విశ్వసనీయ విరాణ్మూర్తి
ABN, First Publish Date - 2020-05-30T06:03:15+05:30
భారతదేశానికి సంపూర్ణ స్వపరిపాలన నినాదం ఇచ్చిన లోకమాన్య బాలగంగాధర తిలక్ బాటలో ప్రధాని మోదీ ముందుకు వెళుతున్నారు. నరేంద్ర మోదీ ఇరవై ఒకటవ శతాబ్దపు మూడవ దశకంలో ....
భారతదేశానికి సంపూర్ణ స్వపరిపాలన నినాదం ఇచ్చిన లోకమాన్య బాలగంగాధర తిలక్ బాటలో ప్రధాని మోదీ ముందుకు వెళుతున్నారు. నరేంద్ర మోదీ ఇరవై ఒకటవ శతాబ్దపు మూడవ దశకంలో మాతృదేశానికి సేవ చేస్తున్నప్పుడు ఇరవయ్యో దశాబ్దపు తొలినాళ్ళలో తిలక్ తీసుకున్న స్వరాజ్య సంకల్పాన్ని సంపూర్ణంగా సాధించడంలో పరిపూర్ణంగా సఫలమవుతారనడంలో సందేహం లేదు.
ఏదేశ చరిత్రను గమనించినా, ఒక భారీ మార్పు జరిగిన సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. భారతదేశ రాజకీయ చరిత్రలో 2014 అలాంటి భారీ మార్పు జరిగిన సంవత్సరం. ఆ సమయంలో దేశ ప్రజలంతా అసమర్థ, అవినీతి పాలన నుంచి బయట పడాలని బలంగా కోరుకున్నారు. మార్పు కోసం ప్రజలంతా నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి ఒక ఆదేశాన్ని ఇచ్చారు. అనంతరం రెండవ సారి కూడా తిరిగి ఓటు వేసి అధిక మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టడమూ చాలా అరుదైన విషయమే. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత, మోదీజీ భారతదేశ చరిత్రలో అలాంటి రెండవ నాయకుడు అయ్యారు. ప్రజల ఆదేశంతో వరుసగా రెండు మార్లు భారతదేశానికి ప్రధాని అయ్యారు. అది కూడా గతంలో అధికారంలోకి వచ్చిన ఓట్ల కంటే అధిక ఓట్లతో, అంతకు మించిన ప్రజా విశ్వాసంతో ఈ విజయం సాధించారు. 2014లో ప్రజల ఆదేశం మార్పు కోసం కాగా, 2019లో ఆదేశం మార్పు ప్రక్రియపై నిండిన విశ్వాసంతో సాగింది. ప్రజలు ఒకరి మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆ నమ్మకాన్ని కొనసాగించడం రాజకీయ నాయకుడికి పెద్ద సవాలు. అందుకే రాజకీయాల్లో విశ్వసనీయత అనేది అతిపెద్ద సవాలుగా నిలిచిపోయింది. ప్రస్తుతం అది కొంత సంక్షోభంగా మారింది కూడా. కానీ 2019లో నరేంద్ర మోదీ నాయకత్వంలో మన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడినప్పుడు, బీజేపీ సైద్ధాంతిక విశ్వసనీయతకు ఆధారమైన అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ధైర్యం , పట్టుదలతో మోదీజీ ఈ నిర్ణయాలను తార్కిక ముగింపు దిశగా తీసుకువెళ్ళారు. జనసంఘ్ కాలం నుంచి నేటి వరకూ భారతీయ జనతాపార్టీ విశ్వసనీయతకు ఇదో పరీక్ష. మోదీజీ ఇప్పటి వరకూ ఆ విశ్వసనీయతను నిలబెట్టేందుకు నూటికి నూరు శాతం కట్టుబడి జీవిస్తున్నారు. ఈ మార్గంలో ఆయన తన సొంత పార్టీ ప్రతిష్టను పెంచగలిగారు. మనం నిజాయితీగా పరిశీలిస్తే, గత ఒక సంవత్సర కాలం, భారత రాజకీయాల్లో విశ్వసనీయత పరంగా ఓ కీలకమైన మైలురాయి.
370వ అధికరణం, ముమ్మారు తలాక్, ఉగ్రవాద నిరోధక చట్టాల్లో మార్పులతో పాటు శ్రీ రామ జన్మభూమి వద్ద ఒక గొప్ప శ్రీరామ ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేయడం వంటి చర్యలు కచ్చితంగా ఈ సంవత్సరాన్ని భారతదేశ సామాజిక, రాజకీయ, రాజ్యాంగ చరిత్రలో ఒక నవశకానికి నాంది పలికిన ఏడాదిగా చరిత్రలో నిలబెట్టాయి. ముస్లిం మహిళలను చాలా కాలం నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్న తలాక్ –ఇ –బిదత్ సమస్య నుంచి విముక్తి సమయం గత ఏడాదిలో మాత్రమే వచ్చింది. నా దృష్టిలో ఇదేమంత ఆషామాషీ విషయం కాదు. మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన ఉన్నతమైన అంశం.
శ్రీరామ జన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, దేశవ్యాప్తంగా శాంతి సామరస్యాన్ని కొనసాగించిన విధానం, గత ఏడాదిలో మోదీ ప్రభుత్వం సాధించిన అత్యంత ముఖ్యమైన విజయంగా నేను కచ్చితంగా భావిస్తున్నాను. అందరూ తమ మతాలను, అభిమతాలను ఆచరించి జీవించాలని చెప్పే శ్రీ రాముడి రామరాజ్యం ఆదర్శాన్ని మన రాజకీయ తాత్త్వికతగా మేము విశ్వసిస్తున్నాము.
‘‘ సబ్ నార్ కరాన్ ప్రాస్ పర్ ప్రీతి
చలాహిన్ స్వధర్మ్ నీరత్ శ్రుతి నీతి ’’
రాజకీయాల్లో ఉన్న విశ్వసనీయతకు సంబంధించిన సంక్షోభాన్ని తగ్గించేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నించినప్పటికీ, ప్రతిపక్ష శిబిరం ఈ అంశంపై తీవ్రమైన విరక్తి కలిగే విధంగా ప్రవర్తించింది. ప్రకటనకు మాత్రమే కాకుండా, పౌరసత్వ సవరణ చట్టంపై ఎప్పటికప్పుడు వివిధ ప్రతిపక్ష పార్టీలు, ప్రభుత్వాలు ఆమోదించిన రాతపూర్వక తీర్మానాలకు సైతం ప్రతిపక్షం విరుద్ధంగా ప్రవర్తించింది. దక్షిణాసియాలో భారతదేశం మాత్రమే లౌకిక దేశం. మనం ఇప్పుడు ప్రపంచ శక్తిగా ఉన్న నేపథ్యంలో ఈ దేశంలో మతపరమైన అణచివేతకు గురైన వారికి సహాయం చేయడం మీదే లౌకిక దేశంగా మన రాజ్యాంగ నిబద్ధత ముడిపడి ఉంది. పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా మతపరంగా అణగారిన మైనారిటీల కోసం మోదీజీ ఏం చేసినా, ఇది భారత లౌకికవాద చరిత్రలో అపూర్వమైన దశ అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. కానీ స్వాభావిక రాజకీయ కారణాల వల్ల, ఈ అంశంపై ముస్లిం సమాజం మనసులో నిరాధారమైన గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం జరిగింది. ఈ అంశంపై నిరసనలు అత్యంత దురదృష్టకరం.
మార్పు దిశగా ఈ కాలం గత ఏడాది నుంచి ప్రారంభమైంది. మొదట, రైతులకు గౌరవ చిహ్నంగా నిధులను అందించడం. మరో వైపు కార్మికులు, చిన్న దుకాణదారులు, ఇతర చిన్న కార్మికులకు మెరుగైన పనిసౌకర్యాలు ఏర్పాటు చేయడం, వారి వయసు పెరిగాక వారికి పెన్షన్ సదుపాయాలను కల్పించడం ద్వారా ఇది మరింత ముందుకు వెళ్తోంది.
