Moon: చందమామ... చిక్కిపోతున్నాడు!
ABN, Publish Date - Feb 04 , 2024 | 04:59 AM
‘తెలిసిందిలే... తెలిసిందిలే.. నెలరాజ నీ రూపు తెలిసిందిలే...’ అంటూ ఎన్ని పాటలు పాడుకున్నా చంద్రుడి గురించి మనకు తెలిసింది ఆవగింజంత కూడా లేదని తేలిపోయింది. జాబిల్లికి సంబంధించి ఆసక్తికరమైన, సవాలుతో కూడిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే మన చందమామ
ఇప్పటికే 150 అడుగులు తగ్గిపోయిన చుట్టుకొలత
ఎండిన ద్రాక్షపై వచ్చినట్లు చంద్రుడిపై ముడతలు
జాబిల్లి అంతర్భాగంలో శీతలీకరణ ప్రక్రియతోనే...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ‘తెలిసిందిలే... తెలిసిందిలే.. నెలరాజ నీ రూపు తెలిసిందిలే...’ అంటూ ఎన్ని పాటలు పాడుకున్నా చంద్రుడి గురించి మనకు తెలిసింది ఆవగింజంత కూడా లేదని తేలిపోయింది. జాబిల్లికి సంబంధించి ఆసక్తికరమైన, సవాలుతో కూడిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే మన చందమామ బక్కచిక్కిపోతోంది. అంతర్భాగంలో శీతలీకరణ ప్రక్రియ ఫలితంగా జాబిల్లి కుంచించుకుపోతున్నట్లు తేలింది. ఈ క్రమంలో ఏర్పడే సంకోచాలతో ఎండిన ద్రాక్ష పండుపై వచ్చినట్లే చంద్రుడి ఉపరితలంపైనా ముడతలు పడుతున్నాయి. సాంకేతిక పరిభాషలో ‘పీడన భ్రంశం’గా పిలిచే ఈ ముడతలు ప్రాథమికంగా చంద్రుడి భౌగోళిక స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. గత కొన్ని లక్షల సంవత్సరాల కాలంలో చందమామ దాదాపు 150 అడుగుల మేర చిక్కిపోయాడని తాజా అధ్యయనంలో వెల్లడైంది. లోపలి పొరలు చల్లబడుతున్న కొద్దీ పెళుసుగా ఉన్న చంద్రుడి ఉపరితలంపై పగుళ్లు, గుట్టలు, లోయలు వంటివి ఏర్పడుతున్నాయి. కొన్ని పదుల మీటర్లు ఎత్తున ఉండే ఈ గుట్టలు చంద్రుడి మారుతున్న స్వరూపానికి నిదర్శనం. జాబిల్లి ఉపరితలం భౌగోళికంగా నిద్రాణ స్థితిలో ఉంటుందని ఇప్పటి వరకూ ఉన్న భావనలకు ఇది పూర్తి విరుద్ధంగా ఉండటంతో పాటు భవిష్యత్తులో చంద్రుడిపై చేపట్టే అన్వేషణలకు సంబంధించి ఆందోళన రేకెత్తించే అంశంగా మారింది.
తాజాగా ఏర్పడిన పగుళ్లు చంద్రుడి ఉపరితలం నేటికీ చురుకుగానే స్పందిస్తోందని చెప్పడానికి ఒక సూచన. వీటి కారణంగానే జాబిల్లి ఉపరితలంపై తరచూ ప్రకంపనాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ చంద్రకంపాలను ఎదుర్కోవాల్సి రావడం వ్యోమగాములకు అదనపు సవాలుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. చంద్రుడి క్రియాశీల స్వభావానికి విరుద్ధంగా దాని డైనమిక్ స్వభావాన్ని గుర్తించాల్సిన అవసరాన్ని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన థామస్ ఆర్. వాటర్స్ నొక్కిచెప్పారు. ఈ కారణంగానే చంద్రుడి ఉపరితలంపై బలమైన ప్రకంపనలు వస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని వివరించారు. భవిష్యత్తు లూనార్ మిషన్లతో పాటు చంద్రుడిపై కాలనీల ఏర్పాటు గురించి చర్చలు సాగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రకంపనాలపై మరింత లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని థామస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Updated Date - Feb 04 , 2024 | 06:17 AM