛాంబర్‌కు నందమూరి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. అభిమానుల సందర్శనార్ధం ఫిలిం ఛాంబర్‌లోనే మధ్యాహ్నం 3 గంటల వరకూ తారకరత్న భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్‌లోనే ఉంచనున్నారు.
తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కన్నుమూశారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన ఆయన.. అక్కడ గుండెపోటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. జనం మధ్యనే ఒక్కసారిగా కుప్పకూలిన తారకరత్నను పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి గ్రీన్ చానల్ ద్వారా ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాలు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. కాగా.. శివరాత్రి రోజున తారకరత్న తుదిశ్వాస విడిచారు.
పెళ్లి తర్వాత తల్లిదండ్రులకు దూరమైన తారకరత్న..
తారకరత్నది ప్రేమ వివాహం. 2012లో ‘దయ’ సినిమా షూటింగ్ సమయంలో తారకరత్నకు అలేఖ్య రెడ్డి పరిచయమైందట. ఆ పరిచయం కాస్తా ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే ఈ పెళ్లిని తారకరత్న తల్లిదండ్రులు సహా నందమూరి కుటుంబమంతా వ్యతిరేకించింది. దీంతో నందమూరి ఫ్యామిలీ మొత్తం ఆయన పెళ్లిని బహిష్కరించింది. స్నేహితుల సమక్షంలో అలేఖ్యను 2012లో తారకరత్న వివాహమాడారు. ఆ తరువాత కొంతకాలానికి తల్లిదండ్రులు మనసు మార్చుకుని కొడుకు, కోడల్ని దగ్గరకు తీశారు.
Updated Date - 2023-02-20T10:44:28+05:30 IST