Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ ఆసియా అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ!
ABN, Publish Date - Jan 05 , 2024 | 03:50 PM
గతేడాది ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని గడ్డు కాలం చవి చూసిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మళ్లీ పుంజుకున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని దాటేసి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు.
గతేడాది ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని గడ్డు కాలం చవి చూసిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ (Gautam Adani ) మళ్లీ పుంజుకున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని (Mukesh Ambani) దాటేసి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు (Asia`s richest person). గతేడాది ఆరంభంలో అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ ``హిండెన్‌బర్గ్`` (Hindenburg Research) చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా అదానీ గ్రూప్ షేర్లు కుప్ప కూలిపోయాయి. అప్పటికి ఆసియా కుబేరుడిగా ఉన్న అదానీ.. హిండెన్‌బర్గ్ ఆరోపణలతో ఒక్కసారిగా 35వ స్థానానికి పడిపోయారు.
ఆ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపేందుకు అదానీ అనేక చర్యలు చేపట్టారు. అనేక మంది కొత్త ఇన్వెస్టర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. గడువు కంటే ముందుగానే చాలా రుణాలను చెల్లించారు. బ్యాంకుల నుంచి కొత్తగా రుణాలు తీసుకున్నారు. దీంతో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు మళ్లీ గాడిన పడ్డాయి. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అదానీ గ్రూపు నెత్తిన పాలు పోసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సెబీ దర్యాఫ్తు మినహా మరే ఇతర దర్యాఫ్తూ అవసరం లేదని ఇటీవల సుప్రీం కోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
ఆ తీర్పుతో అదానీ గ్రూపు షేర్లు భారీగా లాభపడ్డాయి. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఒక్కరోజులోనే గౌతమ్ అదానీ సంపాదన 7.7 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం సంపద 97.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (97 బిలియన్ డాలర్లు)ని దాటేసి అసియాలో అత్యంత ధనవంతుడిగా అదానీ నిలిచారు. కాగా, ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీ 12వ స్థానానికి చేరుకోగా, అంబానీ 13వ స్థానంలో ఉన్నారు.
Updated Date - Jan 05 , 2024 | 04:06 PM