కామారెడ్డి మునిసిపాలిటీ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలి
ABN, First Publish Date - 2023-01-06T03:44:32+05:30
కామారెడ్డి మునిసిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ఉపాధ్యాయుల పరిష్కారానికి కృషి : భట్టి
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి మునిసిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామాల ప్రజలు, రైతులు చేస్తున్న ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగలేఖ రాశారు. నెల రోజులుగా ప్రజలు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డిలో రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని, రాములు కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌లో రైతుల పొలాలను పారిశ్రామికవాడల కింద గుర్తించడం వల్ల కొద్దిగా భూములున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా రైతుల ఉద్యమం నడుస్తున్నా స్పందించకపోవడం రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికున్న చిన్న చూపునకు నిదర్శనమన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. గురువారం శాససనసభ ప్రాంగణంలో స్కూల్ టీచర్ ఫెడరేషన్ (ఎస్‌టీఎఫ్) యూనియన్ క్యాలెండర్‌ను భట్టి విక్రమార్క ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాగా రాష్ట్రంలో ‘హాత్‌సే హాత్ జోడో’ను విజయవంతం చేయడానికి పార్టీలోని అన్ని విభాగాల కార్యకర్తలు, నేతలను సమన్వయం చేసుకోవాలని టీపీసీసీ సమావేశం నిర్ణయించింది. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన హాత్‌సే హాత్ జోడో సన్నాహక కమిటీ సమావేశంలో టీపీసీసీ అనుబంధ సంఘాల చైర్మన్లు, పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు. కాగా సర్పంచుల సమస్యలపై ఈ నెల 9న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. గత కాంగ్రెస్ హయాంలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు ప్రకటించడంతో ఈసారి 42 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాల్లో 934 మంది మైనారిటీ వర్గం విద్యార్థులు ఎంబీబీఎ్‌సలో ప్రవేశాలు పొందినట్టు మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ తెలిపారు. మైనారిటీల సంక్షేమంపై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. మరోవైపు సీఎం కేసీఆర్.. తెలంగాణ పదం వినపడకూడదని కుట్ర పన్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బండి సుధాకర్‌గౌడ్ ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటాను ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారని ఉద్యమకాలంలో చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు నదీజలాల వివాదంపై బీఆర్‌ఎస్ వైఖరేంటో చెప్పాలని గురువారం డిమాండ్ చేశారు.
Updated Date - 2023-01-06T03:44:33+05:30 IST