రక్షణమంత్రిగా ఈ విషయాన్ని నేను విశ్లేషిస్తే, భారతదేశంలోని అన్ని భద్రతా దళాలలో మెరుగైన కార్యనిర్వహణ సమన్వయం కోసం, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం చాలా కాలం నుంచి పరిశీలనలో ఉంది. ప్రపంచంలోని చాలా పెద్ద, శక్తిమంతమైన దేశాల్లో ఈ ఏర్పాటు ఉంది. ఆగస్టు 15న, ఎర్రకోట ప్రాకారాల నుంచి, ప్రధాని మోదీ ఈ నూతన వ్యవస్థను భారతదేశంలో వాస్తవ రూపం దాల్చేదిశగా ముందుకు తీసుకువెళ్ళారు. ఒకటే ర్యాంక్ – ఒకటే పెన్షన్ సమస్య గత ప్రభుత్వం నుంచి వచ్చిన దరిమిలా పరిష్కారం దిశగా ముందుకు తీసుకువెళ్ళడంతో పాటు డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ సమస్య కూడా పరిష్కరించబడింది. భద్రత విషయంలో భారతదేశాన్ని స్వావలంబన దిశగా ముందుకు తీసుకువెళ్ళడానికి, భారతదేశంలో ఆయుధాల ఉత్పత్తి, ప్రైవేట్ రంగాల సహాయంతో తుపాకులు, రైఫిళ్ళ ఉత్పత్తి, భారతదేశ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాణిజ్య సామర్ధ్యాన్ని పెంచడం, తాజా యుద్ధ విమానం రఫేల్ ఆరంభం అలాగే దేశీయంగా తయారైన యుద్ధవిమానం తేజస్ లాంటివి అపూర్వమైన దశలు. అదృష్టవశాత్తూ, ఈ రెండు విమానాల్లో ప్రయాణించేందుకు నాకు అవకాశం లభించింది. గత ఏడాదిలో మనం సాధించిన ఈ విజయాల గురించి మనం గర్వపడవచ్చు.
ఇవాళ, కరోనా మహమ్మారి రూపంలో ప్రపంచం మొత్తం మానవ జాతి చరిత్రలో ఎప్పుడూ కనివిని ఎరుగని అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంలో అప్రమత్తత, సామర్థ్యం రెండింటినీ సరైన సమయంలో తీసుకున్న జాగ్రత్తలతో కూడిన లాక్ డౌన్ నిర్ణయం ద్వారా చూపించారు. ప్రస్తుతం పేద కార్మికులు, రైతులు చాలా కఠినమైన సవాలును ఎదుర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం వారి పట్ల వ్యవహరించిన సున్నితమైన తీరు నిజంగా ప్రశంసనీయం. ఈ క్లిష్టకాలంలో, ప్రధానమంత్రి తన సమర్థమైన పరిపాలన ద్వారా నిధులను నేరుగా కోటి మంది పేదల ఖాతాలకు బదిలీ చేయడం, సమాజంలోని అన్ని వర్గాల కోసం ఉచిత రేషన్ ను అందించడం వంటి చర్యల ద్వారా భవిష్యత్ కు ఒక ఉదాహరణగా నిలిచారు.
తీవ్రమైన సవాళ్ళను అవకాశాలుగా మలచవచ్చు అనే అంశాన్ని నిరూపిస్తూ ఈ సామర్థ్యాన్ని మోదీజీ తన పదవీకాలంలో ప్రదర్శించారు. రైతులు తమ పంటలను ఎక్కడైనా విక్రయించే హక్కు, కార్మికులకు ఒకే దేశం – ఒకటే రేషన్ కార్డు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వచనాన్ని మార్చడం లేదా భారతదేశాన్ని పెద్ద మరమ్మత్తు నిర్వహణ రూపంలో అభివృద్ధి చేయడం, పెద్ద ఎత్తున విమానాల సమగ్ర కేంద్రంగా మార్చడం వంటివి గత ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు. వీటి ప్రభావం రాబోయే దశాబ్దకాలంలో కనిపించి తీరుతుంది.భారతదేశానికి సంపూర్ణ స్వపరిపాలన నినాదం ఇచ్చిన లోకమాన్య బాలగంగాధర తిలక్ శత వర్థంతి సంవత్సరమిది. మోదీజీ ఇదే బాటలో ముందుకు వెళుతున్నారు. నరేంద్ర మోదీ ఇరవై ఒకటవ శతాబ్దపు మూడవ దశకంలో మాతృదేశానికి సేవ చేస్తున్నప్పుడు ఇరవయ్యో దశాబ్దపు తొలినాళ్ళలో తిలక్ జీ తీసుకున్న స్వరాజ్య సంకల్పాన్ని సంపూర్ణంగా సాధించడంలో కచ్చితంగా సఫలమవుతారని మేము విశ్వాసంతో చెప్పగలం.
(భారత రక్షణ మంత్రి)
రాజ్‌నాథ్ సింగ్
Updated Date - 2020-05-30T06:03:15+05:30 IST