-
‘ఏజెన్సీ చట్టం’తో ఎస్సీ, బీసీలకు అన్యాయం
ABN, First Publish Date - 2020-05-30T06:11:06+05:30
ఉభయ తెలుగు రాష్ట్రాల ఏజన్సీ ప్రాంతాలలో జనగణన సమగ్రంగా చేస్తే అటవీ ప్రాంతంలో ఏశాతం మేరకు బిసీలు, ఎస్సీలు ఉన్నారో తెలుస్తుంది. వారి సంక్షేమానికి, ఉద్యోగాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి.
ఉభయ తెలుగు రాష్ట్రాల ఏజన్సీ ప్రాంతాలలో జనగణన సమగ్రంగా చేస్తే అటవీ ప్రాంతంలో ఏశాతం మేరకు బిసీలు, ఎస్సీలు ఉన్నారో తెలుస్తుంది. వారి సంక్షేమానికి, ఉద్యోగాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. దళితులు, బలహీన వర్గాలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు వారికి అందేలా చేయాలి.
భారత దేశపు అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్ 22 న ఇచ్చిన ఒక తీర్పులో ఏజన్సీ ప్రాంతంలో గిరిజనలకు ఉద్దేశించిన 100% రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం అని కొట్టివేసింది. ఇది ‘అబ్‌నాక్సియస్’ అని కూడా వ్యాఖ్యానించింది. అంటే చాలా చెడ్డది దండనీయమైనది అని అర్థం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 జనవరి 10న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏజన్సీ ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలన్నీ ట్రైబల్స్ కే ఇవ్వాలి. అంతకు ముందు 1986 నవంబర్ 5 నాటి జి. ఓ. నెంబర్ 275 రిజర్వేషన్ చట్టాన్ని కూడా సుప్రీం కోర్టు ప్రస్తావించింది. ఈ రెండు చెల్లవు అని ఇందిరా షెనాయ్ కేసులో చెప్పిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించ రాదని చెబుతూ పైన చెప్పిన నోటిఫికేషన్ తర్వాత నూరు శాతం రిజర్వేషన్ చెల్లదు అని ఇది రాజ్యాంగ విరుద్ధం అని తీర్పును వెలువరించింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని బీసీ, ఎస్సీలు ఈ తీర్పును మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఇంకా ఆహ్వానించనివారు ఎవరైనా ఉంటే తప్పక దీన్ని ఆహ్వానించవలసి ఉంది.
ఈ రిజర్వేషన్ చట్టం ఏజన్సీ ప్రాంతంలో ఉన్న దళిత కులాల వారికి వెనుకబడిన కులాల వారికి కూడా తీరని అన్యాయం చేసింది. అటవీ ప్రాంతాలలో కూడా చాలా మంది వెనుకబడిన తరగతుల వారు వేరు వేరు దళిత కులాలకు చెందిన వారు ఉన్నారు. వారికి ఈ రిజర్వేషన్ చట్టం తీవ్ర అన్యాయాన్ని కలిగిస్తుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన రోజుల్లో కూడా నాటి దళిత బిసీ కులాలవారు ఇది మాకు అన్యాయం చేస్తుంది అని గొంతెత్తారు. కాని ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చలేకపోయారు. దరిమిలా న్యాయ పోరాటం మొదలైంది. ఇన్ని సంవత్సరాలకు రెండు దశాబ్దాల తర్వాత సుప్రీం తీర్పు వెలువడింది. దీని ప్రకారం ఎస్సీ బీసీలకు న్యాయం జరుగుతుందని భావించవచ్చు. కాని ఇంకా కొంత మంది కొట్టి వేసిన ఈ పాత చట్టాన్ని సమర్థించడం న్యాయం కాదు.
