కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రానికి చిదంబరం సలహా
ABN, First Publish Date - 2020-12-16T05:10:05+05:30
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి...
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, రైతు సంఘాలతో ఓ ఒప్పందానికి వచ్చిన తర్వాత... దాని ఆధారంగా తాజా బిల్లు తీసుకురావాలని ఆయన కోరారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేపట్టి దాదాపు నెల రోజులు కావస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నలుదిశలా జాతీయ రహదారులను దిగ్బంధించి, విపరీతమైన చలిలో రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో చిదంబరం ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వం కిందికి దిగి వచ్చి రైతులతో తక్షణమే ఓ ఒప్పందానికి రావాలి. ఈ దీనికి సులభమైన మార్గం ఏమంటే... ప్రస్తుత చట్టాలను రద్దు చేసి, రైతులతో ఒప్పందానికి వచ్చి మళ్లీ తాజాగా బిల్లు ప్రవేశపెట్టాలి. రద్దు చేసి మళ్లీ కొత్తగా తీసుకురావడం చట్టాలు చేయడానికి సులువైన పద్ధతి...’’ అని చిదంబరం పేర్కొన్నారు. రైతులు, కేంద్రానిక మధ్య ఏదైనా ఓ ఒప్పందం జరిగితే కేంద్రం పార్లమెంటులో కొత్త బిల్లు ఆమోదించక తప్పదని ఆయన అన్నారు.
Updated Date - 2020-12-16T05:10:05+05:30 IST