ఇచ్చోటనే..!
ABN, First Publish Date - 2020-07-14T10:49:49+05:30
ఉచితంగా ఇంటి స్థలం ఇస్తామంటే సంబర పడ్డారు. సొంత ఇల్లు ఉంటే అద్దె కష్టం తీరుతుందని భావించారు.
శ్మశానంలో ఇంటి స్థలాలు
కొందరికి 4 కి.మీ. దూరంలో..
వద్దే వద్దంటున్న లబ్ధిదారులు
రుద్రవరం, జూలై 13: ఉచితంగా ఇంటి స్థలం ఇస్తామంటే సంబర పడ్డారు. సొంత ఇల్లు ఉంటే అద్దె కష్టం తీరుతుందని భావించారు. శ్మశానానికి దగ్గరగా స్థలం ఎంపిక చేసినా.. సర్దుకుపోదాంలే.. అనుకున్నారు. కానీ రెవెన్యూ అధికారులు కొలతలు వేశాక కొన్ని ప్లాట్లు ఏకంగా శ్మశానంలోనే పడ్డాయి. దీంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు. ఆ స్థలాలు తమకు వద్దే వద్దని తహసీల్దారుకు స్పష్టం చేశారు.
రుద్రవరం మండలం కోటకొండ గ్రామ పేదలకు 120/1, 125/1 సర్వే నెంబర్లలో ఇంటి స్థలాలను ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ప్లాట్లు వేశారు. సుమారు 60 మందికి ఇక్కడ స్థలాలు కేటాయించారు. వీటిలో కొన్ని శ్మశానంలో ఉండటంతో లబ్ధిదారులు తహసీల్దారు బీవీ నాగేశ్వర్‌రెడ్డిని కలిశారు. శ్మశానంలో ఎలా నివసించాలని ప్రశ్నించారు. సమీపంలో వాగు ఉందని, అది పొంగితే ఇళ్లలోకి నీరు చేరుతుందని కూడా ఆయనకు వివరించారు.
నాలుగు కిలో మీటర్ల దూరంలో..
చిత్రేణిపల్లె, నరసాపురం గ్రామాల లబ్ధిదారులకు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఇంటి స్థలాలను ఇస్తున్నారు. ఆలమూరు రెవెన్యూ పరిధిలోని హరినగరం ప్రాంతంలో కేటాయించారు. నరసాపురం గ్రామస్థులకు 58 మందికి, చిత్రేణిపల్లె గ్రామస్థులకు 61 మందికి ఇక్కడ ఇంటి స్థలాలు సిద్ధం చేశారు. అంత దూరంలో స్థలాలు తమకు వద్దని లబ్ధిదారులు అంటున్నారు. కేటాయించిన స్థలాల్లో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని, నివాస యోగ్యం కాదని వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
ఉన్నతాధికారుల దృష్టికి..నాగేశ్వర్‌రెడ్డి, తహసీల్దారు, రుద్రవరం
కోటకొండ గ్రామస్థులు శ్మశానం పక్కన స్థలాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. గ్రామంలో సుమారు 60 మందికి ఇళ్ల స్థలాలు సిద్ధం చేశాము. ఇప్పటికే 45 మందికి కేటాయించాము. చిత్రేణిపల్లె, నరసాపురం గ్రామాలకు చెందిన 119 మందికి హరినగరం సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించాం. వాటిని తీసుకునేందుక లబ్ధిదారులు ఇష్టపడటం లేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాను..
Updated Date - 2020-07-14T10:49:49+05:30 IST