మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2022-05-07T06:36:28+05:30 IST

ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి మరో పెద్ద దెబ్బ తగిలింది.

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ
అరెస్టయిన మావోయిస్టు నాగేశ్వరరావు(ఫైల్‌)

పెదబయలు- కోరుకొండ ఏరియా కమిటీ సభ్యులు కొర్రా నాగేశ్వరరావు, సిందేరి జగన్‌ అరెస్టు

మరో ఐదుగురు సభ్యులు డీజీపీ ఎదుట లొంగుబాటు

గత నాలుగేళ్లలో ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో పార్టీ బలహీనం

గాలికొండ కమిటీ గతంలోనే నిర్వీర్యం

అదే బాటలో పెదబయలు- కోరుకొండ ఏరియా కమిటీ?

విశాఖ మన్యంలో కార్యకలాపాలపై తీవ్రప్రభావం



పాడేరు, మే 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి  మరో పెద్ద దెబ్బ తగిలింది. పెదబయలు- కోరుకొండ ఏరియా కమిటీకి చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్టు చేయగా,  మరో ఐదుగురు సభ్యులు శుక్రవారం మంగళగిరిలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వద్ద లొంగిపోయారు. పోలీసులు అరెస్టు చేసిన పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ సభ్యుడు కొర్రా నాగేశ్వరరావు రెండు దశాబ్దాలుగా ఉద్యమంలో ఉన్నాడు. ఆయనపై మూడు హత్యలతోపాటు సుమారు 50 కేసులు వున్నాయి. 

 ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో అల్లూరి జిల్లా పరిధిలోని ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పెదబయలు- కోరుకోండ ఏరియా కమిటీ  పార్టీ కార్యాకలాపాలు నిర్వహిస్తున్నది. అయితే మూడేళ్ల నుంచి జరుగుతున్న పలు సంఘటనలు మావోయిస్టు పార్టీని బలహీనపరుస్తున్నాయి. లొంగుబాట్లు, అరెస్టులు, ఎదురుకాల్పుల్లో మరణాలు ఉద్యమంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మూడేళ్ల క్రితం కొయ్యూరు సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్‌, మరో దళసభ్యుడు మరణించారు. 2019 డిసెంబర్‌లో తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దులోని జీకేవీధి మండలం ధారకొండ నేలజర్త, గుమ్మిరేవులు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో డీసీఎం, ఏసీఎంతోపాటు ముగ్గురు దళసభ్యులు ఉన్నారు. గత ఏడాది జూన్‌ 16వ తేదీన కొయ్యూరు తీగలమెట్ట అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్యజరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. తరువాత తెలంగాణకు చెందిన ఏవోబీ ఎస్‌జడ్‌సీ సభ్యుడు కృష్ణ, డీసీఎం నవీన్‌ లొంగిపోయాడు. ఆగస్టు రెండో వారంలో పెదబయలు- కోరుకొండ ఏరియా, ఒడిశాలోని కలిమెల ఏరియా కమిటీలకు చెందిన ఆరుగురు మావోయిస్టులు (పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి చిక్కుడు చిన్నారావు అలియాస్‌ సుధీర్‌, ఏరియా కమిటీ సభ్యులు వంతాల పన్ను అలియాస్‌ మహిత, మడకం సోమిడి, మడకం మంగ్లు, కలిమెల ఏరియా కమిటీ సభ్యులు పోయం రుకిని అలియాస్‌ రింకీ, సోడే భీమ్‌) అమరావతిలో నాటి డీజీపీ గౌతంసవాంగ్‌ ఎదుట లొంగిపోయారు. ఏడాది క్రితం కుంకుంపూడిలో గెమ్మెలి హరిని పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబరు 12వ తేదీన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా తులసిపహాడ్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులు ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. తాజాగా ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేయడం, మరో ఐదుగురు లొంగిపోవడంతో ఏవోబీ మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

తాజాగా ఇద్దరు మావోల అరెస్టు

పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ సభ్యులు కొర్రా నాగేశ్వరరావు(50), సిందేరి జగన్‌లను అల్లూరి జిల్లా పోలీసులు గత వారం ఒడిశా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అయితే వీరిని జీకేవీధి మండలం ధారకొండ అటవీ ప్రాంతంలో అరెస్టు చేసినట్టు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం మంగళగిరిలో ప్రకటించారు. చింతపల్లి మండలం గుల్లెలబంద గ్రామానికి చెందిన కొర్రా నాగేశ్వరరావు 20 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో ఉన్నాడు. ఇతనిపై మూడు హత్యలతోపాటు సుమారు 50 కేసులు వున్నాయి. కొయ్యూరు మండలం నల్లబెల్లికి చెందిన మరో సభ్యుడు సిందేరి జగన్‌పై రెండు హత్య కేసులతో సహా 39 కేసులు వున్నాయి. 

ఐదుగురు లొంగుబాబు

మావోయిస్టు పార్టీకి చెందిన జీకేవీధి మండలం పెదపాడుకు చెందిన కిల్లోరాజు(25), పామురాయికి చెందిన వంతల భాస్కరరావు(20), కొయ్యూరు మండలం నల్లబెల్లికి చెందిన సిందేరి మహేశ్‌(33), మిలీషియా కమాండర్లయిన పామురాయి ప్రాంతానికి చెందిన గెమ్మెలి కేసు(38), వంతల కృష్ణ(30)  శుక్రవారం మంగళగిరిలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఒక్కొక్కరిపై 30 నుంచి 50 వరకు కేసులున్నాయని డీజీపీ చెప్పారు.

‘కొర్రా’ కోసం 8 ఏళ్లుగా గాలింపు

మావోయిస్టు నేత కొర్రా నాగేశ్వరరావు కోసం ఆంధ్రా, ఒడిశా పోలీసు బలగాలు ఎనిమిదేళ్లుగా గాలిస్తున్నాయి. 2014 జనవరిలో కోరుకొండ సంతలో మావోయిస్టులకు, స్థానిక గిరిజనులకు జరిగిన ఘర్షణలో సంజీవరావు అనే వ్యక్తిని మావోయిస్టులు హత్యచేసి, మరికొంతమందిపై దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన గిరిజనులు ఏరియా కమిటీ సభ్యుడైన శరత్‌ను, కొర్రా నాగేశ్వరరావును తీవ్రంగా కొట్టారు. శరత్‌ చనిపోగా, నాగేశ్వరరావు కొనఊపిరితో బయటపడ్డాడు. ఇతని నేతృత్వంలో చింతపల్లి, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లో కార్యకలాపాలు చురుగ్గా సాగడంతోపాటు, ఏపీఎఫ్‌డీసీకి చెందిన కాఫీ తోటలను గిరిజనులకు పంపిణీ చేశారు. ఇతనిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు వారం కిత్రం పోలీసులకు చిక్కాడు. 

Read more