Medico Preethi Case : ప్రీతిది ఆత్మహత్యేనని నిన్న తేల్చిన పోలీసులు.. సీపీ రంగనాథ్‌ను కలిసిన తర్వాత ఆమె తండ్రి ఇవాళ ఇలా..
ABN, First Publish Date - 2023-04-22T16:54:08+05:30
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెను సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి (Medico Preethi) మృతి కేసులో మిస్టరీ వీడింది...
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెను సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి (Medico Preethi) మృతి కేసులో మిస్టరీ వీడింది. ఇన్ని రోజులూ అసలు ప్రీతిది హత్యా..? ఆత్మహత్యా..? అని సస్పెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం నాటితో ఈ కేసు కొలిక్కి వచ్చేసింది. ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ రంగనాథ్ (Warangal CP Ranganath) తేల్చేశారు. ఈ విషయం పోస్టుమార్టమ్ రిపోర్టుతో తేలిందన్నారు. అయితే.. ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే సీపీని ప్రీతి తండ్రి నరేందర్ (Medico Preethi Father Narender), సోదరుడు పృథ్వీ కలిశారు. ఈ సందర్భంగా.. ప్రీతి మృతికి సంబంధించి తమకున్న అనుమానాలు, అభిప్రాయాలను సీపీ రంగానాథ్‌తో తండ్రి పంచుకున్నారు. ఇందుకు స్పందించిన సీపీ.. టాక్సీ కాలేజీ, పోస్టుమార్టం తదితర రిపోర్టులకు సంబంధించి అన్ని వివరాలను సీపీ వివరించారు. కేసు ప్రస్తుత స్థితి పూర్వపరాలను కూడా సీపీ ఈ సందర్భంగా ప్రీతి కుటుంబ సభ్యులకు వివరించారు. సుమారు అరగంటకుపైగా సీపీతో చర్చ జరిగింది. ఈ భేటీ తర్వాత ప్రీతి తండ్రి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును మేం నమ్ముతున్నాం..!
‘ప్రీతి కేసులో పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోంది. సీపీతో మా అనుమానాలు నివృత్తి చేసుకున్నాం. ఛార్జిషీట్‌లో కొన్ని పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారు. కేఎంసీ ప్రిన్సిపాల్, హెచ్‌వోడీల బాధ్యతారాహిత్యం ఉందనుకుంటున్నాం. ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం. సిరంజి దొరికిందని సీపీ చెప్పారు. శరీరంలో విష పదార్థాలున్నట్లు రిపోర్టులో వచ్చిందని సీపీ మాకు వివరించారు. పోస్టు మార్టమ్ రిపోర్టు మాత్రం సీపీ చూపించలేదు. నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని సీపీని కోరాం’ అని ప్రీతి తండ్రి నరేందర్ మీడియాకు వెల్లడించారు. అయితే ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. కచ్చితంగా ఇది హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ వస్తున్నారు. అంతేకాదు ఇదంతా పక్కా పథకం ప్రకారమే జరిగిందని కూడా హత్యేనని చెప్పారు.
ఇంతకీ సీపీ ఏం చెప్పారు..!?
‘వరంగల్ కేఎంసీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి 57 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రీతి మృతదేహానికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించాం. చివరికి పోస్టుమార్టం రిపోర్టులో ప్రీతి మృతికి ఫెంటానిల్ కారణమని తేలింది. ఆమె శరీరంలో ఫెంటానిల్ అవశేషాలున్నాయి. సీనియర్ విద్యార్థి మహ్మద్ సైఫ్ వేధించడం వల్లే ప్రీతి మానసికంగా ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నాం. ప్రీతి మృతి చెందిన రోజు ఆమె గదిలో వాడిన సిరంజి దొరికింది.. దానికి ఉపయోగించిన సూది మాత్రం లభించలేదు. ఆ సూది దొరక్కపోవడం వల్లే కేసులో జాప్యం జరిగింది. ముందుగా ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చిన అన్ని సెక్షన్లూ నిందితుడు సైఫ్‌కి వర్తిస్తాయి. ప్రీతి మృతి చెందినప్పటి నుంచి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని, చివరికి పోస్టుమార్టం నివేదికలో ఆత్మహత్య చేసుకున్నట్లు అన్ని ఆధారాలతో తేలింది. సైఫ్‌పై ముందుగా పెట్టిన కేసుల్లో ఐపీసీ 306తో పాటు అట్రాసిటీ కేసులు కొనసాగిస్తాం. డాక్టర్ సైఫ్ వేధించినట్లు ఆధారాలు ఉన్నాయి. అతనే ప్రధాన నిందితుడు. త్వరలో కేసుకు సంబంధించి కోర్టులో చార్జిషీట్ వేస్తాం’ అని సీపీ రంగనాథ్ శుక్రవారం నాడు మీడియాకు వెల్లడించారు.
ఎన్ని మలుపులో..!
సంచలనం సృష్టించిన ప్రీతి మృతి కేసు ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆత్మహత్యగా ముగిసింది. 57 రోజుల తర్వాత పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఆమెది ఆత్మహత్య అని నిర్ధారించడం గమనార్హం. ఈ కేసు ఆదినుంచీ మిస్టరీగానే కొనసాగింది. పోస్టుమార్టం నివేదికలో జాప్యం జరగడంతో అనుమానాలు పెరిగిపోయాయి. ఆమెను హత్య చేశారనే ప్రచారం కూడా జరిగింది. తమ కూతురి శరీరంపై గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పారు. ఫిబ్రవరి 26న ప్రీతి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ తర్వాత నెల రోజులు గడిచినా ఏమీ తేల్చపోవడంతో పోలీసులపైనా ఆరోపణలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో ప్రీతి మృతికి ఫెంటానిల్ కారణమని, ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలిందని సీపీ తేల్చిచెప్పారు. కానీ, పోస్టుమార్టం నివేదికకు రెండు నెలల సమయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-04-22T17:03:57+05:30 IST