అతన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ABN, First Publish Date - 2020-02-26T05:30:00+05:30
మా ఇంటికి పెళ్లి సంబంధం కోసం వచ్చిన అబ్బాయి ‘మీతో ఒకసారి ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను’ అన్నాడు. అందుకు మా పెద్దలు ‘సరే’నన్నారు. ఓ హోటల్‌కు వెళితే కాసేపు మాట్లాడి చివరిగా ‘మా ఊరిలో కొంతమంది...
మా ఇంటికి పెళ్లి సంబంధం కోసం వచ్చిన అబ్బాయి ‘మీతో ఒకసారి ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను’ అన్నాడు. అందుకు మా పెద్దలు ‘సరే’నన్నారు. ఓ హోటల్‌కు వెళితే కాసేపు మాట్లాడి చివరిగా ‘మా ఊరిలో కొంతమంది నాకు ఒక అమ్మాయితో ఎఫైర్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేశారు. అది ఏదో ఒక రోజున మీ చెవిన పడకుండా పోదు. ఒకవేళ మీరు కూడా నమ్మితే మీ ఇష్టం. దానికి నేనేమీ చేయలేను. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని నా మనస్సాక్షిగా చెబుతున్నా. సారీ ఫర్ ద ట్రబుల్’ అన్నాడు. అతడు చెప్పినది విన్న తర్వాత ‘దానిదేముందండీ. చాలామంది విషయాల్లో అలాంటి దుష్ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అన్నాను. అతడు సంతోషం వ్యక్తం చేశాడు.
ఆ తర్వాత పది రోజులకు అతను నాకు ఫోన్ చేసి ‘ఏమండీ... నా మీద ఒక దుష్ప్రచారం ఉందని ఆ రోజు మీకు చెప్పాను కదా! ఒకవేళ అది దుష్ప్రచారం కాదు... వాస్తవమేనంటే మీరెలా స్పందిస్తారు?’ అన్నాడు. ఆ మాటలు విని ‘రేపు మాట్లాడతానం’టూ దాట వేశాను. ఆ మరుసటి రోజే మళ్లీ నాకు ఫోన్ చేసి ‘చూడండి... ఆరోపణ ఆరోపణే అవుతుంది కానీ, అది నిజమెలా అవుతుంది? అలాంటి సందర్భాలేవైనా ఎదురైనప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందామనే అలా చెప్పాను కానీ మరో ఉద్దేశం లేదు. మీ మనసులోంచి ఆ విషయాన్ని పూర్తిగా తీసేయండి’ అంటూ ఫోన్ పెట్టేశాడు. ఇంతకీ అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పిచ్చెక్కిపోతోంది. ఈ విషయంలో ఏ నిర్ణయానికి రావాలో సలహా ఇవ్వండి.
- కె.సౌమ్య, ఆదిలాబాద్
పరస్పర విరుద్ధమైన నాలుగు విషయాల్ని ఎవరికైనా, వెంట వెంటనే చెప్పినప్పుడు ఏమవుతుంది? వినేవారిలో ఒక అయోమయం మొదలవుతుంది. ఆ అయోమయం కొన్ని రోజులు అలాగే కొనసాగితే, ఆ నాలుగూ వాటి తీవ్రతను కోల్పోతాయి. అది కేవలం ఒక ఆరోపణే అని ఒకసారి... ఆరోపణే నిజమని తేలితే ఏం చేస్తారని ఒకసారి... అదంతా ఉత్తదే, కావాలనే అలా చెప్పానని ఒకసారి... ఇలా పొంతనలేని విషయాలన్నీ వరుసగా మీ పైన గుప్పించడం ద్వారా అతడు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనసు బాగా అలసిపోతుంది. కలగాపులగమైన విషయాలతో అలసిపోయిన మనసు హేతుబద్దంగా ఆలోచించలేక స్తబ్దంగా ఉండిపోతుంది. సమాధానంగా ఏమీ చెప్పలేని పరిస్థితిలో పడిపోతుంది. ఆ స్థితితో ఎటుతోస్తే అటుపడిపోతారు. అతడు కోరుకుంటున్నది కూడా అదే!
మొత్తంగా చూస్తే చాలా తెలివిగా అతడు మిమ్మల్ని తనవైపు అడుగులు వేసేలా చేస్తున్నాడు. ఈ స్థితిలో కొంతకాలం మౌనంగా ఉండిపోండి. తొందరపడి అతడు విసిరే ఉచ్చులో పడితే ఇక అంతే! అతని మాటలను గమనిస్తే, ఒక ఎఫైర్ ఉందనే విషయం స్పష్టం అవుతూనే ఉంది. కాకపోతే, తానుగా దాన్ని బయటపెట్టడానికి సాహసించడం లేదు. ‘వంద అబద్ధాలు చెప్పయినా సరే., ఒక పెళ్లి చేయాల’ని అంటుంటారు. కానీ అబద్ధాలతో కుదిరిన పెళ్లి ఆ అబద్ధాలకే బలైపోతుందని తెలిసినా, వాస్తవాన్ని వారు దాచేశారు. అయినా అబద్ధాలు చెప్పడం వేరు... నిజాల్ని దాచేయడం వేరు. ఇతడు నిజాల్ని దాచే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈరోజు వాటిని దాచిపెట్టినా ఏదో ఒక రోజున అవి బయటపడకుండా ఉండవు కదా! పైగా అతడు ఆ ఎఫైర్‌ను అంతటితో ముగించే ఉద్దేశంతో ఉన్నాడా? పెళ్లి తర్వాత కూడా కొనసాగించాలనుకుంటున్నాడా? అన్నది మరో పెద్ద విషయం. ఒకవేళ దాన్ని కొనసాగించాలనుకుంటే అది మరీ ప్రమాదం. ఇదంతా కాదు గానీ, వివాహ బంధానికి అతడు ఏ రకంగా యోగ్యుడు కాడనేది వాస్తవం. అందువల్ల ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయడం శ్రేయస్కరం.
-డాక్టర్ ప్రవీణ్‌కుమార్ చింతపంటి
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, హైదరాబాద్
Updated Date - 2020-02-26T05:30:00+05:30 IST