India vs South Africa: బుమ్రా దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బ.. భారత్ లక్ష్యం ఎంతంటే?
ABN, Publish Date - Jan 04 , 2024 | 03:48 PM
న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఆటలో భాగంగా.. సౌతాఫ్రికా జట్టు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు మరోసారి మ్యాజిక్ చేయడంతో..
India vs South Africa: న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఆటలో భాగంగా.. సౌతాఫ్రికా జట్టు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు మరోసారి మ్యాజిక్ చేయడంతో, 176 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ముఖ్యంగా.. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన బుమ్రా, రెండో ఇన్నింగ్స్‌లో విలయతాండవం చేశాడు. అతడు ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి.. సౌతాఫ్రికా బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. బుమ్రా దెబ్బకు ఆ జట్టు 176 పరుగులకే తట్టాబుట్టా సర్దేయాల్సి వచ్చింది.
అందునా.. ఐడన్ మార్క్‌రమ్ ఒక్కడే అద్భుతం ఆటతీరు కనబర్చాడు. ఓపెనర్‌గా వచ్చిన అతగాడు.. కేవలం 103 బంతుల్లోనే 17 ఫోర్లు, 2 సిక్సుల సహకారంతో 106 పరుగులు చేశాడు. అతడు శతక్కొట్టడం వల్లే సౌతాఫ్రికా జట్టు 176 పరుగులు చేయగలిగింది. దీంతో.. సౌతాఫ్రికా జట్టు 78 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇప్పుడు ఈ మ్యాచ్ గెలుపొందాలంటే, టీమిండియా 79 పరుగులు చేయాల్సి ఉంటుంది. చూడ్డానికి లక్ష్యం తక్కువగానే ఉన్నా.. ఈ పిచ్ పేస్‌కి బాగా అనుకూలిస్తోంది కాబట్టి, భారత బ్యాటర్లు ఆచితూచి రాణించాల్సి ఉంటుంది. అనవసరమైన షాట్ల జోలికి వెళ్లకుండా, మెల్లగా రాణిస్తే ఈ మ్యాచ్ భారత్ సొంతం అవ్వడం ఖాయం. ఈ మ్యాచ్ భారత్ గెలుపొందితే.. 1-1 పాయింట్లతో సిరీస్ డ్రాగా ముగుస్తుంది.
ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. జస్‌ప్రీత్ బుమ్రా 6 వికెట్లతో చెలరేగాడు. సౌతాఫ్రికా బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. మహమ్మద్ సిరాజ్ మాత్రం ఒక్క వికెట్‌తోనే సర్దుబాటు చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో విజృంభించి, సౌతాఫ్రికా బ్యాటింగ్ పతనాన్ని శాసించిన ఈ హైదరాబాద్ ఆటగాడు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేయలేకపోయాడు. ఇక ముకేశ్ కుమార్ రెండు, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టారు.
Updated Date - Jan 04 , 2024 | 03:48 PM