అక్రమార్కులు!
ABN, First Publish Date - 2023-01-12T23:29:51+05:30
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని కొందరు అక్ర మార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆహార భద్రత పథకాన్ని అభాసుపాలు చేస్తున్నారు.
జిల్లాలో రెచ్చిపోతున్న రైస్ మాఫియా
పెద్దలకు చేరుతున్న పేదల బియ్యం
రీసైక్లింగ్‌తో మళ్లీ సర్కారు గోడౌన్లకే చేరుతున్న సబ్సిడీ బియ్యం
రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనక కీలక సూత్రధారులు!
గ్యాంగ్ వార్‌కు కారణమవుతున్న అక్రమ రైస్ దందా
కానరాని సివిల్ సప్లయి అధికారుల తనిఖీలు
అభాసుపాలవుతున్న ఆహార భద్రత పథకం
ఖిల్లా, జనవరి 12: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని కొందరు అక్ర మార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆహార భద్రత పథకాన్ని అభాసుపాలు చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద కుటుంబాలకు చెందాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల పాలవుతోంది. ప్రతినెలా అక్రమ మార్గాల్లో వందలాది క్వింటాళ్ల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోంది. ఓ వైపు పోలీసులు అడపాదడపాగా దాడులు జరుపుతున్నప్పటికీ, మరోవైపు అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. బియ్యం స్మగ్లింగ్ దందాకు అలవాటుపడిన అక్రమార్కులకు పలువురు పెద్దల అండదండగా నిలుస్తుండడంతో సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతోంది. రోజురోజుకూ విస్తరించుకపోతున్న బియ్యం అక్రమ దందాతో సంబంధాలు ఏర్పరచుకున్న రౌడీషీటర్లు గ్యాంగ్‌వార్‌లకు దిగి దారుణ హత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇటీవలే జిల్లా కేంద్రానికి చెందిన రౌడీషీటర్ ఇబ్రహీం చావుష్ అలియాస్ జిగిల్ ఇబ్బును బియ్యం స్మగ్లింగ్ దందాలో వాటా అడిగాడనే కారణంగానే మరో రౌడీషీటర్ ఆరిఫ్‌డాన్ తన అనుచరులతో కత్తులతో దాడి చేసి దారుణంగా చంపారని పోలీసుల దర్యాప్తులో తేలడంతో పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ తీవ్రత చాటింది.
ప్రభుత్వ బియ్యం పేదల ద్వారా పెద్దలకు..
పేదల సంక్షేమానికి కిలో రూపాయికే బియ్యం జాతీయ పంపిణీ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఇటీవల కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టాయి. అయితే పథకం ద్వారా పంపిణీ అవుతున్న బియ్యాన్ని కొందరు కొనుగోలు చేయక రేషన్ డీలర్లకే ఎక్కువ ధరకు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇలా మిగిలిన బియ్యాన్ని డీలర్లు అక్రమ మార్గంలో వ్యాపారులకు ముట్టచెప్పి అక్రమ ధనార్జన పాల్పడుతున్నారు. ఇదే బియ్యాన్ని కింది స్థాయి నుంచి కొనుగోలు చేసిన అక్రమ రవాణ దారులు ఒక చోట నిలువ ఉంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. దీంతో పేదల బియ్యం తిరిగి రీసైక్లింగ్ పద్ధతిలో ప్రభుత్వానికి ఎక్కువ ధరలకు చేరుతున్నాయి. వాటినే తిరిగి ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తోంది.
ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రవాణా..
జిల్లాలోని రేషన్ దుకాణాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున సబ్సిడీ బియ్యాన్ని అక్రమార్కులు రవాణా చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన బియ్యాన్ని ఒక చోట నిలువ ఉంచి వాటిని అక్కడి నుంచి ఇతర వాహనాలపై ఇతర రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఈ వ్యాపారం చేస్తున్న వారిపై కక్షలు పెంచుకుని వారి వద్ద నుంచి నెల నెలా మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఇవ్వకుంటే దాడులకు దిగుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జిల్లా కేంద్రంలో వర్గపోరు పెరిగి దాడులు చేసుకుంటున్నారు. కేవలం దాడులు మాత్రమే కాకుండా హత్యలు చేసుకునే స్థాయికి చేరారు.
జిల్లా వ్యాప్తంగా 761 పంపిణీ కేంద్రాలు..
జిల్లాలో మొత్తం 4లక్షల 3వేల 225మంది లబ్ధిదారులున్నారు. వీరికి నెల ెలా 6020 క్వింటాళ్ల బియ్యం 761దుకాణాల ద్వారా పంపిణీ జరుగుతోంది. ఇందులో పేదల వద్ద కొనుగోలు చేసిన బియ్యాన్ని కొందరు అక్రమ రవాణ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యాపారానికి అధికార పార్టీ నేతలతో పాటు వివిధ రాజకీయ నాయకులు ఈ దందాను కొనసాగిస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన సంబంధిత శాఖాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్ల ఈ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. పోలీసు కమిషనర్ ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి దాడులు చేయిస్తున్నా అక్రమ దందాకు అడ్డుకట్ట పడడం లేదు.
ఇబ్బు హత్యతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం..
ఇటీవల జరిగిన రౌడీషీటర్ల మధ్య వర్గపోరులో ఇబ్బు హత్యకు గురయ్యాడు. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయడానికి కింది స్థాయి పోలీసు సిబ్బందికి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యాపారం వల్లే కత్తుల దాడులు పెరిగిపోయాయని నిర్ణయానికి వచ్చారు. జిల్లా కేంద్రంలో రౌడీషీటర్లుగా ముద్ర ఉన్న వారి జాబితాను గుర్తించి వారి కదలికలపై నిఘా పెట్టారు. భవిష్యత్తులో హత్యలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు.
Updated Date - 2023-01-12T23:29:54+05:30 IST