Maldives: ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరి.. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాలుడి మృతి
ABN, Publish Date - Jan 21 , 2024 | 10:18 AM
భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు(Mohamed Muizzu) వైఖరి ఓ బాలుడి ప్రాణాన్ని బలికొంది. అత్యవసర పరిస్థితిలో భారత్ అందించిన ఎయిర్ క్రాఫ్ట్‌ను వినియోగించడానికి ముయిజ్జు నిరాకరించడంతో మాల్దీవులకు చెందిన14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
మాలే: భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు(Mohamed Muizzu) వైఖరి ఓ బాలుడి ప్రాణాన్ని బలికొంది. అత్యవసర పరిస్థితిలో భారత్ అందించిన ఎయిర్ క్రాఫ్ట్‌ను వినియోగించడానికి ముయిజ్జు నిరాకరించడంతో మాల్దీవులకు చెందిన14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గఫ్ అలీఫ్ విల్లింగిలికి చెందిన బాలుడికి బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) వచ్చింది. అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం రాజధాని మాలేలోని ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.
అందుకోసం ఎయిర్ అంబులెన్స్ కావాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరారు. దానికి వారు పర్మిషన్ ఇవ్వలేదు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ దొరకకపోవడంతో.. 16 గంటల తరువాత బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
స్ట్రోక్ వచ్చిన వెంటనే బాలుడ్ని మాలేకి తీసుకెళ్లడానికి అధికారులకు ఫోన్ చేసినా వారి నుంచి సమాధానం రాలేదని తండ్రి వాపోయాడు. అత్యవసరాల్లో వినియోగించడానికి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కి చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌ను గతంలో భారత్.. మాల్దీవులకు అందించింది. బాలుడి కోసం దాన్ని వినియోగించడానికి ముయిజ్జు ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడిపై ముయిజ్జు ప్రభుత్వ నిర్లక్ష్యం, భారత్‌పై ప్రదర్శిస్తున్న ద్వేషంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ భారత భూభాగ పరిధిలోని లక్షద్వీప్‌లో పర్యటించిన అనంతరం.. భారత్ - మాల్దీవుల మధ్య చెలరేగిన వివాదం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి.
Updated Date - Jan 21 , 2024 | 10:38 AM