కేలండర్ రాదు.. భర్తీ లేదు!
ABN, First Publish Date - 2020-12-21T08:19:03+05:30
2020లో చేపట్టబోయే రిక్రూట్‌మెంట్లకు సంబంధించి జనవరిలోనే వార్షిక కేలండర్ విడుదల చేయాలి.
నిరుద్యోగుల ఆశలపై జగన్ సర్కారు నీళ్లు
2020లో కొత్త రిక్రూట్‌మెంట్లు ఏవీ?
జనవరిలో వార్షిక కేలండర్ ఇస్తామని ఆర్భాటం
ఏడాదవుతున్నా ఉలుకూ పలుకూ లేదు
ఖాళీలు తేల్చరు.. ఇండెంట్ ఇవ్వరు
ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని ఏపీపీఎస్సీ
వర్సిటీల ఫ్యాకల్టీ భర్తీపైనా చిత్తశుద్ధి కరువు
డీఎస్సీ ప్రకటన ఇవ్వకుండా కాలయాపన
ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు
ఉద్యోగాల భర్తీకి వార్షిక కేలండర్ తెస్తామని ప్రకటించి ఏడాది దాటి.. మళ్లీ కొత్త సంవత్సరం వస్తున్నా.. ప్రభుత్వంలో ఉలుకూపలుకూ లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయ నియామకాలు, విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ నియామకాలపై ఆర్భాటపు ప్రకటనలే తప్ప.. ఏదీ ఆచరణలోకి రాలేదు. సంవత్సరమంతా నిరుద్యోగులను ఊరించడంతోనే సరిపెట్టారు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. కనీసం కొత్త సంవత్సరంలోనైనా కేలండర్ ఇస్తారన్న నమ్మకం కూడా లేకుండా పోతోందని అంటున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి) : 2020లో చేపట్టబోయే రిక్రూట్‌మెంట్లకు సంబంధించి జనవరిలోనే వార్షిక కేలండర్ విడుదల చేయాలి.
- సీఎం వైఎస్ జగన్ ఆదేశం
అత్యవసర ప్రాతిపదికన నిర్దిష్ట కాలవ్యవధిలో వర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసి గుణాత్మక విద్యకు మార్గం సుగమం చేయాలి.
- గవర్నర్ విశ్వభూషణ్ హితవు
12 వేల టీచర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో డీఎస్సీ-2020 నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.
- పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు
ఇవన్నీ నిరుడు డిసెంబరులో కీలక వ్యక్తుల నోట వినిపించిన మాటలు. కానీ ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు. కనీసం ఈ ఏడాది కాలంలో ఆ దిశగా ప్రయత్నాలు జరిగిన దాఖలాలైనా లేవు. జగన్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడచింది. ప్రభుత్వ విభాగాల్లో పేరుకుపోతున్న ఖాళీల భర్తీకి అడుగులే పడడం లేదని నిరుద్యోగులు ఉసూరుమంటున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో దాదాపు లక్షకు పైగా ఖాళీలు ఉన్నట్లు అంచనా. 2020లో చేపట్టబోయే రిక్రూట్‌మెంట్లకు సంబంధించి ఈ ఏడాది జనవరిలోనే వార్షిక కేలండర్‌ను విడుదల చేయాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు గాలికి పోయాయి.. ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు.
సర్కారీ కొలువుల భర్తీకి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గత జనవరి మొదటి వారంలో కేలండర్ విడుదల చేస్తామని చెప్పింది. కానీ వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీలతో కూడిన ఇండెంట్ కమిషన్‌కు పంపలేదు. తామేం చేయగలమంటూ ఏపీపీఎస్సీ చేతులెత్తేసింది. ఇక డీఎస్సీ-2020 నోటిఫికేషన్ విడుదలపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ అంటూ నిరుద్యోగులను ఊరించి.. ఇంతవరకు ఆ ఊసే ఎత్తలేదు. ఖాళీ పోస్టుల సంఖ్యపైనా స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ఏడాది జనవరి 31న ఉద్యోగాల భర్తీ కేలండర్‌పై జరిగిన సమీక్షలోనూ విద్య, వైద్య విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని స్వయంగా సీఎం ఆదేశించారు. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టు, టీచర్ పోస్టులను భర్తీచేయాలని.. పాఠశాలల్లో సిబ్బంది లేకపోతే ఎంత డబ్బు ఖర్చుపెట్టినా వృఽథా అవుతుందని చెప్పారు. ఉపాధ్యాయులు సరిపడా లేకపోతే పాఠశాలల సామర్థ్యం తగ్గుతుందని, పాఠశాలల్లో ల్యాబ్ టెక్నీషియన్లు కూడా ఉండాలన్నారు.
ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ పోస్టులు 63 వేలకు పైనే ఉండొచ్చని అధికారులు నాడు ప్రాథమికంగా నివేదించారు. మూడు వారాల్లో ప్రాధాన్య పోస్టులను నిర్ధారిస్తామని అప్పట్లో సీఎంకు తెలిపారు. ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రితో మరోసారి సమావేశమై.. ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ తెలియజేయాలని కూడా నిర్ణయించారు. కానీ ఆ తర్వాత సీఎస్ వద్ద సమీక్ష జరిగినా.. ఖాళీ పోస్టుల సంఖ్య తేల్చలేదు. కొన్ని విభాగాలు స్పందించినా.. మరికొన్ని ఇప్పటిదాకా ఖాళీల సమాచారం అందించలేదు.
నాడు అధ్యాపకుల కొరతపై గవర్నర్ ఆందోళన..
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు బోధనా సిబ్బంది పరంగా ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, కొన్నింటిలో 60 శాతం మేర అధ్యాపకుల కొరత ఉండడంపై నిరుడు డిసెంబరు 20న జరిగిన విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర ప్రాతిపదికన కాలపరిమితి గల ప్రణాళిక మేరకు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నాటి నుంచి నేటి వరకు.. ఇప్పటికీ ఫ్యాకల్టీ నియామకాలపై స్పష్టత లేదు. ఏళ్ల తరబడి కాంట్రాక్టు అధ్యాపకులతోనే బోధన చేయిస్తుండడం, మినిమమ్ టైమ్ స్కేలు వర్తింపజేయకపోగా.. ఇన్నేళ్ల తర్వాత నియామకాలపై పోస్టుమార్టం నిర్వహిస్తుండటంతో వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఏళ్ల తరబడి రిక్రూట్‌మెంట్ చేపట్టకుంటే విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య ఎలా అందుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెరుగైన ఉన్నత విద్య కోసం ఒకవైపు విద్యార్థులు విదేశాలకు క్యూ కడుతున్నా.. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు మాత్రం అరకొర బోధనా సిబ్బందితో కాలం వెళ్లదీస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన వర్సిటీలకు ప్రపంచస్థాయి, జాతీయ స్థాయి ర్యాంకింగ్స్ రావాలంటూనే అర్హులైన రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకాలకు మాత్రం ఇసుమంత శ్రద్ధయినా తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ చేపట్టేందుకు నాలుగేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. ఉపకులపతులు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం సుమారు 1500-1600 ఫ్యాకల్టీ ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది.
అన్నీ ఒకేసారి కాకుండా ఏడాదికి 400 లేదా 500 పోస్టుల చొప్పున భర్తీ చేయాలని ఒక దశలో భావించింది. పాత అభ్యర్థులతో పాటు ఏటా పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ అవార్డు అయిన కొత్త అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తే ప్రతిభ కలిగిన వారికే ఉద్యోగం వస్తుందని ఆలోచన చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టటకుని ఫ్యాకల్టీ ఖాళీలను దశల వారీగా.. భర్తీచే యాలని సీఎం తాజాగా సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. నిజానికి రిక్రూట్‌మెంట్ వ్యవహారంలో గత ప్రభు త్వం యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుందని జగన్ సర్కారు అంటోంది. ఎక్కడా లేని రీతిలో ఏపీపీఎస్సీ ద్వారా స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించడాన్ని ప్రశ్నిస్తోంది. యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కోర్టులో సమస్యలు చుట్టుముట్టాయని ప్రభు త్వ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం కొత్త కమిటీని ఏర్పాటు చేయించింది. కోర్టు కేసులు ఏ దశలో ఉన్నాయో, వాటిని ఎప్పటి లోగా పరిష్కరిస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.
Updated Date - 2020-12-21T08:19:03+05:30 IST