Kishan Reddy: 3 నెలలైతే పోయే ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలనా?
ABN, First Publish Date - 2023-01-25T18:42:19+05:30
మూడు నెలలైతే పోయే ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన ఎందుకని కేసీఆర్ సర్కారు...
న్యూఢిల్లీ: మూడు నెలలైతే పోయే ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన ఎందుకని కేసీఆర్(KCR) సర్కారును ఉద్దేశించి కేంద్ర మంత్రి, బీజేపీ (BJP) సీనియర్ నేత కిషన్రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని, రిపబ్లిక్ డే వేడుకలను సైతం రద్దు చేసే పరిస్థితికి చేరుకున్నారని చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పరేడ్గ్రౌండ్లో రిపబ్లిక్ వేడుకలు జరపడం ఆనవాయితీ అని అన్ని రాష్ట్రాలు ఈ సంప్రదాయాలు కొనసాగిస్తున్నాయని కిషన్రెడ్డి చెప్పారు. అయితే అంబేడ్కర్ను, రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానపరిచారని చెప్పారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ డుమ్మా కొడుతున్నారని, రాష్ట్రపతి, గవర్నర్ను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయన్నారు. కేసీఆర్ విచిత్రమైన, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ది వితండవాదం, నిజాం ఆలోచన అని తెలంగాణను భ్రష్ణు పట్టిస్తున్నారని చెప్పారు. ప్రధాని, గవర్నరు వస్తే కనీస గౌరవం కూడా చూపరని కిషన్ రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కుంటుంబం కారణంగా తెలంగాణ పరువు పోతోందన్నారు. అధికారం కోసమే కేసీఆర్ కుటుంబం పరితపిస్తోందని చెప్పారు. ప్రతిపక్షాలపై తెలంగాణ ప్రభుత్వం తీరు దారుణంగా ఉందన్నారు. దేశానికో విధానం, రాష్ట్రానికో విధానం ఉండదని, అందరు సీఎంలకు ఉండే విధానమే.. కేసీఆర్కు ఉంటుందన్నారు. తెలంగాణ సర్కార్ తీరును ఖండిస్తున్నామన్నారు. కొన్ని కనీస మర్యాదలు, గౌరవాలు పాటించాలని చెప్పారు.
జీ20 సదస్సుకు కేసీఆర్ హాజరుకాలేదని, ప్రధానమంత్రి వస్తే స్వాగతానికి రావడం లేదని కిషన్ రెడ్డి చెప్పారు. మహిళా గవర్నర్ను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నా గవర్నర్ పర్యటనలకు వెళ్తే కనీసం ప్రోటోకాల్ పాటించటం లేదన్నారు. కృష్ణా జలాల సమస్యపై సమావేశం పెడితే సీఎంగా దానికీ కేసీఆర్ రారని, ముఖ్యమంత్రి ప్రజాసంఘాల నేతలను కూడా కలవడని చెప్పారు. కేసీఆర్.. ఎమ్మెల్యేలను, ఎంపీలను కలవడంలేదన్నారు. కల్వకుంట్ల కుటుంబ కారణంగా తెలంగాణ పరువు పోతోందని కిషన్ రెడ్డి చెప్పారు. కుమారుడు సీఎం కాడేమోననే ఆలోచనతో కేసీఆర్ ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని, ఇలాంటి విధానంతో తెలంగాణ పూర్తిగా నష్టపోతుందన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమం ఉంటే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తారని, ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, పాదయాత్రలు చేయాలంటే.. న్యాయస్థానానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి వాపోయారు. గణతంత్ర దినోత్సవం జరపాలని ప్రజలు కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ వైఖరిని తెలంగాణ మేధావులు, విద్యార్థులు అర్థం చేసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
గవర్నర్ బడ్జెట్ సమావేశాలకు పిలిచి సభ్యులను ఉద్దేశించి.. ప్రసంగించే సాంప్రదాయం అన్ని రాష్ట్రాల్లో ఉంటుందని, తెలంగాణలో ఈ అంశానికి కూడా తిలోదకాలు ఇచ్చారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి రాజ్యాంగ శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. శకటాల ప్రదర్శనలో తెలంగాణతో పాటూ మరికొన్ని రాష్ట్రాలకు చోటు దక్కలేదని, శకటం పెడితే కల్వకుంట్ల కుటుంబసభ్యుల ఫోటోలు పెట్టాల్సి ఉంటుందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Updated Date - 2023-01-25T19:11:29+05:30 IST