ఇంటి పనుల్లో బందీనైపోయాను!
ABN, First Publish Date - 2020-05-28T05:30:00+05:30
రెండు నెలలుగా నేను పడుతున్న బాధను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నేనూ, నా భర్త, ఇద్దరు పిల్లలు, అత్తమామలు... మొత్తం ఆరుగురం. మా అబ్బాయి హాస్టల్‌లో
రెండు నెలలుగా నేను పడుతున్న బాధను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నేనూ, నా భర్త, ఇద్దరు పిల్లలు, అత్తమామలు... మొత్తం ఆరుగురం. మా అబ్బాయి హాస్టల్‌లో ఉండేవాడు. అత్తమామలు దగ్గర్లోనే విడిగా ఉండేవారు. మా వారిది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. అమ్మాయి పదోతరగతి. అందరూ బిజీనే. పొద్దున్న తొమ్మిదికల్లా పని పూర్తిచేసి కాసేపు రిలాక్స్ అయ్యేదాన్ని. మా అత్తమామల ఇంటికి వెళ్లి, కాసేపు ఉండి, వారికి కావలసిన పనులు చేసేదాన్ని. మరి ఇప్పుడో? లాక్ డౌన్ మొదలయ్యాక అందరం ఒక్కచోటే! మా అత్తమామలను కూడా మా ఇంటికే తీసుకువచ్చారు మావారు. ‘పోనీలే!’ అనుకున్నా. ఓ పక్క పనివారి సహాయం లేదు. పిల్లలేమో ఆన్‌లైన్ చదువులతో, శ్రీవారు ఆఫీస్ పనితో బిజీ.
అందరికీ వేర్వేరు రుచులు కావాలి. ఎక్కడా తేడా రాకూడదు. పెద్దవాళ్ళు ఏ సహాయం చెయ్యలేరు. వారికి ఆహార నియమాల ప్రకారం చేసి పెట్టాలి. ఓ పక్క ఇంటిపనులు, మరోవైపు వంట పనులతో శారీరకంగా, మానసికంగా బలహీనపడ్డాను. దాంతో కోపం పెరిగిపోతోంది. నాకు కోపం వచ్చినప్పుడు ఇంటి పనుల్లో కొద్దిగా సహాయం చేస్తారు. మళ్ళీ మాములే! వాళ్ళకు పని లేకపోతే టీవీ, సినిమాలు చూస్తూ రిలాక్స్ అవుతారు. నాకు ఏదీ లేదు. పారిపోవాలనిపిస్తోంది. బందీనై పోయాననిపిస్తోంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి?
శాంతి
కరోనా వ్యాధి, తదనంతర లాక్‌డౌన్ పరిణామాలతో ఎన్నో కుటుంబాల్లో విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గృహహింస 40 శాతం వరకు పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పేదా, గొప్పా తేడాలేదు. చదువున్నా లేకపోయినా ఒకటే. వీటన్నిటికీ కారణం తరతరాలుగా నూరిపోసిన వివక్ష. ఇంటిపని గృహిణిది మాత్రమేననే ధోరణి. ఇటువంటి ఉత్పాతాలు మన సమాజ ధోరణిని ప్రశ్నిస్తాయి. మారాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాయి.
ఈ విషయంలో జపాన్ అందరికీ ఆదర్శం కావాలి. అక్కడ స్కూళ్లలో చదువుతో పాటు జీవితానికి అవసరమైన పనులు చేసుకోవడం కూడా నేర్పిస్తారు (వంటతో సహా). మన దగ్గర రుబ్బుడు చదువులే తప్ప ఇటు పుల్ల తీసి అటు పెట్టడం తెలీదు. ఇంట్లో కూడా అదో పెద్ద విషయంగా భావించరు. పిల్లలు కూడా ఇంట్లో పని చెబితే చెయ్యరు. అదే స్కూల్‌లో టీచర్ చెబితే వెంటనే చేస్తారు. ఉద్యోగం చేసే మహిళల పరిస్థితి ఇంకా దారుణం. ఇంట్లో ఆఫీస్ పని, ఇంటి పని కూడా చేయాలి. అందరికీ కాకపోయినా ఎక్కువ మందికి ఇవే సమస్యలు. అలాగనీ మీరు నిరుత్సాహపడకండి. అడిగినప్పుడైనా సహాయం చేస్తున్నారంటే సహాయపడే గుణం ఉందన్నమాట. ముందుగా మీరు ఒక కుటుంబ సమావేశం పెట్టండి. మీ కష్టం వివరించండి.
ఎవరెవరు ఏం సహాయం చేయగలరో అడగండి. వారి వారి ఆసక్తిని బట్టి పనులు కేటాయించండి. చాలా కుటుంబాల్లో ఇప్పుడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ తగ్గిపోయాయి. వీలయితే అలా ప్లాన్ చెయ్యండి. కూర్చుని చేయదగ్గ పనుల్లో మీ అత్తమామల్ని భాగస్వాముల్ని చెయ్యండి. మీ అంత బాగా చెయ్యకపోయినా మెచ్చుకోండి. మీకంటూ కచ్చితంగా కొంత సమయం కేటాయించుకోండి. మౌనంగా పని చేసుకుంటూ పోతే ఇంట్లో వారు గమనించరు. మీ ఆరోగ్యమూ పాడవుతుంది. అలాగనీ అనవసరంగా గొడవ పడకుండా మంచిమాటలతో పని అలవాటు చెయ్యండి. మొదట్లో కష్టమే కానీ అసాధ్యం కాదు. ఆల్ ది బెస్ట్!
కె.శోభ, ఫ్యామిలీ కౌన్సెలర్, ‘హార్ట్ టు హార్ట్’,
shobhas292@gmail.com
Updated Date - 2020-05-28T05:30:00+05:30 IST