గిరిపుత్రికకు అందలం సిక్కోలు మహిళకు నారీశక్తి పురస్కారం
ABN, First Publish Date - 2020-03-09T08:57:13+05:30
శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరిజన మహిళ పడాల భూదేవి ప్రతిష్ఠాత్మక నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు.
న్యూఢిల్లీ/హిరమండలం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరిజన మహిళ పడాల భూదేవి ప్రతిష్ఠాత్మక నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం న్యూఢిల్లీలోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందించిన 16 మంది మహిళలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పురస్కారాలు ప్రదానం చేశారు. సీతంపేట ప్రాంతానికి చెందిన భూదేవి... గిరిజన మహిళలు, వితంతువులకు పోడు వ్యవసాయంలో మెళకువలు నేర్పించి, సమగ్ర అవగాహన కల్పించారు. తన తండ్రి స్థాపించిన చిన్నయ్య ఆదివాసీ వికాస్ సొసైటీ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నారీశక్తి పురస్కారానికి ఎంపిక చేసింది. భూదేవితో పాటు బిహార్‌కు చెందిన మష్రూమ్ మహిళ బీనాదేవి (43), క్రీడా రంగంలో ఎన్నో విజయాలు సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన చండీగఢ్‌కు చెందిన మన్ కౌర్ (103), కాన్పూర్‌కు చెందిన కళావతి దేవి (58), కశ్మీర్‌కు చెందిన అరిఫా జాన్ (33), జార్ఖండ్ లేడీ టార్జాన్ చామీ ముర్ము(47), లద్దాఖ్‌కు చెందిన నిల్జా వాంగ్మో (40), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రష్మీ ఉర్ధవర్ధేశీ(60), ఉత్తరాఖండ్‌కు చెందిన కవలలు తషీ, నుంగ్షి మాలిక్ (28), శాస్త్రీయ సంగీత విద్వాసురాలు కౌశిక్ చక్రవర్తి (38), భారత వాయుసేన తొలి మహిళా ఫైటర్ ఫైలట్లు మోహన సింగ్ జితర్వాల్(28), అవని చతుర్వేది(26), భావన కాంత్(27), కేరళకు చెందిన భగీరథి అమ్మ(105), కాత్యాయని అమ్మ(98) రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకున్నారు. అవార్డు గ్రహీతలతో ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. గిరిజనాభ్యుదయం కోసం భూదేవి చేపట్టిన, చేపడుతున్న పలు కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె హిందీలో చెబుతున్నప్పుడు ఎంతో ఆసక్తిగా విన్నారు.
Updated Date - 2020-03-09T08:57:13+05:30 IST