ఒక ఉదాహరణ తీసుకుంటే ఖమ్మం జిల్లాలో ఏనుకూరు నుండే ఏజన్సీ ప్రాంతం మొదలు అవుతుంది. అక్కడనుండి జూలూరుపాడు, బూర్గుంపాడు, సారపాక, భద్రాచలం, ఎటపాక దాకా ప్రతి గ్రామం, చిన్న పట్టణాలలో కూడా మాదిగ గూడేలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా బీసీ కాలనీలు ఉన్నాయి. ఈ వ్యాస కర్త ఇటీవలే ఖమ్మం జిల్లాలో చాలా గ్రామాలలో ఇటు కూసుమంచి నుండి అటు ఎటపాక దాకా క్షేత్రపరిశోధన నిర్వహించాడు. “The Madigas of Telangana- A Study of Socio-Cultural Transformation” అనే రిసెర్చి ప్రాజెక్టు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని CDAST సెంటర్ ఫర్ దళిత్, అదివాసీ అండ్ ట్రాన్స్ లేషన్ స్టడీస్ అనే పరిశోధన కేంద్రంలో నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా ఈ క్షేత్రపరిశోధన సాగింది. ఈ మార్చి నెలలో 16నుండి 19 వ తేదీదాకా ఈ పరిశోధన జరిగింది. నాతోపాటు ఐదుగురు రిసెర్చి స్కాలర్లు ఈ పరిశోధనలో పాల్గొన్నారు.
మేము ప్రతి పల్లెలోను దళిత వాడల్లో కొన్ని వందల మంది మాదిగలను కలుసుకొని వారితో మాట్లాడాము. ఏనుకూరు నుండి మొదలుకొని జూలూరుపాడు, కాకర్ల, బూర్గుంపాడు ఇలా ఆ క్రమంలోని ప్రతి మాదిగ గూడెంలో విద్యావంతులు సామాన్యులు ఇక్కడు ఉన్న రిజర్వేషన్ చట్టం కారణంగా మాకు ఏ ఉద్యోగాలు రావడం లేదని కళ్లనీళ్ల పర్యంతం అయ్యారు. మేము ప్రభుత్వం తరఫున వచ్చామనుకొని మీ పరిశోధనలు సమాచార సేకరణ మాకెందుకు పనికి వస్తుంది, మాకు తీరని అన్యాయం జరిగిన తర్వాత మీరు ఏమీ చేసి ఏమి లాభం అని మమ్మలని నిలదీసి అడిగారు. మేము డిగ్రీలు చదివి బిఎడ్ చేసి ఏ ఉద్యోగాలు రాక ఇక్కడ క్వారీలలో, గ్రానేట్ ఫాక్టరీలలో కూలీలుగా పనిచేస్తున్నాము అని చెప్పారు. మాదిగలేకాక అక్కడి బిసీ కులాల వారు కూడా ఇదే మాటలు చెప్పారు. ఏజన్సీ ప్రాంతంలోని కొన్ని వందల గ్రామాలలో దళితవాడలు ఉన్నాయి. బీసీలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. వారికి టీచర్ ఉద్యోగాలు మాత్రమే కాదు మిగతా ఉద్యోగాలు కూడా చట్టవిరుద్ధంగా వారికే పోతున్నాయి. ఎస్సీ బీసీలకు రావడం లేదు. మా ఆధార్ కార్డులు ఇక్కడే ఉంటాయి. మాకు వేరే ప్రాంతంలో ఉద్యోగాలు రావు ఇక్కడా రావు. మేము పూర్తిగా అన్యాయానికి గురౌతున్నాము అని దీనంగా చెప్పారు. గిరిజన పాఠశాలల్లో గిరిజన భాషలోనే పాఠాలు కింది తరగతుల వరకు చెప్పాలి అనే నిబంధన ఉన్నా ఆ ప్రాంతాలలో ఉన్న దళిత బిసీ కులాల వారు కూడా గిరిజన భాషలు మాట్లాడగలుగుతారు. కాబట్టి ఉద్యోగాలలో గిరిజన భాష రావడం తప్పనిసరి అని చెప్పవచ్చు కాని గిరిజనులకే అని నోటిఫికేషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. గిరిజన భాషల టీచర్ ఉద్యోగాలు మాత్రమే కాదని ప్రభుత్వంనుండి ఏ విధమైన పథకాలు వచ్చినా కూడా గిరిజనులకే పోతున్నాయని ఏ లబ్ధి కూడా తమకు రావడంలేదని చెప్పారు. ఇదే పరిశోధకుడు నాలుగు సంవత్సరాల క్రితం మేడారం జాతర పరిశోధనలో భాగంగా కోయవారిని చాలామందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వచ్చే ఉద్యోగాలు అన్నీ ఒకే గిరిజన తెగకు పోతున్నాయి కోయలకు ఉద్యోగాలలో అన్యాయం జరుగుతూ ఉందని మొరపెట్టుకున్నారు. ఏజన్సీ అంటే అటవీ ప్రాంతాలలో ఇటు వరంగల్ ఖమ్మం, అటు గోదావరి, విశాఖ పట్టణం జిల్లాలలో కేవలం గిరిజనులు మాత్రమే కాదు గణనీయమైన సంఖ్యలో బీసీలు, ఎస్సీలు కూడా ఉన్నారు. ఈ పరిశోధకుడు 2019 డిసెంబర్ లో విశాఖ జిల్లాలోని కొన్ని గ్రామాలలో క్షేత్రపరిశోధన చేశాడు. అక్కడ కూడ పైన చెప్పిన పరిస్థితే ఉంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు చిన్న వ్యవసాయ క్షేత్రం కలిగిన బిసీలు అక్కడి గ్రామాలలో కనిపించారు. కొన్నితరాలుగా వారు అక్కడ ఉన్నారు. అంతే కాదు ఏజన్సీ చట్టం పరిధి లోనికి వచ్చే గ్రామాలు పట్టణాలు అటవీ ప్రాంతానికి కొంత బయట ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో సారపాక దగ్గరనుండి ఏనుకూరు దాకా అడవి ఏమీ కనిపించదు. అక్కడక్కడ తుప్పఅడవులు ఉంటాయి. కాని ఏనుకూరు దాకా ఏజన్సీ ప్రాంతంలోనే ఉంది. అక్కడ కొన్ని వందల గ్రామాలు పట్టణాలలో ఎస్సీ, బీసీలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. వారందరి జీవితాలకు పైన చెప్పిన రిజర్వేషన్ చట్టం గొడ్డలి పెట్టులాంటిది. దాదాపు ఒక తరం ఈ చట్టం వల్ల ఉద్యోగాలు లేక నష్టపోయింది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఇప్పటికైనా ఏజన్సీ ప్రాంతంలో ఉన్న దళిత, వెనుకబడిన కులాల వారికి మేలు జరుగుతుందని ఇప్పటిదాకా వారికి జరిగినది అన్యాయమేనని ప్రభుత్వం గుర్తించి ఇక పైన న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. అక్కడున్న గిరిజనులలో కూడా అంతర్గత న్యాయం జరగలేదని చెప్పారు. గిరిజనులలో కాని, ఎస్సీ బిసీలలో కాని అంతర్గతంగా ఉన్న అన్ని ఉపకులాలకు, అన్ని గిరిజన తెగలకు సరైన సమన్యాయం జరిగినప్పుడే దేశంలో రిజర్వేషన్ పెట్టిన సదాశయం నెరవేరినట్లు భావించాలి. రిజర్వేషన్ చట్టాలు ఆమేరకు చట్టాన్ని సవరించవలసి ఉంది. అంతే కాదు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఏజన్సీ ప్రాంతంలో పూర్తిగా సర్వే చేయించి, తిరిగి జనగణన సమగ్రంగా చేస్తే అటవీ ప్రాంతంలో ఏశాతం మేరకు బిసీలు ఎస్సీలు ఉన్నారో తెలుస్తుంది. వారి సంక్షేమానికి వారి ఉద్యోగాలకు ప్రభుత్వం బాధ్యత వహించి భారత రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులు వారికి అందేలా చేయాలి.
– పులికొండ సుబ్బాచారి
Updated Date - 2020-05-30T06:11:06+05:30 IST
Advertising
Advertising