‘గడప గడప’నా గడబిడే!

ABN , First Publish Date - 2022-05-12T09:23:23+05:30 IST

‘గడప గడపకు మన ప్రభుత్వం’ అంటూ బయలుదేరిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలను నిరసన సెగలు ఉడికించేశాయి. సమస్యలపై ఎక్కడికక్కడ నిలదీస్తూ అధికార పార్టీ నేతలకు జనం చుక్కలు చూపించారు. అక్రమ, నకిలీ సారా, కరెంటు కోతలపై జనాగ్రహం ఎగసిపడింది

‘గడప గడప’నా గడబిడే!

  • పథకాలు, జగన్‌ హామీలపై రగిలిన జనం
  • తమకు పింఛన్లు ఆపారని వృద్ధులు భగ్గు
  • ‘దండం పెడతా..నావద్దకు రావొద్దు’ అంటూ 
  • ఆదోనిలో ఎమ్మెల్యేకు ఓ వృద్ధురాలి నిరసన
  • చార్జీలపై ప్రశ్నలతో నగరిలో రోజాకు సెగలు
  • సారా వద్దంటూ అనకాపల్లిలో మహిళల ఫైర్‌
  • ఎక్కడికక్కడ ఊహించని రీతిలో ప్రతిఘటన
  • మంత్రులు, వైసీపీ నాయకులకు చుక్కలు’’


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

‘గడప గడపకు మన ప్రభుత్వం’ అంటూ బయలుదేరిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలను నిరసన సెగలు ఉడికించేశాయి. సమస్యలపై ఎక్కడికక్కడ నిలదీస్తూ అధికార పార్టీ నేతలకు జనం చుక్కలు చూపించారు. అక్రమ, నకిలీ సారా, కరెంటు కోతలపై జనాగ్రహం ఎగసిపడింది. పథకాలు, జగన్‌ హామీలపై నిలదీస్తున్న ప్రజల మధ్య నిలబడలేక నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రభుత్వ పథకాలు ప్రచారం చేస్తూ.. తమ అధినేతను జనంలో పాపులర్‌ చేద్దామని తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు చేదు అనుభవాలే చవిచూడాల్సి వచ్చింది. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి ‘గడప గడపకు..’లో భాగంగా విరుపాపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనను అల్లంత దూరంలో చూడగానే ఈరమ్మ అనే మహిళ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీకు దండం పెడతాను మా ఇంటి దగ్గరకు రావద్దు.. మీకు చెప్పినా ఒక్కటే... గోడకు చెప్పినా ఒక్కటే. మీ వల్ల ఏ సమస్యలూ తీరవు’ అంటూ మండిపడింది. ‘అలా కాదమ్మ.. వచ్చి నీ సమస్య ఏంటో చెప్పు’ అని ఎమ్మెల్యే అంటున్నా.. వినిపించుకోకుండా ఇంట్లోకి వెళ్లిపోయింది. ఇదే గ్రామంలోని నాగరాజు అనే వ్యక్తి ఇంటికి వెళ్లగా అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది.

 

రోజాకు ‘కరెంటు’ సెగ

మంత్రి రోజా తిరుపతి జిల్లా నగరి పరిధిలో వడమాలపేట మండలం కల్లూరు గ్రామంలో ‘గడప గడప..’లో పాల్గొన్నారు. కల్లూరు గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి ఈ సందర్భంగా కరెంటు చార్జీల పెంపుపై రోజాను నిలదీశారు. అమ్మఒడి ఇస్తున్నారు... కానీ కరెంటు చార్జీలు పెంచేశారు... ఎలా కట్టాలి?’ అంటూ ఆమెను ఓ గ్రామస్థుడు సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తెలివంతా చూపించొద్దంటూ సమాధానం దాటవేసి అక్కడ నుంచి ఆమె ముందుకు సాగారు. తెలంగాణలో వేతనాలు 2వేలు పెంచారని, ఇక్కడ తమకు కూడా పెంచాలని ఓ ఆశా వర్కర్‌ కోరగా, అది స్టేట్‌ పాలసీ అంటూ జారుకున్నారు.


అడిగితే టీడీపీ వాళ్లమా?

‘నీటి సమస్య తీరదు.. ఇళ్ల స్థలాలు ఇవ్వరు.. రేషన్‌ బియ్యం బాగుండవు.. ప్రశ్నిస్తే మాత్రం మమ్మల్ని టీడీపీ కింద జమ కడతారా? ఇదెక్కడి న్యాయం?’ అంటూ మద్దికెర వాసులు... ఎమ్మెల్యే శ్రీదేవిని నిలదీశారు. ‘గడప గడప... ’ కోసం బుధవారం కర్నూలు జిల్లా మద్దికెరకు శ్రీదేవి వచ్చారు. మండల కేంద్రంలోని నాగులబావి వీధికి చెందిన గుడికాటి లక్ష్మణస్వామి, వెంకమ్మ, శివ, రామలక్ష్మమ్మ, లక్ష్మీదేవితోపాటు మరికొంత మంది మహిళలు తమ సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు.  తాను చిన్న కూరగాయల కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నానని, జగనన్న తోడు కింద రూ.10000 వేలు వడ్డీలేని రుణమని ఇచ్చారని, బ్యాంక్‌ వారు మాత్రం వడ్డీ పట్టుకున్నారని ఇదేమి తోడంటూ వెంకమ్మ అనే మహిళ నిలదీశారు. నాగులబావి, గిడ్డయ్య వీధికి చెందిన మహిళలు తమ ప్రాంతాలలో గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నామన్నారు. కాగా వైసీపీ నాయకులు ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగారు. ‘మీరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారా... మమ్మల్నే ప్రశ్నిస్తారా’ అంటూ ఎదురుదాడికి దిగగా, స్థానికులు కూడా దీటుగా వాగ్వాదానికి దిగారు. 


‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో అనకాపల్లి శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీకి సమస్యల సెగ తగిలింది. రావికమతం మండలం టి.అర్జాపురం గ్రామం నుంచి ఈ కార్యక్రమం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఏకరువు పెట్టబోయిన ఆయనకు స్థానిక మహిళల నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ‘మీ పథకాల సంగతి దేవుడెరుగు. గ్రామంలో నాటుసారా ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి. మగాళ్లు రోజూ తాగొచ్చి మమ్మల్ని తంతున్నారు. పుస్తెలు కూడా అమ్మేసి...ఆ డబ్బును తాగడానికి తగలేస్తున్నారు. ముందు గ్రామంలో నాటుసారా నిరోధానికి చర్యలు చేపట్టండి’’...అంటూ రగిలిపోయారు. అర్హత ఉన్నప్పటికీ రైతు భరోసా, అమ్మఒడి, పింఛన్లు రావడం లేదని కొందరు.. ఎమ్మెల్యే సమక్షంలో అసంతృప్తి వెలిబుచ్చారు. తమది కూలీ నాలీ చేసుకుని పొట్టపోసుకుంటున్న కుటుంబమని, అయినా తనకు వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వలేదని మచ్చ కన్నమ్మ అనే వృద్ధురాలు వాపోయింది. అర్హత గల వారందరికీ పింఛన్లు, ఇళ్లు, రేషన్‌ కార్డులు, రైతు భరోసా పథకాలు జూలై మొదటి వారం నాటికి మంజూరవుతాయని చెప్పి.. అక్కడినుంచి ధర్మశ్రీ ముందుకెళ్లారు. 


‘రోడ్డుపై’ మంత్రి నిలదీత.. 

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను అడుగడుగునా మహిళలు నిలదీశారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని, రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ నిలదీశారు. బుధవారం కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌లో నిర్వహించిన ‘గడపగడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి జయరాం పాల్గొన్నారు. తమ గ్రామం నుంచి ఆలూరుకు వెళ్లే రహదారికి కంకర వేసి పూర్తి చేయకుండానే వదిలేశారని మంత్రి వద్ద కొందరు మహిళలు నిరసన తెలిపారు.గ్రామంలో పది రోజులైనా సక్రమంగా సాగునీరు సరఫరా కావడం లేదని మరికొందరు ఫిర్యాదు చేశారు. అర్హత ఉన్నప్పటికీ అమ్మఒడి పథకం రాలేదని, పెన్షను మంజూరు కాలేదంటూ మహిళలు ప్రశ్నలతో మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేశారు. పది రోజులైనా నీరు సక్రమంగా రావడం లేదంటూ హత్తిబెళగల్‌ గ్రామానికి చెందిన జాహినాబీ అనే మహిళ ప్రశ్నించారు. తమకు భూమే లేదని.. అయినా ఇరవై ఐదు ఎకరాల భూమి ఉన్నట్లు ఆన్‌లైన్‌ చూపించడంతో అమ్మఒడి మంజూరు కాలేదని హత్తిబెళగల్‌కు చెందిన పుల్బీ బేగం మంత్రి దృష్టికి తెచ్చారు. అధికారులను, వలంటీర్లను అక్కడకు పిలిపించిన మంత్రి... సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ఆగ్రహించారు.

 

నువ్వుండేది ఏడాదేనంటగా!

‘నువ్వుండేది ఏడాదేనంట కదా..? మరుగుదొడ్లు కట్టిస్తానని చెప్పి మూడేళ్లు దాటినా కట్టియ్యక పోతివయ్యా...! శానా ఇబ్బందులు పడ్తుండాము. మంచినీళ్లకు తిప్పలు తప్పడం లేదు...’ అంటూ మహిళలు... కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ జె. సుధాకర్‌ను నిలదీశారు. ఆయన ఏదో సర్దిచెప్పబోయినా, మహిళలు వినలేదు. ‘ముందు మా ఇబ్బందులు తీర్చండి సారూ’...అంటూ ‘గడప గడప.. లో ప్రశ్నల వర్షం కురిపించారు. కర్నూలు మండలం దేవమడ గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే, స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించిన కొద్ది సేపటికే ఆయనను మహిళలు నిలదీశారు. మూడేళ్ల క్రితం తమ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసినా, ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదని ఆగ్రహించారు. వారికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరి అయ్యారు.


సభకు రమ్మంటే బిల్లులడుగుతున్నారు

కార్యకర్తలను పట్టించుకోండి: మాగుంట


‘పార్టీకి కార్యకర్తలే బలం. వారు ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్నారు. అటువంటివారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్‌ బిల్లులు ఇప్పించమని అడుగుతున్నారు. వాటిని సత్వరమే చెల్లించే విధంగా జిల్లా వైసీపీ నాయకత్వం పనిచేయాలి’ అని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కోరారు. ఒంగోలులోని ఓ కన్వెన్షన్‌ హాలులో బుధవారం జరిగిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్‌యాదవ్‌ ప్రమాణ స్వీకారోత్సవ సభలో మాగుంట ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీలో పనిచేశానని, పార్టీ ఏదైనా కార్యకర్తలే బలమన్నారు. సమావేశానికి పిలిస్తే పెండింగ్‌ బిల్లులు వచ్చేలా చూడాలని కార్యకర్తలు అడుగుతున్నారని వ్యాఖ్యానించారు.

Read more