వెన్నెముక గట్టిపడాలంటే...
ABN, First Publish Date - 2020-04-29T16:23:12+05:30
ఈ లాక్‌డౌన్ వేళ ఇంటికే పరిమితమైపోవడంతో శారీక శ్రమన్నదే లేకపోవచ్చు. కానీ శరీరం దృఢంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం... దేన్నయినా తట్టుకోగలం.
ఆంధ్రజ్యోతి(29-04-2020):
ఈ లాక్‌డౌన్ వేళ ఇంటికే పరిమితమైపోవడంతో శారీక శ్రమన్నదే లేకపోవచ్చు. కానీ శరీరం దృఢంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం... దేన్నయినా తట్టుకోగలం. అలా బాడీని ఫిట్‌గా ఉంచే వ్యాయామాలే ఇవి. కాస్త కష్టంగా ఉన్నా... ప్రయత్నించండి.
భుజాలు చరస్తూ..: బొక్కబోర్లా పడుకోండి. మునివేళ్లు, అరచేతులు నేలపై ఉంచి, మోకాళ్లను రెండు మూడు అంగుళాల ఎత్తుకు లేపండి. ఈ పొజిషన్‌లో మీ తల నుంచి పాదల వరకు ఒక రేఖ గీసినట్టు ఉండాలి. ఇప్పుడు మిగిలిన శరీరం కదలకుండా... కుడి చేతి వేళ్లతో ఎడమ భుజాన్ని తట్టండి. ఇదే విధంగా ఎడమ చేతి వేళ్లతో కుడి భుజాన్ని తాకండి. ఇలా సాధ్యమైనన్నిసార్లు చేయండి. దీనివల్ల వెన్నెముక, కాళ్లు, నడుము కింది భాగము బలంగా మారతాయి.
ప్లాంక్ పొజిషన్‌లో..: శరీరాన్ని మోచేతులు, మునివేళ్లపై బ్యాలెన్స్ చేయండి. పాదాల నుంచి తల వరకు ఎక్కడా శరీరం వంగకూడదు. కుడి కాలిని నిదానంగా పైకి లేపి కొన్ని సెకండ్లు ఉంచండి. తరువాత ఆ కాలు దించి, ఎడమ కాలిని పైకి లేపండి. సాధ్యమైనన్ని సార్లు ఇలా చేస్తే... వెన్నుపూస దృఢంగా తయారయ్యి, తొడ భాగం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది.
పక్షి వాలినట్టు..: మోకాళ్లు, అరచేతులు నేలపై పెట్టండి. చేతులు, మోకాళ్ల మధ్య భుజాలంత దూరం ఉండాలి. నెమ్మదిగా కుడి చేయి, ఎడమ కాలు చాచి, పైకి లేపి, శరీరాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయండి. అంటే పైకి ఎత్తిన చేయి, కాలు మీ భుజాలకు సమాంతరంగా రావాలి. ఆ పొజిషన్‌లో కొన్ని సెకన్లపాటు ఆగి, ఇదే తరహాలో ఎడమ చేయి, కుడి కాలుతో చేయండి. దీనివల్ల పొట్ట భాగం, లోయర్ బ్యాక్, తొడ కండరాలు బలంగా మారతాయి.
Updated Date - 2020-04-29T16:23:12+05:30 IST