మరో ఎదురుదెబ్బ!
ABN, First Publish Date - 2020-05-30T06:00:50+05:30
న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తింటున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్‌ను ఆ పదవిలో...
న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తింటున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్‌ను ఆ పదవిలో కొనసాగించాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను, పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్‌ను పూర్తిగా మార్చేస్తున్న ప్రభుత్వ ఆర్డినెన్సునూ ధర్మాసనం కొట్టివేసింది. ఆర్డినెన్సు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని నిర్థారిస్తూ, ఈ క్షణం నుంచే రమేష్‌కుమార్ ఎన్నికల కమిషనర్ అని ధర్మాసనం ప్రకటించింది. ఆర్డినెన్సు రద్దుతో రమేష్‌కుమార్ ఎస్‌ఈసీగా కొనసాగడంతో పాటు, కరోనా కట్టడికాలంలో ప్రభుత్వం హడావుడిగా తెచ్చికూచోబెట్టిన జస్టిస్ కనగరాజ్ ఆ పదవికి దూరంకాక తప్పదు.
కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేసినందుకు రమేష్‌కుమార్‌మీద జగన్మోహన రెడ్డి తీవ్రంగా మండిపడి ఆయనను ఆ పదవికి దూరం చేయడమే కాక, కులం ఆపాదిస్తూ ఘాటైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనమేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్ సిద్ధపడి షెడ్యూల్ కూడా ప్రకటించారు. కానీ, ఎన్నికల ప్రక్రియ సాగుతుండగానే దేశవ్యాప్తంగా కరోనా పెరగడం మొదలైంది. షెడ్యూల్ ప్రకారం పోలింగ్ జరిగితే ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమని రమేష్‌కుమార్ ఆరువారాలపాటు ఎన్నికలవాయిదా నిర్ణయం తీసుకున్నారు. కేంద్రస్థాయిలో సంప్రదింపులు జరిపి, ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతూ, కేంద్రం జారీ చేసిన జాతీయవిపత్తు ప్రకటనను, వివిధ రాష్ట్రాలు చేపట్టిన జాగ్రత్త చర్యలను ఆయన గుర్తుచేశారు. బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో అధికస్థాయి హ్యూమన్ కాంటాక్ట్ ప్రమాదాన్ని ఎత్తి చూపారు. కరోనా హెచ్చరికలను ఉపసంహరించుకున్న మరుసటి రోజునుంచే సదరు ప్రక్రియ ఆగినచోటనుంచే తిరిగి ఆరంభమవుతుందనీ, ఏకగ్రీవాలన్నీ యధాతధంగా చెల్లుతాయని కూడా ఆయన హామీ ఇచ్చారు. కానీ, ఎన్నికల సంఘం కంటే ముందు కళ్ళుతెరవాల్సిన పాలకులే ఎన్నికల వాయిదాను కరోనాకంటే ప్రమాదకరమైన నిర్ణయంగా భావించారు. పదినెలలపాటు మీడియాముందుకు రాని ముఖ్యమంత్రి వస్తూవస్తూనే ఎన్నికల కమిషనర్‌పై కుత్సితమైన ఆరోపణలు చేశారు. పలువురు మంత్రులు ఆయన అడుగుజాడల్లో నడిచారు. ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోవడం, అది ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించడం తెలిసిందే.
సుప్రీంకోర్టు చెప్పిన తరువాతైనా ప్రభుత్వం తన ధోరణి మార్చుకొని ఉంటే బాగుండేది. కానీ, తాను అనుకున్నదే జరగాలనీ, స్వతంత్ర వ్యవస్థలన్నీ తన ముందు సాగిలబడాలని ఆశించే పాలకులు ఈ పరిణామాలను సహించలేకపోయారు. ఎస్‌ఈసీ పదవీకాలాన్ని మూడేళ్ళకు కుదిస్తూ, నిబంధనలను తమకు అనుకూలమైన రీతిలో మార్చి ఓ ఆర్డినెన్సు ద్వారా రమేష్‌కుమార్ స్థానంలో మరో మనిషిని మరో రాష్ట్రం నుంచి తెచ్చి కూచోబెట్టారు. ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం అంత సులభమైతే రాజ్యాంగ కర్తలు పార్లమెంటులో మూడువంతుల మెజారిటీ వంటి నియమాలు ఎందుకు పెడతారు? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ వ్యక్తిమీద పాలకులకు ఇలా విరక్తి కలిగినవెంటనే పాత నియమాలను చెరిపేసి, కొత్తవి రాసి గతకాలానికి కూడా వీటిని వర్తింపచేయాలని చూస్తే న్యాయస్థానాలు ఎలా ఊరుకుంటాయి? మాకు నచ్చినట్టుగా రూల్సు మార్చేశాం ఇక ఇంటికి పొమ్మని గద్దిస్తే ఎలా కుదురుతుంది? ఈ తొలగింపు న్యాయబద్ధం, రాజ్యాంగవిహితం కాదని అప్పట్లోనే నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుమీద సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్న ఆలోచనలో తాము ఉన్నట్టుగా అధికారపక్ష నేతలు చెబుతున్నారు. ఈ నిరంకుశ వైఖరి కారణంగానే సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు అనేకులు కోర్టు ముందు నిలబడాల్సి వస్తున్నది, క్షమాపణలు చెప్పుకోవాల్సి వస్తున్నది. ఏడాదిలో దాదాపు 65సార్లు న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తిన్న పాలకులు ఇప్పటికైనా అహాన్ని విడిచిపెట్టి, న్యాయబద్ధంగా, రాజ్యాంగ
విహితంగా నడుచుకుంటే ఉత్తమం.
Updated Date - 2020-05-30T06:00:50+05:30 IST