పేదరికానికి కులం లేదు

ABN , First Publish Date - 2022-05-11T06:37:34+05:30 IST

పేదరికానికి కులం లేదని, అన్ని సామాజిక వర్గాల్లోనూ పేదలు ఉన్నారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

పేదరికానికి కులం లేదు
కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు

- ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకారం

సిరిసిల్ల, మే 10 (ఆంధ్రజ్యోతి): పేదరికానికి  కులం లేదని, అన్ని సామాజిక వర్గాల్లోనూ పేదలు ఉన్నారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.  ఆర్యవైశ్యుల్లోని పేద కుటుంబాలను ఆదుకుంటామని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని అన్నారు. మంగళవారం సిరిసిల్లలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా అల్లాడి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి శ్రీనివాస్‌, జిల్లా కోశాధికారిగా పబ్బ నాగరాజుతో కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. అనుబంధ సంఘాలను ప్రకటించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ అర్యవైశ్యులు గొప్పగా ఉంటారని, మారుమూల పల్లెల్లో ఒక కుటుంబం ఉన్నా అందరితో కలుపుగోలుగా ఉంటూ వ్యాపారాలు కొనసాగిస్తారని అన్నారు. కొందరు పేదవారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కోరారని, వారికి అందిస్తామని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆర్యవైశ్య మహాసభ భవనాలకు స్థలం ఇప్పిస్తామన్నారు. సిరిసిల్లలో ఆర్యవైశ్య భవన నిర్మాణానికి ఆర్థిక సహాకారాన్ని అందిస్తామన్నారు. సిరిసిల్లలో పద్మశాలి నేతన్నలకు ఉపాధిని అందించినట్లుగానే అన్ని వర్గాలకు చేయూతనందిస్తామన్నారు. దేశం శాంతియుత వాతావరణం, సమర్థవంతమైన నాయకత్వం ఉంటేనే అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని, నిత్యం కులం, మతం, అంటూ కుమ్ములాటకు వెళ్తే అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. సిరిసిల్ల ప్రాంతంలో నక్సలిజంతో అశాంతి ఉండేదని, ఎమ్మెల్యేలు సైతం గ్రామాలకు వెళ్లేవారు కాదని గుర్తు చేశారు. ఇప్పుడు పరిస్థితులు మారా యన్నారు. అభివృద్ధి జరుగుతున్న తీరును వివరించారు.  75 ఏళ్ల స్వాతంత్య్రంలో భారతదేశం ఏం సాధించిందో, ఎనిమిదేళ్ల తెలంగాణ రాష్ట్రం ఏం సాధించిందో ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో కరెంట్‌, నీళ్లు, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయన్నారు. చాలారాష్ట్రాలు వెనకబడి ఉన్నాయని అన్నారు. భారత్‌ కూడా వెనకబడిన దేశంగానే ఉంటోందని, దేశానికి ఆర్థిక లక్ష్యంగా ఉండాలని అన్నారు.  కులం, మతం, దేవుళ్ల పేరుతో ఎన్ని రోజులు కోట్లాడాలని అన్నారు. సమర్థవంతమైన కేసీఆర్‌ నాయకత్వం ఉండడంతోనే తెలంగాణలో 24 గంటల కరెంట్‌, ఇంటింటికి నీటి వసతి, ఎత్తిపోతలతో ప్రాజెక్ట్‌లు కట్టుకున్నామన్నారు. 60 ఏళ్ల క్రితం ఉన్న కరువు పోయిందన్నారు. మోదీ ‘అచ్చేదిన్‌ ఆగయా’ అంటున్నారని, సిలిండర్‌ ధర రూ.400 నుంచి రూ .వెయ్యికి, పెట్రోల్‌ ధర రూ.120కి పెరిగిందన్నారు. ఎల్‌ఐసీ  వంటి సం్థలను అమ్మేస్తున్నారన్నారు. నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఖాతాలో వేస్తానని చెప్పాడని ఎవరి ఖాతాలోనైనా పడ్డాయా? అని ప్రశ్నించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతంగా రూపాయి విలువ దిగజారిందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.75 లక్షలు ఉంటే భారత దేశ తలసరి ఆదాయం రూ.1.49 లక్షలు ఉందన్నారు. అమెరికా వంటి దేశాలతో పోటీ పడకుండా మతం, కులం అంటున్నారన్నారు. పేదరికానికి కులం లేదని, అందరినీ ప్రభుత్వం అదుకుంటుందని అన్నారు. నిజామాబాద్‌ అర్భన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ సిరిసిల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. సిరిసిల్లకు కేటీఆర్‌ వంటి  మంచి నాయకుడు లభించారని, అతనిని కాపాడుకోవాలని అన్నారు. ఆర్యవెశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లోనూ ముందుకు  వెళ్తున్నా రాజకీయంగా వెనకబడి ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూడా టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి, సెస్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్‌ గోపాల్‌రావు, బుస్స శ్రీనివాస్‌, చేపూరి బుచ్చయ్య, రాజూరి వాసుదేవరాయలు, పోకల వేణుగోపాల్‌, కట్కూరి శ్రీనివాస్‌, కిషన్‌, గరిపెల్లి ప్రభాకర్‌, కట్కం సత్తయ్య, అల్లాడి సరస్వతి, సౌజన్య, సాధన, జనార్దన్‌, రామచంద్రం, కూర సంతోష్‌, నాగరాజు, సుధాకర్‌, మాడిశెట్టి అనందం, సిద్ధంశెట్టి శ్రీనివాస్‌, ఉప్పల రామచంద్రం, కొత్తపల్లి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more