దేశంలోనే అగ్రగామి యూనివర్సిటీగా తీర్చిదిద్దుతాం
ABN, First Publish Date - 2020-12-15T05:59:59+05:30
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఉప కులపతి డాక్టర్ విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు.
పరిశోధనలు, విస్తరణలో మెరుగైన ఫలితాలు తీసుకొస్తాం
ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ విష్ణువర్దన్‌రెడ్డి
అనకాపల్లి, డిసెంబరు 14: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఉప కులపతి డాక్టర్ విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విశాఖ జిల్లా అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని సందర్శించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామని, యూనివర్సిటీని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 2018లో 31వ స్థానంలో వున్న యూనివర్సిటీ, ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో నిలిచిందన్నారు. శాస్త్రవేత్తలకు అన్ని సదుపాయాలు కల్పించి జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొనేలా తర్ఫీదు ఇస్తామన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లలో సీట్లు దక్కించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక టెక్నాలజీని అభివృద్ధి చేసి ఇతర రాష్ట్రాలు కూడా ఉపయోగించుకునేలా కృషిచేస్తామన్నారు. శాస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా పూర్తిస్థాయిలో సమావేశాల్లో పాల్గొనేటట్టు చేస్తామన్నారు. చెరకులో పసుపాకు తెగులు నివారణకు అగ్రగామి శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేయిస్తామని చెప్పారు. సమావేశంలో ఏడీఆర్ డాక్టర్ ఎం.భరతలక్ష్మి, ఎక్స్‌టెన్షన్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వాటి ద్వారా రైతులకు యూనివర్సిటీ అభివృద్ధి చేసిన టెక్నాలజీ చేరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మెడికల్ కళాశాల స్థలంపై అంగీకారం లేదు
అనకాపల్లి పరిశోధన స్థానం ప్రాంగణంలో మెడికల్ కళాశాల కోసం స్థలం ఇవ్వడానికి అంగీకారం తెలియజేయలేదని వీసీ విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు.
టిష్యూ కల్చర్ ల్యాబ్ పరిశీలించిన వీసీ
ఆర్‌ఏఆర్‌ఎస్‌ను ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ విష్ణువర్థన్‌రెడ్డి సందర్శించారు. పరిపాలన భవనంలోని టిష్యూకల్చర్ ల్యాబ్‌ను పరిశీలించారు. ఆయనకు ఏడీఆర్ డాక్టర్ ఎం.భరతలక్ష్మి, శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో జరిగే పరిశోధనలను వివరించారు. బయో ఫెర్టిలైజర్స్, ఐబీఎం ల్యాబ్‌లను పరిశీలించిన అనంతరం క్షేత్ర సందర్శన చేశారు. ఆయన వెంట పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఉన్నారు.
Updated Date - 2020-12-15T05:59:59+05:30 IST