ఆయనలో మార్పు వస్తుందా?
ABN, First Publish Date - 2020-07-06T05:30:00+05:30
డాక్టర్! నాకు వివాహమై ఐదేళ్లు. పెళ్లైనప్పటి నుంచి ప్రతీ ఏడాదీ నాకు వరుసగా గర్భస్రావం జరుగుతూ ఉంది. దాంతో విపరీతమైన మానసిక కుంగుబాటుకు లోనయ్యాను...
డాక్టర్! నాకు వివాహమై ఐదేళ్లు. పెళ్లైనప్పటి నుంచి ప్రతీ ఏడాదీ నాకు వరుసగా గర్భస్రావం జరుగుతూ ఉంది. దాంతో విపరీతమైన మానసిక కుంగుబాటుకు లోనయ్యాను. ఇదిలా ఉంటే, మా వారు తను పని చేస్తున్న ఆఫీసులో ఒక ఆవిడతో స్నేహంగా మెలుగుతున్నారు. ఆవిడ భర్త చనిపోయారు. ఆమెకు ఒక పాప. అలాంటి మహిళతో స్నేహం, శారీరక సంబంధానికి దారి తీస్తుందని నా భయం. ఆ స్నేహం మానుకోమని ఎంత చెప్పినా వినడం లేదు. ఆవిడ అన్ని విషయాల్లో తగిన సలహాలు ఇస్తూ, తనకు మంచి స్నేహితురాలిగా మెలుగుతుందని ఆయన చెబుతూ ఉంటారు. ఒకటి రెండు సార్లు ఇంటికి తీసుకువచ్చి నాకు పరిచయం కూడా చేశారు. కానీ వాళ్లిద్దరి స్నేహం నాకు నచ్చడం లేదు. ఆయన మాత్రం తాము ఎలాంటి తప్పూ చేయడం లేదనీ, తప్పు చేయనప్పుడు తమ స్నేహం గురించి ఎవరికీ నిరూపించవలసిన అవసరం లేదనీ మొండిగా వ్యవహరిస్తున్నారు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే మా వారిలో ఇంతటి మార్పు తట్టుకోలేకపోతున్నాను. ఆయనలో మార్పు తీసుకువచ్చేదెలా?
- ఓ సోదరి, రెంటచింతల
సహోద్యోగులతో స్నేహం పరిధులు మించనంతవరకూ క్షేమకరమే! అయితే దంపతుల మధ్య మనస్ఫర్ధలకు దారి తీసి, వాళ్ల మధ్య దూరాన్ని పెంచే స్నేహాలకు పరిధులు విధించక తప్పదు. వాళ్లిద్దరి స్నేహంతో ఇప్పటికే మీలో గూడుకట్టుకున్న డిప్రెషన్ మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు. పెళ్లైనప్పటి నుంచీ వరుసగా గర్భస్రావాలు జరగడం మూలంగా తల్లినయ్యే భాగ్యం లేదేమోననే వేదన మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తోంది. దానికి మీ వారి వ్యవహారశైలి తోడవుతోంది. అయితే మీ విషయంలో రెండు అంశాలను పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది. వరుసగా గర్భస్రావాలు జరగడానికి ఆరోగ్యపరమైన కారణాలను మొదట అన్వేషించండి. వైద్యులను కలిసి చికిత్స మొదలుపెట్టండి. అలాగే మీ వారి ప్రవర్తనతో మీరెంత మానసికంగా కుంగిపోతున్నారో వివరించండి. మీ డిప్రెషన్ తగ్గాలంటే ఆయనలో మార్పు రావాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పండి. కనీసం కొంతకాలం పాటైనా వారి స్నేహానికి విరామం ఇవ్వక తప్పదు. అయితే మీరు భయపడుతున్నట్టు మీ వారు, పరిధులు దాటి ఆమెతో శారీరక సంబంధం ఏర్పరుచుకునే వ్యక్తిత్వం కలిగినవారేనా? అనే విషయం కూడా ఆలోచించాలి. అలాంటి వ్యక్తి కానప్పుడు మీరు భయపడడంలో అర్థం లేదు. విషయాన్ని భూతద్దంలో నుంచి చూసి అనవసరపు భయాలకు లోనవుతున్నారేమో ఆలోచించండి. ఏది ఏమైనప్పటికీ మీ దాంపత్య జీవితం తిరిగి గాడిలో పడాలంటే, మనస్పర్థలు పక్కనపెట్టి, కలిసి కూర్చుని మీ మధ్య దూరానికి కారణం అవుతున్న అంశాల గురించి చర్చించి, నిర్ణయం తీసుకోండి.
- డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, క్లినికల్ సైకియాట్రిస్ట్, హైదరాబాద్
Updated Date - 2020-07-06T05:30:00+05:30 IST