పోలీస్ కస్టడీలో తండ్రీకొడుకుల మరణంపై ఎన్‌హెచ్ఆర్‌సీకి కనిమొళి ఫిర్యాదు
ABN, First Publish Date - 2020-06-27T01:15:28+05:30
తమిళనాడు పోలీసుల కస్టడీలో ఉన్న తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోవడంపై
చెన్నై : తమిళనాడు పోలీసుల కస్టడీలో ఉన్న తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోవడంపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ)ని కోరారు.
జయరాజ్, బెనిక్స్‌లను దర్యాప్తు పేరుతో తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు వస్తున్నాయని కనిమొళి ఎన్‌హెచ్ఆర్‌సీకి రాసిన లేఖలో తెలిపారు. బెనిక్స్ మర్మాంగంలోకి పోలీసులు లాఠీని చొప్పించడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగిందని, జయరాజ్‌ను కూడా పోలీసులు తీవ్రంగా కొట్టి, ఆయన ఛాతీపై ఇష్టానుసారం అనేకసార్లు బూటు కాళ్ళతో తొక్కి హింసించారని ఆరోపణలు వస్తున్నట్లు తెలిపారు.
ఈ సంఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, పోలీసుల సమష్టి వైఫల్యం స్పష్టమవుతోందని ఎన్‌హెచ్ఆర్‌సీకి రాసిన లేఖలో కనిమొళి ఆరోపించారు.
మృతుల కనీస మానవ హక్కులను పోలీసులు గౌరవించలేదని, పట్టించుకోలేదని స్పష్టమవుతోందని తెలిపారు. వీరి కస్టోడియల్ మరణాలకు కారకులైన పోలీసు అధికారులపై దర్యాప్తు జరిపి, కఠినంగా శిక్షించాలని కోరారు.
అంతకుముందు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా తమిళనాడు ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం అనుమతిస్తోందని దుయ్యబట్టారు.
కోవిడ్-19 అష్ట దిగ్బంధనం నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో పి జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌లను పోలీసులు అరెస్టు చేశారు. తూత్తుకుడిలోని సత్తంకుళం పోలీసు స్టేషన్‌లో పోలీసు కస్టడీలో గడిపిన తర్వాత ఈ నెల 23న వీరిద్దరూ కోవిల్‌పత్తి ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.
తండ్రీకొడుకులను పోలీస్ స్టేషన్‌లో పోలీసులు తీవ్రంగా హింసించారని, అందుకే వీరిద్దరూ మరణించారని వీరి బంధువులు ఆరోపిస్తున్నారు.
Updated Date - 2020-06-27T01:15:28+05:30 IST