ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంకలో తెలుగోడి పాగా

ABN, First Publish Date - 2020-09-20T06:00:08+05:30

శ్రీలంక పేరు వినగానే మనకు ముందుగా తమిళులు గుర్తుకు వస్తారు. అయితే శ్రీలంకలో తొలి రాజ్యం స్థాపించింది మాత్రం తెలుగువాడు. అక్కడి ఆఖరి రాజ్యమూ తెలుగు వారిదే....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీలంక పేరు వినగానే మనకు ముందుగా తమిళులు గుర్తుకు వస్తారు. అయితే శ్రీలంకలో తొలి రాజ్యం స్థాపించింది మాత్రం తెలుగువాడు. అక్కడి ఆఖరి రాజ్యమూ తెలుగు వారిదే. శ్రీలంక మూలవాసుల్లో తెలుగు జాతి వాళ్లున్నారు. ‘వెంకటరంగమ్మ దేవి... ది లాస్ట్ క్వీన్ ఆఫ్ క్యాండీ’ క్వీన్స్ హోటల్ క్యాండీలో ఆ రాణి పెయింటింగ్ చూడగానే ఆశ్చర్యం కలిగింది. ఆమె పేరు మన అమ్మమ్మ, నానమ్మల పేరులా ఉంది. పక్కనే క్యాండీ ఆఖరు రాజు, ఆమె భర్త విక్రమ రాజ సింగ పెయింటింగ్. వీళ్ల వివరాలు ఎక్కడ లభిస్తాయని ఆ హోటల్ మేనేజర్‌ను అడిగాను. క్యాండీ ఆలయంలో లైబ్రరీ ఉందనీ, ఆలయం వెనకే కోటలూ ఉన్నాయని చెప్పాడాయన.


నేను శ్రీలంక వెళ్లిందే శ్రీదలిదమాలిగవ ఆలయాన్ని సందర్శించడానికి. ఆ ఆలయంతో తెలుగు నేలకి ప్రత్యక్ష సంబంధం ఉంది. రాణి వెంకటరంగమ్మ ఫోటో చూశాక ఇంకా ఎన్నో ఆనవాళ్లు ఉన్నాయని అన్పించింది. మన తిరుపతిలా శ్రీలంకలో అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యధిక రాబడి కలిగిన ఆలయం శ్రీదలిదమాలిగవ. దీనికి కారణం ఆ ఆలయంలో బుద్ధుడి దంతం భద్రపరచి ఉండడమే. ఆ ఆలయం గోడల మీద ఉన్న రాకుమారి హేమమాలి, ఆమె భర్త దంతకుమారుడి నిలువెత్తు పెయింటింగ్ ఆకట్టుకుంటుంది; హేమమాలి– కళింగరాజు గుహసివ కుమార్తె. బుద్ధుడి నిర్యాణం తరవాత ఆయన ఎడమ కోర దంతాన్ని ఖీమథెరా అనే భిక్షువు సేకరించి, దాన్ని కళింగరాజు బ్రహ్మదత్తుడికి బహుమతిగా అందజేశాడు. బుద్ధుడి దంతానికి గౌరవంగా ఆ రాజు స్థూపాన్ని నిర్మించాడని అదే క్రమంగా దంతపురిగా మారిందని చారిత్రక కథనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ దంతం కోసం రాజుల మధ్య నిరంతరం యుద్ధాలు జరిగేవి. అది ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉండడమే కాదు, ఆ రాజుకు ఆధిపత్యం కూడ ఉండేది. దంతాన్ని రక్షించేందుకు గుహసివుడు ఓ పథకం యోచించాడు. కూతురు, అల్లుడికి దానిని అప్పగించాడు. హేమమాలి తండ్రి ఆదేశం మేరకు దంతాన్ని తన కొప్పులో దాచుకుని, భర్తతో పాటు అతి సామాన్యుల్లా వేషం వేసుకుని శత్రువుల బారిన పడకుండా నౌకలో శ్రీలంకకు చేరుకుంది. క్రీస్తుశకం మూడో శతాబ్దిలో ఇదంతా జరిగింది. పాళిగ్రంథం దలద వంశం ఈ కథనంతా వివరంగా తెలియజేస్తోంది. దంతపురం ఎక్కడ అనేదానిపై అనేక పరిశోధనలు జరిగాయి. మన పురాతత్వవేత్తలు నేటి శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస సమీపంలోని దంతపురమే అదని రూఢి పరిచారు. శిథిలావస్థలో ఉన్న దంతవ్రతుని కోట గోడలను ఈనాటికీ అక్కడ చూడవచ్చు. 


