సమస్యలు సశేషం... ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోయిన భూవివాదాలు

ABN , First Publish Date - 2021-02-21T05:11:02+05:30 IST

ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన మార్పులు చేర్పులు రైతులకు మరిన్ని సమస్యలను తెచ్చి పెట్టాయి. ఆరు నెలల క్రితమే రెవెన్యూ కార్యాలయాలలో సాధారణ లావాదేవీలు నిర్వహించే ‘ధరణి’ నిలిపివేయడటంతో ఎక్కడి పనులు అక్కడే నిలచిపోయాయి.

సమస్యలు సశేషం...  ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోయిన భూవివాదాలు

 రిజిస్ర్టేషన్‌లకే పరిమితమైన ‘ధరణి’

 చేర్పులు, మార్పులకు అవకాశం లేనివైనం

 సగానికిపైగా అపరిష్కృతంగానే భూ తగాదాలు

 ఏజెన్సీలో అవకాశంలేని రిజిస్ర్టేషన్‌, మ్యూటేషన్‌ 

అశ్వారావుపేట, పిబ్రవరి 20: ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన మార్పులు చేర్పులు రైతులకు మరిన్ని సమస్యలను తెచ్చి పెట్టాయి. ఆరు నెలల క్రితమే రెవెన్యూ కార్యాలయాలలో సాధారణ లావాదేవీలు నిర్వహించే ‘ధరణి’ నిలిపివేయడటంతో ఎక్కడి పనులు అక్కడే నిలచిపోయాయి. కొద్ది నెలల క్రితం తహసీల్దార్‌లను జాయింట్‌ రిజిస్ర్టార్‌లుగా నియమిస్తూ రిజిస్ర్టేషన్‌ లావాదేవీలకు అనుగుణంగా ‘ధరణి’ని తిరిగి ప్రారంభించారు. కానీ కేవలం రిజిస్టర్డ్‌ భూములు, వాటికి సంబంధించిన లావాదేవీలకు మాత్రమే అవకాశం ఉండగా గతంలో రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న భూములకు మ్యూటేషన్‌ చేయటానికి ఆప్షన్‌ ఇచ్చినా దాని ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో రిజిస్ర్టేషన్‌లు, మ్యూటేషన్‌లకు ఏ మాత్రం అవకాశం లేకపోవడంతో ఇరు జిల్లాల్లోని భూ సమస్యలు ఎక్కడికక్కడే నిలచిపోయాయి.

అపరిష్కృతంగా భూ సమస్యలు.. 

ఎటువంటి భూ వివాదాలు లేకుండా చేసేందుకే భూ ప్రక్షాళన చేపట్టినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి పేజ్‌లో ఎటువంటి వివాదాలు లేని రిజిస్ర్టేషన్‌, పట్టా భూములను నమోదు చేసి కొత్త పాస్‌పుస్తకాలు జారీ చేశారు. ఆ తరువాత రెండో పేజ్‌లో అసైన్‌మెంట్‌, ఆర్మీ, స్వాతంత్ర సమరయోధుల పట్టాలు, ప్రభుత్వం జారీ చేసిన పట్టాలలో జరిగిన లావాదేవీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంజాయ్‌మెంట్‌ సర్వే ప్రకారం వాస్తవంగా సాగులో ఉన్న వారి పేర్లు ఎక్కించేలా పీఓటి, సాదాబైనామాలకు అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో మధ్యలో వరుస ఎన్నికలు రావడం వంటి కారణాలతో ఆటంకాలు ఏర్పడ్డాయి. తరువాత ఎట్టకేలకు రెండో పేజ్‌ ప్రారంభమై కొత్త పట్టాలు జారీ చేసే సమయంలోనే ప్రభుత్వం రెవెన్యూలో ప్రక్షాళన ప్రారంభించింది. దాంతో అప్పటి వరకు ఉన్న ‘ధరణి’ని నిలపివేయడంతో ఎక్కడ సమస్యలు అక్కడే ఆగిపోయాయి. పూర్వంనుంచి ఉన్న భూ సమస్యలకు తోడు ప్రక్షాళన సమయంలో పట్టాల జారీ సమయంలో పేర్లు తప్పులు, అచ్చు తప్పులు, విస్తీర్ణం, కొన్ని భూములు అసలు నమోదు కాకపోవడం, ఒకరి పేరుకు బదులు వేరొకరి పేర్లు పట్టాలో నమోదు కావడం, చిన్న చిన్న వివాదాలతో నమోదులో ఆలస్యం అయినవి ఇలా ఒక్కో మండలంలో వందల సంఖ్యలో వచ్చాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం రైతులు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగి ధరఖాస్తులు ఇచ్చే సమయానికి ఒక్కసారే ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ ప్రక్షాళన చేపట్టడంతో ఆ సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. ఆరు నెలలు దాటినా ఈ సమస్యలు పరిష్కరించే ఆప్షన్‌ ఇవ్వకపోవడంతో రైతులు తమ సమస్యల పరిష్కారంకోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రైతులనుంచి వస్తున్న దరఖాస్తులను ఏ విధంగా పరిష్కరించాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

ఫలితమివ్వని ప్రక్షాళన

ఇదిలా ఉండగా భూ ప్రక్షాళన సమయంలో అనేక భూముల్లో కొనుగోళ్లు అమ్మకాలు జరిగాయి. రికార్డుల్లో ఒకరి పేరు, సాగులో మరొకరు ఉన్నారు. దశాబ్దాల క్రితమే ఈ కొనుగోళ్లు జరిగాయి. భూ ప్రక్షాళనలో ఇటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని రైతులు భావించారు. కానీ ప్రభుత్వం వాటిపై సరైన నిర్ణయం ప్రకటించకపోవడం, సాదాబైనామాలు, పీఓటీల నమోదుపై సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో చాలా మంది రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో పాత రికార్డుల ప్రకారం దశాబ్దాల క్రితం అమ్మేసిన రైతుల పేర్లుతో కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు అమ్మేశాం కదా అని ఆ భూములకు దూరంగా ఉన్న పట్టాదారులు కొత్త పాస్‌ పుస్తకాలను తీసుకొని అమ్మేసిన భూముల్లోకి చొరబడుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో మరిన్ని సమస్యలు పెరిగాయి. ఇప్పుడు తహసీల్దార్‌ కార్యాలయాలలో ప్రతిరోజు ఇదే సమస్యలతో రైతులు తిరుగుతూ కనిపిస్తున్నారు. ధరణి ఆప్షన్‌ ఓపెన్‌ కాకపోవడంతో అధికారులు దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. భూ ప్రక్షాళనతో భూ సమస్యల పరిష్కారమేమో కానీ ఇబ్బడి ముబ్బడిగా కొత్త సమస్యలు పెరిగిపోవడంతో రైతుల మధ్య కొట్లాటలు ప్రారంభమయ్యాయి.

రిజిస్ర్టేషన్‌లకే పరమితమైన ధరణి 

గత డిసెంబర్‌లో ప్రభుత్వం ‘‘ధరణి’ పోర్టల్‌ ఓపెన్‌ చేసింది. అయితే ఇది కేవలం భూముల రిజిస్ర్టేషన్‌లకే పరిమితమైంది. గతంలో రిజిస్ర్టేషన్‌ అయి ఉన్న భూముల్లో జరిగే భూక్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్ర్టేషన్‌లు చేయడం తప్ప క్షేత్రస్థాయిలో నిలచిపోయిన భూ సమస్యల పరిష్కారానికి ఇది ఏమాత్రం ఉపయోగపడదు. ఇదిలా ఉండగా ఇటీవలే గతంలో రిజిస్ర్టేషన్‌లు చేయించుకొని పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందని భూముల మ్యూటేషన్‌ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించినా అదీ అంతంత మాత్రంగానే జరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే ఏజెన్సీ ప్రాంతంలో రిజిస్ర్టేషన్‌లకు అవకాశం లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ‘ధరణి’ వల్ల ఏ మాత్రం ఉపయోగం లేకుండాపోతుంది. ఇదిలా ఉండగా తాజాగా ప్రభుత్వం రెవెన్యూ విధానాలు మార్చివేస్తామని, కలెక్టర్‌, ఆర్డీఓలతో రెండంచెల విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటిచండంతో రైతుల్లో మరింత ఆందోళన పెరిగింది. మండల స్థాయిలో అధికారులు ఉన్నప్పుడే పరిష్కారం కానీ సమస్యలు జిల్లా స్థాయిలో ఏ విధంగా జరుగుతాయని ప్రశ్నిస్తున్నారు. పేద రైతులకు దీనితో ఎంతమాత్రం న్యాయం జరుగదని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ చేసి ప్రజలకు చేరువచేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ విధానం వల్ల ప్రజలకు మరింత దూరం చేసినట్లవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూలో రోజుకో ప్రకటన వస్తుండటంతో అధికారులు కూడా తమకు ఏవిధమైన అధికారులున్నాయనేది తెలియక తికమక పడుతున్నారు. విధులపై దృష్టిపెట్టలేకపోతున్నారు. వెరసి భూ ప్రక్షాళన రైతులకు మరింత తిప్పలు తెచ్చి పెడుతోంది. పట్టాలే పూర్తిగా నమోదు కాకుండా డిజిటల్‌ సర్వే చేసి ఫలితం ఏముంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

Read more