శ్రీ దత్తాత్రేయ మహా యోగ రహస్యం
ABN, First Publish Date - 2020-12-29T08:32:59+05:30
మార్గశీర్ష పూర్ణిమ శ్రీ దత్త జయంతి అని సాధక లోకమంతా విశ్వసించే విషయం. సప్త ఋషులలో ఒకడు అత్రి మహాముని. ఆయన భార్య అనసూయా దేవి.
మార్గశీర్ష పూర్ణిమ శ్రీ దత్త జయంతి అని సాధక లోకమంతా విశ్వసించే విషయం. సప్త ఋషులలో ఒకడు అత్రి మహాముని. ఆయన భార్య అనసూయా దేవి. వారికి త్రిమూర్తుల అంశలలో పుట్టిన వారిలో రుద్రాంశతో పుట్టినవాడు దుర్వాస మహాముని. బ్రహ్మాంశన పుట్టినవాడు చంద్రుడు. శ్రీ మహావిష్ణువు అంశతో పుట్టిన తనయుడు శ్రీ దత్తుడు. అత్రి కుమారుడు కనుక ఆత్రేయుడు అయ్యాడు. అలా ఈ యోగి వరేణ్యుడు దత్తాత్రేయుడిగా లోక ప్రసిద్ధి పొందాడు. సమస్త వేద, యోగ విద్యలకూ అధినాథుడు శ్రీదత్తుడు. సాక్షాత్తూ సుదర్శన చక్రావతార మూర్తి అయిన కార్తవీర్యార్జునునికి యోగ గురువు ఈయన. దత్తాత్రేయుడు బోధించిన మహా యోగము.. మంత్ర యోగం, లయ యోగం, హఠయోగం, రాజయోగం అనే నాలుగు యోగాల కలయిక. మంత్ర యోగం ద్వారా ఇంద్రియాలపై, మనసుపై, బుద్ధిపై, అహంకారంపై పట్టును సాధించవచ్చు.
లయ యోగం ద్వారా అభీష్ట దేవతను దేహంలోని కాలి బొటన వేలు, ముక్కుకొన, కనుబొమల మధ్య భాగము, తల వెనుక భాగము వంటి ఏదో ఒక సంకేత స్థానంలో ఉంచుకుని ధ్యానం చేసే విధానాన్ని సాధించవచ్చు. హఠ యోగం ద్వారా.. మహాముద్ర, ఖేచరీ ముద్ర, విపరీత కరణి, వజ్రోలి, మహా బంధం, జాలంధర బంధం, ఉడ్డీయాన బంధం, మూలబంధములను సాధించవచ్చు. రాజ యోగం ద్వారా యోగ శాస్త్రంలోని అష్టాంగాలైన యమ, నియమ, ఆసన, ప్రాణాయామాది అంగాల్లో.. ప్రాణాయామమునకు మోక్ష సిద్ధిలో ఎక్కువ ప్రాధాన్యమివ్వడం శ్రీ దత్త మహా యోగంలో గమనించాల్సిన విషయం. శ్రీ దత్త మహాయోగ ప్రాణాయామ ప్రక్రియలో పూర్వాంగములు.. స్థలాన్ని ఎంచుకోవడం, ఆసనస్థితిని అభ్యసించడం, రేచక, కుంభక, పూరక విధులను బాగా అభ్యసించడం, ఇడా, పింగళ, సుషుమ్న మార్గాలను తెలుసుకుని వాటిలో పయనించడం. ఈ ప్రయత్నంలో ఇడా మార్గమున ఒకసారి పూరక, కుంభక రేచకములను.. పింగళ మార్గమున ఒకసారి పూరక, కుంభక రేచకములను ఆచరించడం నేర్చుకోవాలి. దీనికి ఒక పూర్ణ ప్రాణాయామమని పేరు.
ఆ పైన ఆరంభ అవస్థ, ఘటావస్థ, పరిచయ అవస్థ, నిష్పత్తి అవస్థ అను నాలుగు ప్రధానమైన అవస్థల గురించి తెలుసుకోవాలి. ప్రారంభావస్థలో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి వేళల్లో.. 20 చొప్పున మొత్తం 80 పూర్ణ ప్రాణాయమాలు చేయాలి. ఈ ప్రక్రియలో ప్రాణాపానవాయువులను ఊర్థ్వ మార్గంలో ఏకమయ్యేట్లు చేయాలి. ఆపైన.. యోగసాధకుడు ఘటావస్థలో కేవల కుంభకం ద్వారా సాధన చేయగలడు. ఈ స్థితిలో వచ్చే ప్రలోభాలకు లోనుకారాదు. ఓంకారాన్ని ప్లుత స్వరంలో ఉచ్చరిస్తుండాలి. ఆపైన పరిచయావస్థలో మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రస్థానాల సంధులలో క్రమంగా పంచ భూత ధారణ చేయాలి. ఆపై తురీయావస్థ అయిన నిష్పత్తి అవస్థలో ప్రాణవాయువు మూలాధారం నుంచి సుషుమ్న మార్గంలో సహస్రారానికి చేరుకుంటుంది. అక్కడ అమృతోద్భవం జరిగి.. యోగి మృత్యువును సైతం శాసించగలడు. ఈ స్థితిలోనే జీవాత్మను పరమాత్మ యందు లీనం చేసి యోగి కైవల్యాన్ని పొందగలడు. ఈ ప్రక్రియలో 24 మంది గురువులు సాధకునికి సహకరిస్తారట. ఈ విధమైన ఎన్నెన్నో రహస్యాలతో కూడిన శ్రీ దత్త మహా యోగం.. సమస్త లోక మంగళకరం. భారతీయ యోగ విజ్ఞాన పతాకం. ఆధ్యాత్మ జీవన ప్రగతి దీపిక.
- ఆచార్య రాణి సదాశివ మూర్తి (నేడు శ్రీదత్త జయంతి)
Updated Date - 2020-12-29T08:32:59+05:30 IST