నా జీవితంలో మార్పు సాధ్యమేనా?
ABN, First Publish Date - 2020-02-26T05:30:00+05:30
నా వివాహమై పదిహేనేళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. అయితే ఇన్నేళ్లయినా నాకు అత్తగారి ఆంక్షలు, ఆడపడుచుల అధికారం నుంచి విముక్తి దొరకడం...
నా వివాహమై పదిహేనేళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. అయితే ఇన్నేళ్లయినా నాకు అత్తగారి ఆంక్షలు, ఆడపడుచుల అధికారం నుంచి విముక్తి దొరకడం లేదు. మొదటి నుంచీ నాకు ఎదురించి మాట్లాడటం అలవాటు లేదు. నా భర్తకి వాళ్ల అమ్మ మాట వేదం. నేను కొత్త దుస్తులు కొనుక్కున్నా, స్నేహితుల ఇంటికి వెళ్తానన్నా మా అత్తగారికి నచ్చదు. ఆమెకు అన్నీ అమర్చి పెట్టాలి. నాకు ఒంట్లో బాగాలేకపోయినా పట్టించుకోదు. ఆమె కూతుళ్లిద్దరూ ఆర్థికంగా ఉన్నతంగానే ఉన్నా, వాళ్లకీ పెట్టాలంటుంది. పిల్లల చదువులు, ఇతర ఖర్చులతో ఎంత ఇబ్బంది పడినా పైసా ఇవ్వదు. ఆమెకు ఆస్తిపాస్తులున్నాయి.
మా మామగారి పెన్షన్ వస్తుంది. అయినా మందులకు కూడా మేమే పెట్టాలి. చదువుకున్నా ఉద్యోగం చేసే స్వతంత్రత లేదు నాకు. పోనీ నా భర్త అయినా అర్థం చేసుకుంటాడా అంటే అదీ లేదు. ఒక్కనాడూ నా ఇబ్బందులను విన్నదీ లేదు. పిల్లల ముఖం చూసి బతుకుతున్నా, ఒక్కోసారి ఏమిటీ జీవితం అనిపిస్తుంది. పుట్టింటివారికి నా ఇబ్బందులు చెప్పే పరిస్థితి లేదు. నా జీవితంలో మార్పు సాధ్యమేనా?
-సుమ
మీ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. కాలం ఎంత మారినా కొందరు ఆడవాళ్ల జీవితాలు ఇలాగే ఉంటున్నాయి. ఇందుకూ ఆడవాళ్లే కారణం కావడం అత్యంత విషాదం. మీ మామగారు లేకపోవడంతో మీ అత్తగారు కొడుకుని అదుపులో పెట్టుకున్నట్టున్నారు. ఇటువంటి వాళ్లు ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేయడంలో ముందుంటారు. మీవారి మెతకతనాన్ని అలుసుగా తీసుకుని మీపైన పెత్తనం చేస్తున్నారు. అయితే సాధారణంగా ఇటువంటి వారు పెళ్లయి, పిల్లలు పుట్లాక ఎంతో కొంత మారుతారు. కాకపోతే అందుకు మీరు వివాహమైన తొలిరోజుల నుంచే ప్రయత్నించాల్సింది. అత్తగారి స్వభావం... మీ భర్త, ఆడపడుచుల స్వభావం తెలుసుకుని అనుగుణంగా ప్రవర్తించాలి. మొదట్లోనే వారితో స్నేహం కుదిరితే బాగుండేది. ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉంటున్నారు. కుదరకపోయినా గొడవపడక్కర్లేదు. ఎవరి పరిధి ఎంతవరకో స్పష్టం చేస్తే చాలు. ఆర్థికంగా మీకు వెసులుబాటు ఉంటే అది సులభం. ఇప్పటికైనా మీ అర్హతకి తగిన ఉద్యోగం చూసుకోండి. లేదా మీకు నచ్చిన ఏ పనైనా సరే, అప్పుడప్పుడు మీ భర్తకు మీ ఆలోచనలు స్పష్టంగా చెప్పండి. అత్తగారితో మర్యాదగా ఉంటూనే మీకు నచ్చినట్టు ఉండటం తప్పుకాదని చెప్పండి. ప్రతి అత్త కూడా కోడలిలో కూతురిని, అలాగే అత్తగారిలో కోడలు తల్లిని చూసుకుంటే చాలా సమస్యలు తేలిపోతాయి. ఇద్దరూ సిద్ధపడితేనే అది సాధ్యం.
-కె.శోభ ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్
shobhas292@gmail.com
Updated Date - 2020-02-26T05:30:00+05:30 IST