NRI: వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ‘మీరజాలగలడా నా యానతి’ కార్యక్రమం
ABN, Publish Date - Feb 03 , 2024 | 06:49 PM
వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో "మీరజాలగలడా నా యానతి" కార్యక్రమం అంతర్జాల వేదికపై శనివారం ఘనంగా జరిగింది.
ఎన్నారై డెస్క్: వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజానటి కళాభారతి డాక్టర్ జమున రమణారావు నటించిన సినిమాలలో ఆమె నటనా వైదుష్యంపై విశ్లేషణా ప్రసంగాలతో "మీరజాలగలడా నా యానతి" కార్యక్రమం అంతర్జాల వేదికపై శనివారం ఘనంగా జరిగింది.
భారత్, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా, హాంకాంగ్, ఖతార్, యుగాండా, కెనడా, అమెరికా దేశాల నుండి 35 మంది ప్రఖ్యాత రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని జమున నటించిన చిత్రరాజాల నుండి 35 ఆణిముత్యాలైన సినిమాలను ఎంపిక చేసుకొని, వాటిలో ఆమె కనబరిచిన నటనా ప్రావీణ్యం, వివిధ రకాల పాత్రలలో ఆమె ఇమిడిపోయిన తీరు గురించి విశ్లేషిస్తూ అద్భుతమైన ప్రసంగాలను చేశారు.
ముఖ్య అతిథిగా చెన్నై నుండి ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర పాల్గొని జమున నటనా ప్రభావ విశేషాలను గురించి, నిజ జీవితంలో ఆమె కనబరిచిన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని గురించి ప్రసంగించారు.
రచయిత్రి రాధిక మంగిపుడి సభా నిర్వహణ గావించగా అలనాటి మేటి చిత్రాలైన మిస్సమ్మ, శ్రీకృష్ణతులాభారం, గుండమ్మ కథ, అప్పుచేసి పప్పుకూడు, యశోదా కృష్ణ, మంగమ్మ శపథం, మూగమనసులు, చిరంజీవులు, బంగారు తల్లి..వంటి చిత్రాలలో జమున నటించిన వైవిధ్యభరితమైన పాత్రల ఔచిత్యాన్ని చక్కగా రచయితలు ఆభివర్ణించారు. సినిమాలతో పాటు జమున గారితో వీరందరికీ ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని గురించి కూడా తలచుకుంటూ ఆమెకు నివాళులు అర్పించారు.
వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధా దేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజా సుంకరపల్లి నిర్వహణా సహకారం అందించారు. కల్చరల్ టీవీ శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేశారు.
Updated Date - Feb 03 , 2024 | 06:54 PM