ఫెమా ఉల్లంఘనతో డీఎంకే ఎంపీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ABN, First Publish Date - 2020-09-12T22:05:59+05:30
డీఎంకే ఎంపీ ఎస్ జగద్రక్షకన్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)
చెన్నై : డీఎంకే ఎంపీ ఎస్ జగద్రక్షకన్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. జగద్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.89.19 కోట్ల విలువైన ఆస్తులను శనివారం జప్తు చేసింది. ఫెమాను ఉల్లంఘిస్తూ సింగపూర్ కంపెనీలో ఫారిన్ సెక్యూరిటీలు పొందినట్లు వీరిపై కేసు నమోదు చేసింది.
జగద్రక్షకన్ ఫెమాను ఉల్లంఘించి ఫారిన్ సెక్యూరిటీలను సంపాదించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం అందడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. 2017 జూన్ 15న సింగపూర్‌లో ఒక్కొక్కటి 1 డాలరు విలువ గల 70 లక్షల షేర్లను జగద్రక్షకన్, 20 లక్షల షేర్లను ఆయన కుమారుడు సందీప్ ఆనంద్ సంపాదించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ షేర్లు సిల్వర్ పార్క్ ఇంటర్నేషనల్ పీటీఈ లిమిటెడ్‌కు చెందినవి.
అనధికారికంగా సంపాదించిన షేర్లను జగద్రక్షకన్ తన కుటుంబ సభ్యులకు బదిలీ చేశారని ఈడీ పేర్కొంది. ఈ విధంగా బదిలీ చేయడం ఫెమాలోని సెక్షన్ 4ను, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ (ట్రాన్స్‌ఫర్ ఆర్ ఇస్యూ ఆఫ్ ఫారిన్ సెక్యూరిటీ) రెగ్యులేషన్స్, 2004లోని 3వ రెగ్యులేషన్‌ను ఉల్లంఘించడమేనని తెలిపింది.
ఈ నేపథ్యంలో జగద్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన తమిళనాడులోని వ్యవసాయ భూములు, ఇళ్ళ స్థలాలు, ఇళ్లు, బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము, షేర్లను ఈడీ జప్తు చేసింది.
Updated Date - 2020-09-12T22:05:59+05:30 IST