కావలిలో ఈదురుగాలుల బీభత్సం

ABN , First Publish Date - 2022-05-12T03:35:59+05:30 IST

అసాని తుపాను ప్రభావంతో కావలి ప్రాంతంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మంగళ, బుధవారాల్లో 8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.

కావలిలో ఈదురుగాలుల బీభత్సం
కచ్చేరిమిట్టలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగింపచేస్తున్న రెండో పట్టణ సీఐ మల్లికార్జున్‌

రెండు రోజుల్లో 8 సెంమీ వర్షం

కావలి, మే 11 : అసాని తుపాను ప్రభావంతో కావలి ప్రాంతంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మంగళ, బుధవారాల్లో 8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనేక చోట్ల చెట్లు, కొమ్మలు విరిగి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. పట్టణంలోని అగ్నిమాపక కేంద్రం రోడ్డులోని కచ్చేరిమిట్టలో పెద్ద చెట్టు కూలి రోడ్డుకు అడ్డంగా పడటంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రెండో పట్టణ సీఐ మల్లికార్జున, విద్యుత్‌ శాఖ ఏడీఈ భానూ నాయక్‌ వారి సిబ్బందితో చెట్టును తొలగింపచేశారు. ఈదురుగాలులకు చెట్లు, కొమ్మలు విరిగి పోవటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడి పట్టణంలో అంధకారం నెలకొంది. మంగళవారం రాత్రంతా విద్యుత్‌ సరఫరాకు తరచూు అంతరాయం ఏర్పడుతూనే ఉండింది. డ్రైనేజీ కాలువలు పూడి ఉండటంతో వర్షం నీరు రోడ్లపై పారి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్లపు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. పలుచోట్ల ప్లెక్సీలు నేలకొరిగాయి. అలాగే రైతులకు తీవ్ర నష్టం జరిగింది. కోతకు వచ్చిన వరి పంట నేలకొరగగా, నూర్పిడి చేసిన వరి ధాన్యం తడిచి ముద్దయింది. మండలంలోని చలంచర్ల, సిరిపురంలో సుమారు 300 ఎకరాలకు పైగా వరి పైరు నేలకొరిగిందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఆనెమడుగులోనూ కోతకు వచ్చిన వరిపైరు నేలమట్టం కాగా నూర్పిడి చేసిన వరిధాన్యం తడిచిపోయింది. తీరప్రాంత గ్రామాల్లో కావలి రూరల్‌ ఎస్‌ఐలు వెంకట్రావు, వీరేంద్రబాబులు సిబ్బందితో కలసి పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళవద్దని సూచించారు. తీరంలో పర్యటించి ఎవరూ అటు వైపు రాకుండా చర్యలు చేపట్టారు. ఈ వర్షాలతో పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మున్సిపల్‌ కార్మికులు, సిబ్బంది బుధవారం సహాయక చర్యలు చేపట్టారు. డ్రైనేజీ కాలువల్లో చెత్తా చెదారం తొలగించారు. రోడ్ల వెంబడి విరిగి పడిన చెట్ల కొమ్మలు తొలగించారు.

Read more