ఎవరిని వదులుకోవాలి?
ABN, First Publish Date - 2020-06-11T05:30:00+05:30
నా వయసు ఇరవై నాలుగేళ్ళు. ఇంజనీరింగ్ చదివాను. ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నా. నేను ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నా. అతన్నే పెళ్లి చేసుకోవాలని ఉంది. మా మతాలు వేరు...
నా వయసు ఇరవై నాలుగేళ్ళు. ఇంజనీరింగ్ చదివాను. ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నా. నేను ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నా. అతన్నే పెళ్లి చేసుకోవాలని ఉంది. మా మతాలు వేరు. అతను అన్నివిధాలా మంచివాడు. చక్కగా చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు. ఎలాగైనా ఇంట్లో ఒప్పించి చేసుకోవాలని కోరిక. కానీ అతన్ని చేసుకుంటే చచ్చిపోతామని బెదిరిస్తున్నారు మా అమ్మానాన్నలు. మతం మారిపోతానని వారి భయం. అతనేమో ‘ఎక్కడికన్నా వెళ్లి పెళ్లి చేసుకుందాం’ అంటున్నాడు. తీరా అలా చేసుకున్నాక మా అమ్మా నాన్నలకు ఏమన్నా అయితే నేను సుఖంగా ఉండలేను. నా తల్లిదండ్రులదీ ప్రేమ వివాహమే! ఇంట్లోంచి పారిపోయి చేసుకున్నారు. కానీ నా ప్రేమను ఒప్పుకోవడం లేదు. అలాగని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను. చనిపోవాలని ప్రయత్నించాను. అదీ నెరవేరలేదు. ఏం చేయను?
- రంజిత
ఇంత చదువుకొని, ఉద్యోగం చేస్తున్నా మీలో ఆత్మన్యూనత పోలేదు. కులమతాలకూ, అంతస్థులకూ అతీతమైంది ప్రేమ. అలాగే ఎదుటివ్యక్తిని లోపాలతో సహా అంగీకరించగలగాలి. పెళ్ళి చేసుకోవాలంటే మీరు మతం మారాలంటే అది ప్రేమ కానే కాదు. ఎవరికి నచ్చినట్టుగా వారు ఉంటూ, ఇద్దరూ కలసి కులమతాలకు అతీతమైన ప్రపంచం నిర్మించడం అసలైన ప్రేమ! ఆ భరోసా మీ అమ్మానాన్నలకు ఇవ్వగలిగితే బహుశా వాళ్ళూ మీ పెళ్ళికి ఒప్పుకుంటారు. ఏడేళ్లుగా మీరు ఈ విషయాలు ఆలోచించలేదంటే ఆశ్చర్యంగా ఉంది. మీ భవిష్యత్తుకు ఏది మంచిదో తెలుసుకొనే వయసు మీది. మీరు ప్రేమించే వ్యక్తిని మీ పెద్దవాళ్ళ వద్దకు తీసుకువెళ్లి వారి అభ్యంతరాలు తెలుసుకోండి. ఒప్పుకొంటే సరే! లేకపోతే మీరిద్దరూ ఒక నిర్ణయానికి రావాలి. అయితే ఏదో ఒకటి వదులుకోడానికి సిద్ధపడాలి. ప్రేమ పెళ్లి చేసుకున్న మీ తల్లిదండ్రులు మారతారనే ఆశిద్దాం. వారి బెదిరింపులకు మీ భవిష్యత్తు పణంగా పెట్టకపోవడమే మంచిది.
-కె.శోభ, ఫ్యామిలీ కౌన్సెలర్, ‘హార్ట్ టు హార్ట్’, shobhas292@gmail.com
Updated Date - 2020-06-11T05:30:00+05:30 IST