ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా – తబ్లీఘ్

ABN, First Publish Date - 2020-04-08T05:55:55+05:30

సౌదీఅరేబియాలోని మక్కాలో ఇస్లాం ఆవిర్భవించింది. విశ్వవ్యాప్తంగా ఈ మతాన్ని అనుసరించేవారిని భారత దేశం అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహమేమీ లేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీలో మార్చి 13–15 తేదీల్లో తబ్లీఘ్ జమాత్ నిర్వహించిన మత సమ్మేళనంలో పాల్గొన్న అనేక మందికి కరోనా వైరస్ సంక్రమించడంతో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది. తమ సంస్థపై వెల్లువెత్తుతున్న విమర్శలకు వ్యతిరేకంగా తబ్లీఘ్ ప్రతినిధులు చేస్తున్న వాదనలో హేతుబద్ధత ఉన్నా నైతిక, సామాజిక బాధ్యత లేదు. అంతకు ముందు మలేషియాలో జరిగిన ఇజ్తెమాలో పాల్గొన్న కొందరికి కరోనా సోకినట్లుగా తెలిసినా భారత్‌లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో తబ్లీఘ్ విఫలమైంది.


సౌదీఅరేబియాలోని మక్కాలో ఇస్లాం ఆవిర్భవించింది. విశ్వవ్యాప్తంగా ఈ మతాన్ని అనుసరించేవారిని భారత దేశం అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహమేమీ లేదు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో కేంద్రీకృతమైన తబ్లీఘ్ జమాత్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైనది. ఇంచుమించు 120 దేశాలలోని ముస్లింల ఆధ్యాత్మిక, ధార్మిక విధానాలపై బలమైన పట్టు ఈ ఇస్లామిక్ సంస్థకు ఉన్నది. ఏ విధమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక ఆంశాలతోనూ తబ్లీఘ్ ప్రమేయం పెట్టుకోదు. కేవలం ధార్మిక చింతనా నిబద్ధతను మాత్రమే బోధించే విభిన్నమైన, విలక్షణమైన సంస్థ తబ్లీఘ్ జమాత్. ఈ ఇస్లామిక్ సంస్థ ఇప్పుడు అనూహ్యంగా, భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో ప్రధాన పాత్ర పోషించిందనే విమర్శలను ఎదుర్కొంటున్నది. 


తబ్లీఘ్ జమాత్ అనుయాయులు కనీసం వార్తా పత్రికలను సైతం చదవరు. దీన్ని బట్టి వారికి బాహ్య ప్రపంచంతో ఉన్న సంబంధాలను ఉహించుకోవచ్చు. వార్షిక పరీక్షా ఫలితాల కొరకు ఎదురు చూసే బాలల మొదలు ఉద్యోగ విరమణతో విశ్రాంత జీవితంలోకి ప్రవేశించిన వారు, ప్రవాసంలో తీరిక లేకుండా గడిపే ముస్లింల దాకా అందరూ దైవ మార్గంలో నడవడానికి ఈ సంస్థ మార్గదర్శకత్వం వహిస్తుంది. విశ్వాసులను బృందాలుగా తీసుకెళ్ళి నమాజు విధానంలో వారికి లోతైన శిక్షణ ఇస్తుంది.


మర్కజ్ అంటే కేంద్రం, ప్రధాన కార్యాలయం. తెలంగాణలో ఇప్పటికీ అనేక ప్రభుత్వ పాఠశాలలను మర్కజీ పాఠశాలలుగా పిలుస్తారు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె. జయశంకర్ హన్మకొండలోని మర్కజీ పాఠశాలలో చదివారు. ‘అమీర్’ అంటే అరబ్బి భాషలో ‘నాయకుడు’ అని అర్ధం, అందుకే కువైత్, ఖతర్ రాజులను అమీర్ అని సంబోధిస్తారు. అదే విధంగా తబ్లీఘ్ సంస్థ అధినేతను కూడా అమీర్ అని అంటారు. దక్షిణాసియాతో పాటు బ్రిటన్‌లో ఈ సంస్థ పటిష్ఠంగా వేళ్ళూనుకునివున్నది. ఢిల్లీ మహానగరం తబ్లీఘ్‌కు ప్రధాన కేంద్రం. ఈ సంస్థపై నిఘా సంస్థలు నిరంతరం కన్నేసి ఉంచడం కద్దు. ఏటా 40 రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆధ్యాత్మిక ధర్మ ప్రబోధానికి నిర్వహించే పర్యటన ఈ సంస్థ ముఖ్య కార్యక్రమం. దీన్ని ‘ఛిల్లా’ అంటారు. ఛిల్లా అనేది చాలీసా (40 శ్లోకాల హనుమంతుడి పారాయణానికి కూడా చాలీసా అని పేరు). ఈ ఆధ్యాత్మిక పర్యటనా కార్యక్రమానికి ఒక సంవత్సరం ముందు నుంచీ ప్రణాళికను రూపొందిస్తారు. అందులో కొందరికి మర్కజ్‌కు వచ్చే అవకాశం ఉంటుంది. మరికొందరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ఈ పర్యటనలలో భాగంగా అక్కడక్కడ రాష్ట్ర, జాతీయ స్థాయిలలో సమ్మేళనాలు (ఇజ్తెమా) జరుగుతాయి. జాతీయ స్థాయిలో ఎక్కువగా ఢిల్లీ, భోపాల్ నగరాలలో జరిగే ఇజ్తెమాలలో క్రియాశీలక కార్యకర్తలు పాల్గొంటారు. 


ఈ విధంగా, మార్చి 13–-15 తేదీలలో జరిగిన ఇజ్తెమాలలో పాల్గొన్న అనేక మందికి కరోనా వైరస్ సంక్రమించడం దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నది. చట్టపరంగా పరిశీలిస్తే, ఢిల్లీ సర్కారు నిషేధం విధించిన 16వ తేదీకి పూర్వమే తమ ఇజ్తెమా జరిగిందని, తమ వద్ద ఉన్న సందర్శకుల సంఖ్య, ఇతర వివరాల గురించి ఢిల్లీ పోలీసులకు తెలియజేశామని, వారిని వారి స్వస్థలాలకు పంపించివేసేందుకుగాను ప్రత్యేక బస్సుల ఏర్పాటునకు అనుమతి కోరినా పట్టించుకోలేదని తబ్లీఘ్ జమాత్ ప్రతినిధులు అంటున్నారు. వారి వాదనలో హేతుబద్ధత ఉన్నా నైతిక, సామాజిక బాధ్యత లేదు. అంతకు ముందు మలేషియాలో జరిగిన ఇజ్తెమాలో పాల్గొన్న కొందరికి కరోనా సోకినట్లుగా తెలిసినా భారత్‌లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో తబ్లీఘ్ విఫలమైంది. విదేశీయుల రాక గూర్చి పూర్తి సమాచారం ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఉదాసీనత వైఖరి అవలంభించింది. ఇదే సమయంలో కరోనా వైరస్ ముప్పును కేంద్రం తీవ్రంగా పరిగణించలేదు, తత్కారణంగానే మార్చి నెల నడిమినాళ్ళ దాకా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగలేదు. ఇండోనేషియా ఇజ్తెమాలో పాల్గొని తిరిగి వచ్చిన తబ్లీఘ్ జమాత్ సభ్యులకు కరీంనగర్‌లో నిర్వహించిన వైద్య పరీక్షలలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తెలంగాణ సర్కార్ సమాచారం అందించే వరకు కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియదు. చైనా, ఇరాన్ నుంచి వచ్చే ప్రయాణీకులను పరీక్షించిన భారతదేశం అదే ఇరాన్ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల నుండి వచ్చే ప్రయాణీకులను, దుబాయి–బెంగుళూరు–హైదరాబాద్ కేసు వెలుగులోకి వచ్చే వరకు పరీక్షించడం ప్రారంభించలేదు!


కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భారతదేశంతో పోల్చితే గల్ఫ్ దేశాలు వెనుకబడ్డాయని చెప్పవచ్చు. భారత్, మిగిలిన గల్ఫ్ దేశాలు అమలుపరచడం ప్రారంభించిన తర్వాతనే లాక్‌డౌన్‌ను దుబాయి ప్రకటించింది. సౌదీ అరేబియాలో కరోనా మహమ్మారి బాధితుల సంఖ్య మిగతా గల్ఫ్ దేశాలలో కంటే చాలా అధికంగా ఉన్నది. అసలు భారతదేశంలో తొలి కరోనా మృతి కూడ మక్కా నుండి తిరిగి వెళ్ళిన 76 ఏళ్ళ కర్ణాటక యాత్రికుడిది కావడం గమనార్హం. కువైత్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లలో ఉన్న కరోనా రోగులలో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. కార్మిక ఆవాసాలలోని ఇరుకయిన గదులలో ఎక్కువ మంది నివసిస్తుండడంతో ఈ మహమ్మారి శరవేగంగా సంక్రమిస్తుండడం ఎంతైనా ఆందోళన కలిగిస్తోంది. చట్టవిరుద్ధంగా ఉంటున్న భారతీయులను తీసుకెళ్ళండంటూ కువైత్ ఒత్తిడి చేస్తుండడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కువైత్ అమీర్‌తో మాట్లాడారు. 


దాదాపు అన్ని గల్ఫ్ దేశాలలోను వివిధ సాంకేతిక కారణాలవల్ల జైళ్ళలో మగ్గుతున్న ఖైదీలను విడుదల చేశారు. అలాగే వీసాల రెన్యువల్ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తామని ఈ దేశాలు ప్రకటించాయి. ప్రైవేట్ రంగం కుదేలయిపోయింది. చమురు ధరల పతనమవుతున్న నేపథ్యంలో గల్ఫ్‌లో కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2020-04-08T05:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising