ఒక ప్రసంగం, ఏడు తప్పుడు మాటలు : అమిత్ షాపై టీఎంసీ ఫైర్
ABN, First Publish Date - 2020-12-20T21:03:11+05:30
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై టీఎంసీ ఆదివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోల్‌కతా : కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై టీఎంసీ ఆదివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిడ్నపూర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగాన్ని ఘాటుగా విమర్శించింది. ఒక ప్రసంగంలోనే 7 కల్పితాలు, తప్పులు మాట్లాడారని దుయ్యబట్టింది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ట్విటర్ వేదికగా అమిత్ షాపై మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఫ్యాక్ట్ చెక్ పేరుతో విమర్శిస్తున్న ఒబ్రెయిన్ ఆదివారం కూడా నిజ నిర్థరణ బాధ్యతను నిర్వహించారు.
టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ బీజేపీ నేతలను బయటివారిగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అమిత్ షాను టూరిస్ట్ గ్యాంగ్ మద్దతుదారుగా ఒబ్రెయిన్ అభివర్ణించారు. మమత బెనర్జీ కాంగ్రెస్ నుంచి ఫిరాయించారని అమిత్ షా చేసిన ఆరోపణలను ఒబ్రెయిన్ ఖండించారు. మమత పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని, కొత్త పార్టీని స్థాపించడం కోసం 1998లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తృణమూల్‌ను స్థాపించారన్నారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై సౌత్ 24 పరగణాస్ జిల్లాలో జరిగిన దాడిపై బీజేపీ చేస్తున్న విమర్శలపై కూడా ఒబ్రెయిన్ స్పందించారు. బెంగాల్ ప్రభుత్వం నడ్డాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించిందని, బీజేపీ భారీ కాన్వాయ్‌తో నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు.
రైతులకు ఆర్థిక లబ్ధిని బెంగాల్ ప్రభుత్వం అడ్డుకుందని, ఆయుష్మాన్ భారత్ అమలును నిరోధించిందని అమిత్ షా చేసిన ఆరోపణలపై ఒబ్రెయిన్ స్పందిస్తూ, ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా రెండేళ్ళ ముందే బెంగాల్ ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. తమ పథకం వల్ల 1.4 కోట్ల కుటుంబాలకు సంవత్సరానికి రూ.5 లక్షలు లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పారు. రైతులకు కూడా తమ ప్రభుత్వం కేంద్రం కన్నా ఎక్కువ లబ్ధి చేకూర్చుతోందన్నారు. పీఎం కిసాన్ పథకంలో రైతులకు ఎకరాకు రూ.1,214 లభిస్తుందని, బెంగాల్ ప్రభుత్వ పథకం వల్ల ఎకరాకు రూ.5 వేలు లభిస్తుందని తెలిపారు.
Updated Date - 2020-12-20T21:03:11+05:30 IST