మా బాధలు పట్టించుకోరా!
ABN, First Publish Date - 2020-12-15T05:49:39+05:30
చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగే స్పందన కార్యక్రమం రద్దుపై బాధితుల ఆవేదన
‘స్పందన’ అర్జీలు బాక్సుకే పరిమితమవడంపై ఆందోళన
చిత్తూరు, డిసెంబరు 14: ఏళ్లుగా పరిష్కారం సమస్యలు పెద్దోళ్లు పరిష్కరిస్తారన్న ఆశ. దీంతో వ్యయప్రయాసల కోర్చి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ‘స్పందన’కు వస్తుంటారు. కొవిడ్ వ్యాప్తితో ఈ కార్యక్రమం కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఆశవీడని బాధితులు అర్జీలతో వస్తుంటారు. దీంతో గేటు వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఆదేశం మేరకు అక్కడున్న బాక్స్‌లో వినతులు వేయాల్సి రావడంపై అర్జీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందుతుందని చెబుతున్న అధికారులు, రాజకీయ పార్టీల సమావేశాలకు జనం గుంపులుగా వస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. అక్కడ రాని రోగం ఇక్కడే వస్తుందా అని మండిపడుతున్నారు. అందుబాటులో ఒక్క అధికారి లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో కన్పించాయి. బాధితుల వినతుల వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామ సర్వే నెం.127లో ఉన్న మూడెకరాల ప్రభుత్వ భూమిని గత వీఆర్వో మనోహర్‌రెడ్డి తన అక్క నాగేశ్వరమ్మ పేరిట పట్టా మంజూరు చేయించారని యాదమరి మండలం కోడిగుట్ట గ్రామస్తులు ఆరోపించారు. ఈ భూమిని జె.కె.రవి, కరుణాకరన్ ప్లాట్ రూ.లక్ష వంతున విక్రయిస్తున్నారనీ, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బధిరులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మదనపల్లె డివిజన్ చెవిటి, మూగ సొసైటీ సంఘ సభ్యులు కోరారు. కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు తదితర యంత్రాలు మంజూరు చేసి ఆదుకోవాలని పేర్కొన్నారు.
కరోనా నేపథ్యంలో నగర కూరగాయల మార్కెట్‌ను ప్రైవేటు బస్టాండ్‌కు మార్చడంతో ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు వ్యాపారులు వాపోయారు. వ్యాపారాలు జరగడం లేదనీ, చర్చివీధికి మార్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసేంత వరకు పోరాట ఆపమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.నాగరాజన్ హెచ్చరించారు. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద సీపీఐ, సీపీఎం, రైతుసంఘాల ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.నాయకులు చైతన్య, చల్లా వెంకటయ్య, మణి, సత్యమూర్తి, దాసరి చంద్ర తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-15T05:49:39+05:30 IST