ఔరా!..సారా!
ABN, First Publish Date - 2020-02-03T20:02:15+05:30
ముచ్చటగా మూడంటే మూడు సినిమాల్లో నటించిందో లేదో సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో పాపులర్ సెలెబ్‌గా మారిపోయింది. సినిమాల్లోకి రాక ముందు ఆహార, వ్యాయామ నియమాలకు...
ముచ్చటగా మూడంటే మూడు సినిమాల్లో నటించిందో లేదో సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో పాపులర్ సెలెబ్‌గా మారిపోయింది. సినిమాల్లోకి రాక ముందు ఆహార, వ్యాయామ నియమాలకు దూరంగా ఉండిపోయిన సారా నటిగా మారాలనుకున్న తర్వాత పట్టుదలతో తన తీరు మార్చుకుని నాజూకుగా తయారైంది. తన ఫిట్‌నెస్ రహస్యాల గురించి ఇలా చెబుతోందీ ముద్దుగుమ్మ!
మిశ్రమ వ్యాయామాలు!
‘‘రోజూ ఒకే రకమైన వ్యాయామాలు చేయడం వల్ల ఫలితం ఉండదు. అందుకే నేను వ్యాయామాలను కలిపి లేదా మార్చి
అనుసరిస్తూ ఉంటాను. పిలేట్స్ నుంచి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వరకూ బూట్‌క్యాంప్ వర్కవుట్స్, కార్డియో ఇలా వేర్వేరు వ్యాయామాలకు ఫిట్‌నెస్‌లో స్థానం కల్పిస్తూ ఉంటాను. మొదట్లో నేను అవసరానికి మించి బరువు ఉండేదాన్ని కాబట్టి చురుగ్గా వ్యాయామాలు చేయడానికి శరీరం సహకరించేది కాదు. అందుకే ఎక్కువగా వాకింగ్, సైక్లింగ్ చేసి బరువు తగ్గించుకున్నాను. ఆ తర్వాత పిలేట్స్ వ్యాయామం కోసం ‘నమ్రతా పురోహిత్’ అనే ట్రైనర్‌ను నియమించుకున్నాను. ఈ వ్యాయామం కండరాల ఫ్లెక్సిబిలిటీని పెంచింది.
డాన్సింగ్!
నాకు ఒడిస్సీ నృత్యం వచ్చు. ఈ డాన్స్‌తో కూడా శరీరానికి చక్కని వ్యాయామం దక్కుతుంది. ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. నిజం చెప్పాలంటే ఎలాంటి నృత్యమైనా ఎంతోకొంత వ్యాయామాన్ని అందిస్తుంది. నా వరకు నాకు నేనెంతో ఇష్టపడి నేర్చుకున్న ఒడిస్సీ నా అధిక బరువు తగ్గించుకోవడానికి తోడ్పడింది.
ఫంక్షనల్ ట్రైనింగ్!
ఈ వ్యాయామం విపరీతంగా ఫిట్‌నెస్ ఫాలో అయ్యేవారికే అనుకుంటే పొరపాటు. ‘సిండీ జోర్డాన్’ దగ్గర బూట్ క్యాంప్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇది కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడింది. దీనిలో ఫుల్ బాడీ వర్కవుట్లు, స్ర్టెంగ్త్ ట్రైనింగ్ కూడా ఉంటాయి. ఏరోబిక్స్ చేసిన ఫలితం కూడా దక్కుతుంది. కాబట్టి ఈ ట్రైనింగ్ నాకెంతో బాగా వర్కవుట్ అయింది.’’
Updated Date - 2020-02-03T20:02:15+05:30 IST