అమెరికాలో తొలి టీకా.. ఎవరికి వేశారంటే?
ABN, First Publish Date - 2020-12-16T00:11:28+05:30
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో వేరే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైంది ఇక్కడే. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతను నిర్ణయించడంలో ఈ వైరస్
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో వేరే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైంది ఇక్కడే. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతను నిర్ణయించడంలో ఈ వైరస్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో ఇటీవలే అమెరికా ప్రజలకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. బ్రిటన్‌లో ఆమోదం పొందిన ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌కు అమెరికాలో కూడా గ్రీన్ సిగ్నల్ లభించిందని ప్రకటించిన ఆయన.. సాధ్యమైనంత వేగంగా ఈ వ్యాక్సీన్ పంపిణీ మొదలు పెడతామని ప్రకటించారు.
అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయాన్‌టెక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ వ్యాక్సీన్ తయారు చేశాయి. కానీ ఈ వ్యాక్సిన్ వాడటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటూ పలు దేశాలు ఆరోపణలు చేశాయి. వాటిలో అమెరికా కూడా ఒకటి. కరోనాతో అల్లాడుతున్న అగ్రరాజ్యంలో కొందరు పరిశోధకులు ఫైజర్ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయంటూ వెల్లడించారు. కొందరిలో ముఖ పక్షవాతం కూడా వచ్చిందని ఆరోపించారు. దీంతో ఈ వ్యాక్సిన్‌కు అగ్రరాజ్యం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? లేదా? అనే అనుమానాలు తలెత్తాయి.
ఈ అనుమానాలన్నీ తీరడంతో ఫైజర్ టీకాకు అమెరికా ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. తొలి విడతగా 10కోట్ల వ్యాక్సిన్ డోసులను అమెరికా కొనేసింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టరేషన్ నుంచి వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత మరో 10కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. తొలుత ఈ వ్యాక్సిన్ ఎవరికి వేస్తారు? అనే ప్రశ్నకు కూడా అధికారులు సమాధానం ఇచ్చారు. హెల్త్ వర్కర్లు, వృద్ధులకు తొలి ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించారు. ఫైజర్ వ్యాక్సిన్‌కు తొలిసారి ఆమోదం ఇచ్చిన బ్రిటన్‌లో కూడా హెల్త్ వర్కర్లు, వృద్ధులకే ముందుగా టీకా వేశారు.
ఈ క్రమంలో అమెరికాలో కరోనా తీవ్రంగా వ్యాపించిన న్యూయార్క్ నగరంలో పనిచేసే ఓ నర్సుకు తొలి టీకా వేశారు. ఇక్కడి లాంగ్ ఐలాండ్ జూవిష్ మెడికల్ సెంటర్‌లో పనిచేసే శాండ్రా లిండ్సేకు ఈ తొలి టీకా వేయడాన్ని టీవీ చానెళ్లు లైవ్‌లో ప్రసారం చేశాయి. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో శాండ్రాకు ఈ టీకా వేయడం జరిగింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘తొలి వ్యాక్సిన్ వేసేశాం. కంగ్రాచ్యులేషన్స్ యూఎస్! కంగ్రాచ్యులేషన్స్ వరల్డ్!’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ టీకా తీసుకున్న శాండ్రా మాట్లాడుతూ.. ‘‘మామూలు టీకా తీసుకుంటే ఎలా ఉంటుందో ఇదీ అలాగే ఉంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వ్యాక్సిన్ తీసుకున్నాక నాకు కొంచెం భయం తగ్గింది. చరిత్రలోనే అత్యంత కష్టంగా గడిచిన కాలానికి ఇదే ముగింపు కావాలని కోరుకుంటున్నా. ఈ వ్యాక్సిన్ సేఫ్ అనే భావన ప్రజల్లో కలిగించాలనేదే నా భావన’’ అని పేర్కొంది.
Updated Date - 2020-12-16T00:11:28+05:30 IST