రాణి వెంకటరంగమ్మ వివరాల కోసం ‘హిస్టరీ ఆఫ్ క్యాండీ’ అనే పుస్తకాన్ని ఆలయ లైబ్రరీ నుంచి తీసుకున్నా. ఆ చరిత్ర తెలిస్తే ప్రతి తెలుగువాడి గుండె పరవశించిపోతుంది. క్యాండీని పరిపాలించిన ఆఖరు ప్రభువుల్ని ‘వడగర్లు’ అని పిలిచేవారట. అంటే ఉత్తరం నుంచి వచ్చిన వాళ్లని అర్థం. వారు మధురై నాయక రాజవంశీయులు. వారి మాతృభాష తెలుగు. దాదాపు 200 ఏళ్ల పాటు వీరు క్యాండీని పరిపాలించారు. అప్పట్లో కండికోట అనేవారట. దీనికి కడప దగ్గరున్న గండికోట పేరుతో దగ్గర సంబంధం కన్పిస్తోంది. వెంకటరంగమ్మకి సావిత్రమ్మ అని మరో పేరూ ఉందట. అలాగే సింహాసనం అధిష్టించక ముందు విక్రమ రాజసింగ పేరు కన్నస్వామి నాయక. క్యాండీని పరిపాలించిన సింహళ రాజులు తంజావూరు, మధురై రాకుమార్తెలను వివాహం చేసుకునే ఆచారాన్ని పాటించేవారట. 


సింహళ రాజు నరేంద్ర సింగ పిల్లలు లేకుండానే మరణించాడు. దాంతో ఆ రాజు పట్టపు రాణి తమ్ముడు విజయ రాజ సింగ, చక్రవర్తిగా రాజ్యాన్ని చేపట్టాడు. అలా క్యాండీ 1739లో మధురై నాయక రాజుల పరిపాలనలోకి వచ్చింది. విజయరాజ సింగ తరవాత అధికారంలోకి వచ్చిన కీర్తిశ్రీ రాజసింగ క్యాండీలోని కోటని, దలదమాలిగవ గర్భగుడిని నిర్మించాడు. తన 35 ఏళ్ల పాలనలో కీర్తిశ్రీ డచ్ కోటల మీద దండయాత్ర చేసి క్యాండీ రాజ్యాన్ని ఎంతో పటిష్టం చేశాడు. గుర్రపుస్వారీ చేస్తూ కింద పడి కీర్తిశ్రీ 1782లో మరణించాడు. ఆ తరవాత కూడా మరో ఇద్దరు నాయక వంశస్థులు క్యాండీని పరిపాలించారు. 1815లో ఈ కోటను ‘క్యాండీ కన్వెన్షన్’ ప్రకారం బ్రిటిషర్లు స్వాధీనం చేసుకున్నారు. 


రాజు విక్రమరాజ సింగను, రాణి వెంకటరంగమ్మను కొంతకాలం కొలంబోలో బందీలుగా ఉంచి, ఆ తరవాత నేటి తమిళనాడులోని రాయ్‌వెల్లూర్‌కు తరలించారు. మార్గమధ్యంలోనే రాణి ప్రాణాలు కోల్పోయింది. రాజు రాయ్ వెల్లూర్ కోటలో బందీగా ఉంటూ అక్కడే ప్రాణాలు విడిచాడు. వారి సమాధులు నేటికీ అక్కడ ఉన్నాయి. క్యాండీలో నేటికీ తెలుగు జాతి ఘన చరిత్ర పదిలంగా ఉంది. ఆ విషయం మన దాకా చేరకపోవడమే శోచనీయం. 


శ్రీలంకలో తొలి రాజ్యాన్ని స్థాపించిన వాడు విజయుడు. క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందినవాడు. అతడు నిర్మించిందే అనురాధపుర. శ్రీలంక ప్రాచీన రాజధాని నగరం అది. ఆ విజయుడు కళింగానికి అంటే నేటి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సింగపురం వాడని మన పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ ఊరు పేరు మీదే సింహళ జాతి పేరు కూడా ఏర్పడిందని అంటారు. ఇప్పుడు ఆ దేశంలో కళింగ అనగానే ఒరిస్సా అంటారు కానీ, ఒకప్పుడు కళింగ అంటే మూడు భాగాలు.. ఉత్తర కళింగము, మధ్య కళింగము, కళింగము. ఉత్తర కళింగమే నేటి ఒరిస్సా. గంజాం నుంచి గోదావరి వరకూ ఉన్న ప్రాంతమంతా మిగతా రెండు భాగాలు. 


తొలి, మలి రాజ్యాల్లోనే కాదు శ్రీలంకలోని మూలవాసుల్లోనూ తెలుగు వాళ్లుండడం విశేషం. అనురాధపురా, సీ గిరి యా (సీ గిరి.. శ్రీ పర్వతం మన నాగార్జునకొండ), డంబుల్లా (తెలుగు బండ తిరగబడింది) లాంటి టూరిస్ట్ ప్రదేశాలలో పాముల్ని, కోతుల్ని ఆడిస్తూ కొందరు కన్పిస్తారు. ఆడవాళ్లు చేయి చూసి జోస్యం చెబుతుంటారు. వీళ్లందరి మాతృభాష తెలుగే. పదివేల మంది దాకా వీరి జనాభా ఉంది. వీళ్లు ‘తెలుంగు జాతి’, ‘మన జాతి’ అని చెప్పుకుంటారు. దీవరగమ్మ, కుడాగమా, పుత్తళం, చీమలగస్స తదితర ప్రాంతాల్లో వీరి గ్రామాలు కన్పిస్తాయి. కన్పించిన ప్రతి చోటా వీళ్ల దగ్గరికి వెళ్లి ‘మీరు తెలుగా’ అంటే వెంటనే ‘అవు అక్కా’ అని బంధుత్వాన్ని కలుపుకున్నారు. లచ్చిమి, వెంకటక్క, సరోజ, మసక్క, మసన్న, సుబ్బడు, ఎర్రన్న, సోము.. ఇలా ఉన్నాయి వాళ్ల పేర్లు. పాములోళ్లు ‘తేబల’, ‘దుగుడీ’ తెగల వాళ్లు. ఉపతెగలూ లేకపోలేదు. కోతులోళ్లలో ‘పసుపులేటి’, ‘పాయసం’ లాంటి ఇంటి పేర్లు ఉన్నాయి. ఈ ఇంటి పేరున్న వాళ్లు ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లో కన్పిస్తారు. కానీ పాములోళ్ల ఇంటి పేర్లున్న వాళ్లు భారత నేలల్లో కన్పించడం లేదు. అలాగే వాళ్ల భాషలో మన మూడు మాండలిక పదాలు కన్పించడం విశేషం. అంటే వాళ్లు అక్కడి మూల జాతుల వాళ్లని చెప్పొచ్చని ఆంత్రోపాలజిస్టులు తీర్మానించారు. పంతొమ్మిది వందల అరవైల నుంచే వీళ్లు గ్రామాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుంటున్నారు. వీళ్ల కోసం ప్రత్యేక స్మశానాలు లేకపోవడంతో బౌద్ధానికో, క్రిస్టియానిటీకో మారుతున్నారు. మరణానికి భయపడి మతం మారడం ఎంతో శోచనీయం.


బ్రిటీష్ వారి హయాంలో తేయాకు తోటల్లో కూలిపనుల కోసం వెళ్లిన తెలుగువాళ్లూ శ్రీలంకలో ఎక్కువే. నేడు వీరి జనాభా ఎనిమిదిన్నర లక్షల వరకు ఉంటుంది. ‘మమ్మల్ని కలుపుకుని 18 లక్షల మందిమి శ్రీలంకలో ఉన్నామని తమిళులు చెబుతుంటారు. అలా మా భాషకు గుర్తింపు లేకుండా పోయింద’ని కొలంబోలో ఉన్న తెలుగు జాతీయులు వాపోయారు. ఇక్కడ ‘తెలుంగు నగర్’, ‘అల్లంపల్లి’ లాంటి తెలుగు ఊర్లు కన్పిస్తాయి. కొలంబోలో ఒకప్పుడు తెలుగు మాతృభాషగా గల వడ్డర్లు మూడులక్షల మంది ఉండేవారట. అంతా చెల్లాచెదరైపోయారు. ‘అఖిల శ్రీలంక తెలుగు కాంగ్రెస్’ పేరున ఓ రాజకీయపార్టీ కూడా ఉంది. వీళ్లు కోరుతున్నది ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలంబోలో తెలుగు వారి కోసం ఓ ఆడిటోరియం కట్టించి తెలుగు అభివృద్ధికి తోడ్పడాలని. ఇటీవల టూరిస్టులుగా ఆ దేశం వెళ్లిన తెలుగువాళ్లని పలుకరించడానికి పాములోళ్లు వెళితే, వీరిని చూసి అడుక్కునేవాళ్లుగా భావించి ఈసడించుకున్నారట. ‘మేమూ మీ తోబుట్టువులమే అని భావించండి. మా వేషభాషలని చూసి దూరం చేసుకోకండి’ అని వాళ్లు కోరుతున్నారు.


నేడు రాజకీయంగా గిరి గీసుకున్న రెండు రాష్ట్రాలలోనే కాదు. అనాదిగా వింధ్య దిగువన నుంచి శ్రీలంక వరకూ అనేక ప్రాంతాల్లో మన తెలుగువాళ్లు ఉన్నారు. వాళ్ల తెలుగు మనలా ఉండకపోవచ్చు. రాకపోకలు లేని కారణంగా వాళ్ల భాష 16వ శతాబ్ది దగ్గరో, 18వ శతాబ్ది దగ్గరో ఆగిపోయి ఉండవచ్చు. కులవృత్తుల్లో ఉండడం వల్ల మనలా నాగరికులు కాకపోవచ్చు. ఆ మాత్రాన వాళ్లు మన అన్నదమ్ములు కాకపోరు. దేశమేదైనా, రాష్ట్రమేదైనా, ప్రాంతమేదైనా, వృత్తులేవైనా తెలుగు మాతృభాషగా ఉన్నవాళ్లందరం ఒక్కటే అన్నది గుర్తుంచుకుందాం.



డి.పి.అనురాధ

Updated Date - 2020-09-20T06:00:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising