ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమీనా బేగమ్‌... హైవేలో అన్నపూర్ణమ్మ

ABN, First Publish Date - 2020-05-24T05:30:00+05:30

ఎన్‌.హెచ్‌- 44... భారతదేశ ప్రాంతీయ, సాంస్కృతిక వైవిధ్యానికీ, భిన్నత్వంలో ఏకత్వానికీ జీవనాడి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ... రెండు తెలుగు రాష్ట్రాలతో సహా పది రాష్ట్రాలను ఇది అనుసంధానిస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్‌.హెచ్‌- 44... భారతదేశ ప్రాంతీయ, సాంస్కృతిక వైవిధ్యానికీ, భిన్నత్వంలో ఏకత్వానికీ జీవనాడి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ... రెండు తెలుగు రాష్ట్రాలతో సహా పది రాష్ట్రాలను ఇది అనుసంధానిస్తోంది. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక, తలదాచుకొనే గూడులేక, సొంత ఊళ్ళకు ప్రయాణం కట్టిన వలస కార్మికుల ప్రవాహం ఈ హైవే మీద తరలిపోతోంది.


తినడానికి గుప్పెడు తిండీ, తాగడానికి గుక్కెడు నీరూ లేని దైన్యంతో అవస్థలు పడుతున్న ఆ అభాగ్యులను చూసి తల్లడిల్లిపోయారు అమీనా బేగమ్‌. 

‘అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడమే అసలైన ఆరాధన’ అనే ఇస్లామ్‌ ధర్మాన్ని అనాలోచితంగానే ఆచరణలో పెట్టారు ఈ అంగన్‌వాడీ టీచర్‌. రంజాన్‌ మాసం మొదలుకావడానికి ముందే, దాదాపు 40 రోజుల నుంచి ఎందరికో కడుపు నింపి, ధైర్యం చెబుతున్నారు. ఈ మహత్తర కార్యం గురించి ఆమె మాటల్లోనే...


‘‘ఎక్కడి నుంచో పొట్ట చేతపట్టుకొని మన ప్రాంతానికి వచ్చినవాళ్ళు ఇప్పుడు పని లేక, పలికే దిక్కు లేక, సామాన్యులం ఊహించనైనా లేని దూరాలకు నడిచి వెళుతుంటే చూసి గుండె తరుక్కుపోయింది.  చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకూ... ఆకలితో వాళ్ళు పడుతున్న శ్రమను చూసి తట్టుకోలేక కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వారి కోసం ఏదైనా చెయ్యాలనిపించింది. నాకు చేతనైన సాయం కాసింత అన్నం పెట్టడమే!


పిల్లలకు చేసిన వంటతోనే...

మాది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌ జిల్లాలోని ముప్కాల్‌ గ్రామం. అది ‘జాతీయ రహదారి-44’ (ఎన్‌.హెచ్‌-44)ను ఆనుకొని ఉంటుంది. నేను 18 ఏళ్ళుగా ఆ గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నాను. నాకు భర్త లేరు. నలుగురు పిల్లలు. 

ఆ రోజు జరిగిన సంఘటన నా కళ్ళ ముందు ఇంకా కదులుతోంది. హైవే మీద నాలుగు కుటుంబాలు చిన్న పిల్లలతో కలిసి, ఎండలో కాళ్ళీడుస్తూ నడుస్తున్నాయి.  మేము వాళ్ళకు బిస్కెట్లు తీసుకొని వెళ్ళి ఇచ్చాం. వాళ్ళ కళ్ళలో కాస్త ఆనందం, ఎంతో బాధ కదిలాయి. రెండు రోజులుగా భోజనం లేదట! వెంటనే ఇంటికి వచ్చాను. మా పిల్లల కోసం వండిన భోజనం సిద్ధంగా ఉంది. అన్నం, చపాతీలు వాళ్ళకు పెట్టాను.  వారి సంగతి అడిగాను. వాళ్ళ వెనకాల ఇంకా ఎందరో వస్తున్నారట! 


అమ్మాయి కుట్టుపని డబ్బులిచ్చింది!

ఇంటికి వచ్చి నా కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ‘‘మనం మూడు పూటలా భోజనం చేస్తున్నాం. ఒక్క పూట మానేసయినా వాళ్ళకు కాస్త తిండి పెడదాం’’ అని చెప్పాను. నా పిల్లలు ఒప్పుకున్నారు. మా అమ్మాయి హీనా కుట్టుపని చేసి దాచుకున్న రూ.20 వేలు తీసి ఇచ్చింది. పౌలీ్ట్ర వ్యాపారం చేస్తున్న మా పెద్దబ్బాయి అజార్‌ రోజుకు రూ.500 ఇస్తున్నాడు. ఉదయం టీ, బిస్కెట్లూ, పది గంటలు దాటాక అన్నం, చపాతీలూ అందిస్తున్నాను. మొదట్లో 50 మంది వరకూ తినేవారు. ఆ సంఖ్య క్రమంగా 500కు చేరింది.


మూడు నెలల జీతం కూడా!

ఉదయం 4 గంటలకే వంట మొదలు పెడుతున్నాను. మా గ్రామస్థులు, ఇతర అంగన్‌వాడీ కార్యకర్తలూ బియ్యం, నిత్యావసర సరుకులూ ఇస్తామని ముందుకు వచ్చారు. దాతలు చాలా మంది సహకరిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి 25 వేల రూపాయలు పంపారు. ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది బియ్యం, కూరగాయలు పంపిస్తున్నారు. నా మూడు నెలల జీతాన్ని కూడా దీని కోసం ఖర్చు చేశాను. 


‘ఆరెంజ్‌’ ఇచ్చిన అయిదు బస్సులు...

మా అన్నదానం గురించి తెలుసుకున్న హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నన్ను అభినందించారు. ‘ఆరెంజ్‌ ట్రావెల్స్‌’ యజమాని సునీల్‌ రెడ్డి ఫోన్‌ చేశారు. మంచిపని చేస్తున్నారని మెచ్చుకున్నారు. ‘‘వలస కార్మికుల కోసం ఓ రెండు బస్సులు ఏర్పాటు చేయండి’’ అని కోరాను. ఆయన అయిదు బస్సులు పంపించారు. అవి హైదరాబాద్‌, ఇందల్వాయి, ముప్కాల్‌ ప్రాంతాల నుంచీ వలస కూలీలను మహారాష్ట్ర సరిహద్దుల వరకూ చేరవేస్తున్నాయి. ఈ బస్సుల్లో వచ్చే వారికికూడా మా దగ్గరే భోజనం పెట్టి పంపుతున్నాం. ఏప్రిల్‌ 10 నుంచి మా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడంలో ఉన్న తృప్తి దేనిలోనూ లేదు. దాతల సాయం అందినా, అందకపోయినా... జాతీయ రహదారిలో వలస కార్మికుల ప్రయాణాలు సాగినంత కాలం ఇది కొనసాగిస్తాను.’’

-వరకంటి శ్రీనివాస్‌, మప్కాల్‌

ఫొటోలు: ఎల్‌. రతన్‌ కుమార్‌


Updated Date - 2020-05-24T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising