యాంగ్జైటీ డిజాస్టర్
ABN, First Publish Date - 2020-09-23T05:30:00+05:30
లాక్‌డౌన్ రోజులు గుర్తున్నాయా? నెలలకు నెలలు ఇంట్లోనో కూర్చోవడం వల్ల ఎంతో మానసిక ఆందోళనకు గురయ్యాం. అటు కరోనా కేసులు తగ్గక...
లాక్‌డౌన్ రోజులు గుర్తున్నాయా? నెలలకు నెలలు ఇంట్లోనో కూర్చోవడం వల్ల ఎంతో మానసిక ఆందోళనకు గురయ్యాం. అటు కరోనా కేసులు తగ్గక... ఇటు బడులు, కార్యాలయాలూ నడవక... ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియక... ఒకటేమిటి! ప్రతిదీ సమస్యే.
కొంత కాలానికే ఇంతలా భయాందోళనలకు లోనయ్యామంటే... మరి ఎప్పుడూ మానసిక సమస్యలతో సతమతమయ్యేవారి పరిస్థితి ఏమిటి? అలాంటి ఓ యువకుడి కథే ‘చిల్ మామా’. వినయ్ ‘యాంగ్జైటీ డిజాస్టర్’తో బాధపడుతుంటాడు. దానికితోడు కరోనా కాటు. లాక్‌డౌన్‌ల పరంపర. ఒక్కసారిగా ఇన్ని సమస్యలు చుట్టుముడితే ఇక మనోడు ఏమైపోతాడోనని వినయ్ రూమ్‌మేట్స్ భయపడతారు. దాంతో ప్రస్తుత పరిస్థితుల గురించి అతడికి అసలేమీ తెలియకుండా చూసి, స్నేహితుడిని కాపాడుకోవాలనుకొంటారు. ఈ నేపథ్యంలో రూమ్‌మేట్స్ చేసే రకరకాల ప్రయత్నాలే ఈ చిత్రం.
స్నేహితులుగా వినయ్, సాయి, వంశీ, లింగాల నటన... అన్వేష్ కెమెరా పనితనం ఆకట్టుకుంటాయి. ