కరోనా కష్టాల్లో ప్రవాసులు
ABN, First Publish Date - 2020-03-11T08:16:27+05:30
చైనానుంచి ఇరాన్ మీదుగా గల్ఫ్ దేశాలలో కరోనా మహమ్మారి క్రమేణా వ్యాపిస్తోంది. దీంతో ఈ ఎడారి దేశాలలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అరబ్ దేశాల నుంచి చమురును పెద్ద ఎత్తున...
కువైత్‌లోని కడప, చిత్తూరు జిల్లాల; బహ్రెయిన్ లోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల ప్రవాసుల ఆర్థిక జీవనాన్ని కరోనా వ్యాధి అతలాకుతలం చేసింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌ల మధ్య రోడ్డు మార్గంపై రాకపోకలను నిషేధించడంతో సేవల రంగంలో జీవనోపాధి పొందుతున్న తెలంగాణ ప్రవాసులు అనేక మంది వీధుల పాలయ్యారు. ఇస్లాం మత పుణ్య క్షేత్రాలైన మక్కా, మదీనాలలో ధార్మిక పర్యాటక వ్యాపారాలు చేసే అనేకమంది హైదరాబాదీల వ్యాపారాలు వీసాల రద్దు కారణాన పూర్తిగా దెబ్బతిన్నాయి.
చైనానుంచి ఇరాన్ మీదుగా గల్ఫ్ దేశాలలో కరోనా మహమ్మారి క్రమేణా వ్యాపిస్తోంది. దీంతో ఈ ఎడారి దేశాలలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అరబ్ దేశాల నుంచి చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొనే దేశాలలో చైనా ఒకటి. కరోనా వ్యాధి ప్రజ్వరిల్లడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఈ విపత్సమయంలోనే సౌదీ అరేబియా, రష్యాల మధ్య చమురు ధరల విషయమై వాణిజ్య యుద్ధం ప్రారంభమయింది. తత్పర్యవసానంగా చమురు ఎగుమతిపై ఆధారపడ్డ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు అలజడికి గురయ్యాయి. ఈ ఆర్థిక కల్లోలం ఇక్కడ పని చేస్తున్న తెలుగు ప్రవాసులతో సహా భారతీయులందరినీ బాగా ప్రభావితం చేస్తోంది. ఈ ప్రతికూల ప్రభావం మరింతగా విషమిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.
ప్రతి పట్టణం, నగరంలోనూ జనసందడి తగ్గుముఖం పడుతున్నది. ఇందుకు ఇస్లాం ధార్మిక ప్రదేశమైన మక్కాలోని మస్జీదు పరిసరాలు గానీ, దుబాయిలోని విలాసవంతమైన హోటళ్ళు గానీ ఏ మాత్రం మినహాయింపు కాదు. గల్ఫ్‌లో పెద్ద దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లు తమ విద్యా సంస్థలకు నిరవధికంగా సెలవులు ప్రకటించాయి. యుఏఇ నుంచి చెన్నైకి వెళ్ళే ఎమిరేట్స్ విమానం బోయింగ్ 777లో సీటింగ్ కెపాసిటీ 360 సీట్లు. ఈ విమానం ఎప్పుడూ నిండుగా వెళ్ళడం పరిపాటి. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణాన అందులో వెళుతున్న ప్రయాణీకులు 20 మంది కూడా వుండడం లేదు. అరబ్ దేశాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ ఎయిర్ లైన్స్‌గా ఎమిరేట్స్‌కు గుర్తింపు వున్నది. ఒక్క హైదరాబాద్ నగరం నుండి ప్రతి రోజు మూడు పెద్ద సైజు బోయింగ్ విమానాల ద్వారా వేయి మందికి పైగా ప్రయాణీకులను దుబాయి మీదుగా ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలకు ఎమిరేట్స్ నిత్యం చేరవేస్తుంది. అలాంటిది ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానాలలో రద్దీ బాగా తగ్గిపోయింది.
పని లేని దృష్ట్యా తమ సిబ్బందిని సెలవుపై పంపించి వేస్తున్నదంటే ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ పరిస్ధితిని ఉహించుకోవచ్చు. గిరాకి తగ్గడమనేది ఏ ఒక్క ఎయిర్ లైన్స్‌కు సంబంధించిన సమస్య కాదు, కువైత్‌లో అక్రమంగా టాక్సీ నడిపే కడప జిల్లా పుల్లంపేటకు చెందిన ప్రవాసుడిది కూడా ఇదే దయనీయ పరిస్థితి. చైనా నుంచి నౌకల రాక తగ్గిపోవడంతో దిగుమతులకు తీవ్ర అవరోధమేర్పడింది. ఫలితంగా పనులు ఆగిపోవడంతో ఇబ్బంది పడుతున్న సంస్ధల సంగతిసరేసరి.
లక్షల సంఖ్యలో వున్న తెలుగు ప్రవాసులలో అనేక మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఇంకా పలువురి ప్రయాణ ప్రణాళికలు అయోమయంలో పడ్డాయి. వేసవి సెలవుల సందర్భంగా స్వదేశంలోని స్వస్థలాలకు వెళ్ళాలనుకున్నవారు ఇప్పుడు సంకటంలో పడ్డారు. భారత్ నుంచి విమానాల రాకపోకలను కువైత్, ఖతర్ దేశాలు తాత్కాలికంగా నిషేధించాయి. పర్యాటక, ధార్మిక (ఉమ్రా) వీసాల జారీని సౌదీ అరేబియా నిలిపివేసింది. గల్ఫ్ దేశాల మధ్య ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఈ ఎడారి దేశాలలో ఇలా ఆంక్షలు విధించడం ఇదే మొదటి సారి. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. అరబ్ దేశాలలో పెద్దన్న పాత్ర పోషించే సౌదీ అరేబియాకు మిగిలిన అన్ని దేశాలతో రోడ్డు రవాణా వ్యవస్ధ ఉన్నది. కరోనా వైరస్ ప్రమాదంతో ముందు జాగ్రత్త చర్యగా సౌదీ అరేబియా తన సరిహద్దులు మూసివేసింది. దీంతో సౌదీ మార్కెట్‌పై ఆధారపడ్డ మిగిలిన గల్ఫ్ దేశాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. చిన్న దేశాలైన కువైత్, బహ్రెయిన్‌లలో కరోనా కేసులు చాలా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. పెద్ద దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. కువైత్, బహ్రెయిన్ దేశ వాసులలో షియాలు అధిక సంఖ్యలో వున్నారు. వీరు ఇరాన్‌లో తమ ధార్మిక స్ధలాలను సందర్శించి, స్వదేశానికి తిరిగివస్తూ తమ వెంట కరోనాను తీసుకువచ్చారు!
కువైత్‌లోని తెలుగు ప్రవాసులలో ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు జిల్లాల వారు చాలా పెద్ద సంఖ్యలో వున్నారు. ఈ ప్రవాసాంధ్రులలో అత్యధికులు చిన్న చితకా ఉద్యోగాలు చేసుకుంటున్నవారే. కరోనా వ్యాధి కారణాన జన సంచారం తగ్గిపోవడంతో వీరందరూ ఆర్థికంగా నష్టపోతున్నారు. దుకాణాలకు అద్దెలు చెల్లించడం కూడ కష్టమవు తుందని పలువురు వాపోతున్నారు. హోటల్ రంగంలో గిరాకీ గణనీయంగా తగ్గిందని కువైత్ సిటీలోని సల్వా రెస్టారెంట్ యాజమాని ఫైసల్ చెప్పారు(ఈయన కువైత్‌లో భారతీయ ఆహార ప్రియులకు 1972 నుంచి హైదరాబాదీ బిర్యానీని విక్రయిస్తున్నారు). గిరాకీ మున్ముందు మరింత పడిపోయే ప్రమాదం ఎంతైనా వున్నదని కువైత్‌లో చాలా కాలంగా నడుస్తున్న సుప్రసిద్ధ ‘తిరుపతి హోటల్’ యజమాని భాస్కర్ నాయుడు అభిప్రాయపడ్డారు. కరీంనగర్, నిజామాబాద్ ప్రవాసులు అత్యధికంగా ఉన్న బహ్రెయిన్ లోనూ సరిగ్గా అదే పరిస్థితి ఉన్నది. సౌదీ అరేబియా- బహ్రెయిన్‌ల మధ్య రోడ్డు మార్గం పై రాకపోకలను నిషేధించడంతో సేవల రంగంలో జీవనోపాధి పొందుతున్న తెలంగాణ ప్రవాసులు అనేక మంది వీధుల పాలయ్యారు. చైనా నుంచి దిగుమతులు పూర్తిగా నిలిచి పోవడంతో గల్ఫ్ దేశాలలో అనేక సరుకుల కొరత ఏర్పడింది. వ్యాపారాలు దెబ్బతినడంతో ప్రాంతీయ హబ్‌గా ఉన్న దుబాయి డీలాపడింది. చైనా సందర్శకుల వెలితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇస్లాం మత పుణ్య క్షేత్రాలైన మక్కా, మదీనాలలో ధార్మిక పర్యాటక వ్యాపారాలు చేసే అనేక మంది హైదరాబాదీల వ్యాపారాలూ, వీసాల రద్దు కారణాన పూర్తిగా దెబ్బ తిన్నాయి.
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి
Updated Date - 2020-03-11T08:16:27+05:30 IST