Gurukula Koluvu : గురుకుల కొలువుకు వేళాయె
ABN, First Publish Date - 2023-04-07T03:07:47+05:30
నిరుద్యోగ టీచర్ అభ్యర్థులకు శుభవార్త! వారి ఎదురు చూపులు ఫలించాయి.
9,231 పోస్టుల భర్తీకి నియామక బోర్డు నోటిఫికేషన్
బీసీ గురుకులాల్లో 5,129, ఎస్సీ గురుకులాల్లో 1,671
ఎస్టీ గురుకులాల్లో 1,031; మైనారిటీల్లో 1,286 పోస్టులు
ఈనెల 12 నుంచే వన్ టైం రిజిస్ట్రేషన్‌కు అవకాశం
విభాగాలవారీగా మే 27 వరకూ దరఖాస్తుకు చాన్స్
ఆగస్టు-సెప్టెంబరుల్లో పరీక్షల నిర్వహణకు ప్రణాళిక
పకడ్బందీ నిర్వహణ, నిఘాకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్
మరో 1,433 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ టీచర్ అభ్యర్థులకు శుభవార్త! వారి ఎదురు చూపులు ఫలించాయి. గురుకుల పోస్టుల భర్తీకి ఎట్టకేలకు మోక్షం కలిగింది. దాదాపు 11 నెలలుగా సాగుతున్న అస్పష్టతకు తెర దించుతూ.. 9231 గురుకుల పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో అధికంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) పోస్టులు 4,020 ఉండగా.. జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్ పోస్టులు 2,008 ఉన్నాయి. అలాగే, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు 1,276, లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్ పోస్టులు 868, పాఠశాల లైబ్రేరియన్లు 434, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు 275, డ్రాయింగ్, ఆర్ట్ టీచర్ పోస్టులు 134, క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్స్ మరియు టీచర్లు 92, మ్యూజిక్ టీచర్ పోస్టులు 124 ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు విభాగాలవారీగా తేదీలను కూడా నిర్ణయించారు. టీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు; జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు; పీజీటీలు, పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, ఆర్ట్, డ్రాయింగ్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, ఇన్‌స్ట్రక్టర్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు వన్ టైం రిజిస్ట్రేషన్‌ను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ట్రిబ్.తెలంగాణ.గవ్.ఇన్ వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 12 నుంచే చేసుకోవచ్చు. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్‌లో అధికంగా బీసీ గురుకులాల్లో 5,129 పోస్టులు భర్తీ అవుతుండగా, ఎస్సీ గురుకులాల్లో 1,671, ట్రైబల్ వెల్ఫేర్‌లో 1,031, మైనారిటీ్‌సలో 1,286, రెసిడెన్షియల్ సొసైటీల్లో 93, మహిళా సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖలో 21 పోస్టులు భర్తీ కానున్నాయి. కాగా ఈ పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో భర్తీ కానున్నాయి. ఇందుకు రోస్టర్ ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రక్రియను కూడా ఫైనల్ చేసినట్టు సమాచారం.
ఆగస్టు, సెప్టెంబరులో పరీక్షలు
గురుకులాల్లో పోస్టుల భర్తీకి పరీక్షలను ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. వివిధ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మే 27 నాటికి పూర్తవుతుంది. అనంతరం పరిశీలనకు 45-60 రోజుల వరకు సమయం పట్టనుంది. ఆ తర్వాత పరీక్షలను నిర్వహించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో టీఎ్‌సపీఎస్సీ, పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తారస్థాయికి చేరడంతో వాటి ప్రభావం బోర్డుపై పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బోర్డులో నిఘాను పెంచనున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వరకూ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాలని రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు సొంతంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఇప్పటికే ట్రయల్‌ను కూడా పూర్తి చేసింది. ఏ రోజు ఏ ఉద్యోగి డ్యూటీ, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అనే వివరాలను కూడా పక్కాగా నమోదు చేసుకునేలా ప్రణాళిక రూపొందింస్తున్నారు.
మూడేళ్ల తర్వాత..
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2019-20లో గురుకులాల్లోని పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చి.. అప్పట్లో దాదాపు 3,500 మందిని రిక్రూట్ చేశారు. మళ్లీ మూడేళ్ల తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేశారు. వాస్తవానికి, రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ గత ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. గురుకులాల్లో 9 వేలకుపైగా పోస్టుల భర్తీకి జూన్‌లో ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఇటీవల మరో 2 వేల పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో, గురుకులాల్లో సుమారు 11,687 పోస్టులను భర్తీ చేసేందుకు అవకాశం ఏర్పడింది. కానీ, ప్రభుత్వం బీసీ గురుకులాలను, పాఠశాలలను పెంచడం.. అన్నింటికీ కలిపి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని యోచించడంతో ఇప్పటి వరకు ఆలస్యం జరిగింది. మొత్తం 11,687 పోస్టుల్లో 546 స్టాఫ్ నర్స్, హెల్త్ సూపర్‌వైజర్ పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా, 477 గ్రూప్-3, 4 పోస్టులను టీఎ్‌సపీఎస్సీ ద్వారా నియమించుకునేందుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం 9,231 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవిపోగా, వివిధ విభాగాల్లో మరో 1,433 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు టెట్, తత్సమాన కోర్సులు రాసిన వారు సుమారు 3 లక్షల మందికిపైగా ఉంటారని అంచనా.
పరీక్షలపై ఎన్నికల ప్రభావం
గురుకుల పోస్టుల భర్తీకి పరీక్షలను ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. అయితే, ఆ సమయంలో పరీక్షల నిర్వహణపై అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పడుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది డిసెంబరులోపు అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది. నవంబరు, డిసెంబరుల్లోనే పోలింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇందుకు రెండు నెలల ముందే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దాంతో, పరీక్షల నిర్వహణపై ఎన్నికల ప్రభావం ఉంటుందని విశ్లేషిస్తున్నాయి. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారిక వర్గాలు అంటున్నాయి.
17 వేల పోస్టులకు అనుమతులెప్పుడో..?
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం ఖాళీ పోస్టుల్లో ఇంకా 17వేల పోస్టులు ఆర్థిక శాఖ ఆమోదానికి నోచుకోవడం లేదు. ఈ పోస్టులకు ఆ శాఖ నుంచి ఆమోదం ఎప్పుడు వస్తుందా? అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు అనుమతులు మంజూరు చేసిన పోస్టులకు ఆయా నియామక బోర్డులు దశలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. తాజాగా గురువారం గురుకుల విద్యాలయ సంస్థల్లోని పోస్టుల భర్తీకి నోటిషికేషన్ జారీ అయింది. ప్రభుత్వం మొత్తం 91,142 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించగా.. ఇందులో 80,039 పోస్టులను డైరెక్ట్ రికూ్ట్రట్‌మెంట్ల ద్వారా భర్తీ చేస్తామని వెల్లడించింది.ఈ పోస్టులకుగాను ఇప్పటివరకు ఆర్థిక శాఖ దాదాపు 63 వేల పోస్టులకు అనుమతులు మంజూరు చేసింది. ఇంకా 17 వేల పోస్టులకు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. వీటికి కూడా అనుమతులు వస్తే ఆయా నియామక బోర్డులు నోటిఫికేషన్లను జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఆర్థిక శాఖ ఆ పోస్టులకు అనుమతులు మంజూరు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2023-04-07T03:57:15+05:30 IST