India vs Maldives: చెలరేగిన మరో వివాదం.. ఆ అంశంపై భారత్‌ని నిలదీసిన మాల్దీవులు
ABN, Publish Date - Feb 03 , 2024 | 07:57 PM
మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జు ఏ ముహూర్తాన ప్రమాణస్వీకారం చేశాడో తెలీదు కానీ, అప్పటి నుంచి భారత్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. తొలుత టూరిజం అంశంలో ఇరు దేశాల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో.. ఆ వివాదం బాగా ముదిరింది.
మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జు ఏ ముహూర్తాన ప్రమాణస్వీకారం చేశాడో తెలీదు కానీ, అప్పటి నుంచి భారత్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. తొలుత టూరిజం అంశంలో ఇరు దేశాల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో.. ఆ వివాదం బాగా ముదిరింది. ఈ వ్యవహారం ఇంకా కొనసాగుతున్న తరుణంలోనే.. తాజాగా ఇరుదేశాల మధ్య మరో వివాదం అగ్గిరాజుకుంది. ఈ క్రమంలోనే వివరణ ఇవ్వాలంటూ భారత్‌ని మాల్దీవులు కోరింది.
అసలు ఏమైందంటే.. జనవరి 31న ‘హా అలీఫు అటోల్’కు ఈశాన్య దిశలో 72 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న మాల్దీవుల స్పెషల్ ఎకనామిక్ జోన్ (EEZ) పరిధిలో మూడు ఫిషింగ్ బోట్లు చేపల వేటలో ఉన్నప్పుడు, భారత సైన్యం వాటిని అడ్డగించిందని మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కోస్టుగార్డుకు చెందిన 246, 253 బృందాలు ఈ ఘటనకు పాల్పడ్డారని.. వాళ్లు తమ బోట్లని అడ్డగించి ఎక్కారని తెలిపింది. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను ఉల్లంఘించి.. ఈ బోట్లను ఎందుకు అడ్డగించాల్సి వచ్చిందో సమగ్ర వివరాల్ని అందించాలని భారతదేశాన్ని కోరింది. అయితే.. దీనిపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇదిలావుండగా.. ముయిజ్జు చైనా అనుకూల వ్యక్తిగా పేరుగాంచాడు. అందుకు తగినట్లుగానే అతడు చైనా బాటలో నడుస్తున్నాడు. భారత్‌తో ప్రస్తుతం నెలకొన్న వివాదాలకు చెక్ పెట్టే దిశగా ఆలోచనలు చేయకుండా.. చైనాతో సంబంధాల్ని బలపరచుకునే పనిలో అతడు నిమగ్నమయ్యాడు. ఇప్పటికే చైనాలో పర్యటించిన ను.. చైనా పరిశోధక నౌకను కూడా తమ జలాల్లోకి అనుమతించాడు. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తే.. తమ అనుమతితోనే అది వచ్చిందంటూ మాల్దీవుల ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ఇది ఇలాగే కొనసాగితే.. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయి.
Updated Date - Feb 03 , 2024 | 07:57 PM