మాది చారిత్రక నిర్ణయం, రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి : మోదీ
ABN, First Publish Date - 2020-12-15T22:07:28+05:30
ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం
న్యూఢిల్లీ : ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తీవ్రంగా మండిపడ్డారు. తన ప్రభుత్వం రైతుల కోసం చారిత్రక నిర్ణయం తీసుకుంటే, వారిని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. గుజరాత్‌లోని కచ్‌లో డీశాలినేషన్ ప్లాంట్, మిల్క్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ ప్లాంట్‌లకు శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడారు.
ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చుని, నేడు రైతులను తప్పుదోవపట్టిస్తున్న పార్టీలు తాము అధికారంలో ఉన్నపుడు ఈ వ్యవసాయ సంస్కరణలకు అనుకూలమేనని చెప్పారు. వారి ప్రభుత్వాల హయాంలో వారు నిర్ణయం తీసుకోలేకపోయారన్నారు. నేడు దేశం ఓ చారిత్రాత్మక చర్య తీసుకున్నపుడు, వీళ్లంతా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తాము పండించే పంటలను అమ్ముకునే స్వేచ్ఛ చిన్నకారు రైతులకు ఎందుకు ఉండకూడదని దేశం అడుగుతోందన్నారు. వ్యవసాయ సంస్కరణలు జరగాలనే డిమాండ్ అనేక సంవత్సరాలుగా ఉందన్నారు. చాలా రైతు సంఘాలు కూడా తమ పంటలను తమకు నచ్చిన చోట అమ్ముకునే అవకాశం తమకు ఉండాలని డిమాండ్ చేశాయన్నారు.
నేడు ప్రతిపక్షంలో కూర్చున్నవారు రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సంస్కరణలకు వారు వారి ప్రభుత్వాల హయాంలో మద్దతిచ్చారన్నారు.
Updated Date - 2020-12-15T22:07:28+05:30 IST