ముప్పు తప్పింది!

ABN , First Publish Date - 2022-05-12T06:54:52+05:30 IST

జిల్లాకు అసాని తుఫాన్‌ ముప్పు తప్పింది. కాకినాడ వైపు దూసుకొ చ్చిన తీవ్ర తుఫాను దిశ మార్చుకుని మచిలీపట్నం-నరసాపురం మధ్య బుధవారం సాయంత్రం తీరాన్ని తాకింది.

ముప్పు తప్పింది!
ఉప్పాడ తీరంలో దెబ్బతిన్న పెంకుటిల్లు

  జిల్లాకు తప్పిన అసాని తుఫాన్‌ ముప్పు
  మచిలీపట్నం-నరసాపురం మధ్య తీరాన్ని తాకి..
  కాకినాడ మీదుగా విశాఖ తీరానికి సమీపంగా వెళ్లనుండడంతో అక్కడ భారీ వర్షాల ముప్పు
  వాయుగుండంగా బలహీనపడ్డంతో నేడూ వర్షాలు
  కెరటాల ఉధృతికి వణికిన ఉప్పాడ
  కడలిలో మునిగిన ఇళ్లు, సిమెంట్‌ రోడ్లు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) జిల్లాకు అసాని తుఫాన్‌ ముప్పు తప్పింది. కాకినాడ వైపు దూసుకొ చ్చిన తీవ్ర తుఫాను దిశ మార్చుకుని మచిలీపట్నం-నరసాపురం మధ్య బుధవారం సాయంత్రం తీరాన్ని తాకింది. దీంతో భారీ వర్షాలు, పెను నష్టం భయం నుంచి జిల్లా గట్టెక్కింది. క్షణక్షణం భయంగా మారిన తుఫాన్‌ గమనం దారిమళ్లడంతో అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే తీరాన్ని తాకిన అసాని ఉత్తర ఈశాన్య దిశగా కదిలి కాకినాడ, తుని మీదుగా విశాఖ తీరానికి సమీపంగా వెళ్లి వాయుగుండంగా గురు వారం నాటికి మరింత బలహీనపడనుంది. ఈ క్రమంలో గురువారం జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ హెచ్చరింది. ముఖ్యంగా తీర మండలాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. జిల్లాకు తుఫాన్‌ ముప్పు తప్పినా వర్షాలు కొన సాగనున్న నేపథ్యంలో సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. కాగా తుఫాన్‌ ప్రభావంతో బుధవారం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, అక్కడకక్కడ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఉప్పాడలో కెరటాల ఉధృతి బుధవారం తెల్లవారుజాము నుంచి రెట్టిం పయ్యాయి. దీంతో కోనపాపపేటలో అలల తాకిడికి మత్స్యకారుల ఇళ్లు కొన్ని సముద్రంలో కలిసిపోయాయి. తీర గ్రామాల్లో మూడు సిమెంట్‌ రోడ్లు ఏకంగా అలల ఉధృతికి సముద్రంలో కలిసిపోయాయి. మరికొన్ని ఏక్షణంలోనైనా కూలిపోవడానికి సిద్ధం అన్నట్టు మారాయి. కాకినాడ - ఉప్పాడ బీచ్‌ రోడ్డు తీవ్రమైన రాకాసి అలల ధాటికి పూర్తిగా ఛిద్రమై పోయింది. కోత పెరిగే ప్రమాదం ఉండడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వచ్చి మకాం వేశాయి. కాగా కోత అధికమై ఇళ్లు, రోడ్లు సముద్రంలో కలిసిపోయిన ప్రాంతంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. బాధితులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మూడురోజుల కిందట కాకినాడ పోర్టు నుంచి కొట్టుకొచ్చిన బార్జి బుధ వారం నాటికి తీరానికి మరింత సమీపానికి వచ్చింది. తుఫాన్‌ ప్రభా వంతో అనేక మండలాల్లో వరి పనలు నీటమునిగాయి. జీడి, మామిడి, నువ్వులు, ఇతర అపరాల పంటలు నేలకొరిగాయి. ప్రత్తిపాడులో వెయ్యి ఎకరాల్లో అరటి, నువ్వు పంటలు నష్టపోయాయి. వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.10 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా. విద్యుత్‌శాఖకు రూ.1.20 కోట్ల నష్టం వచ్చినట్టు డీఈ ఉదయభాస్కర్‌ తెలిపారు.

Read more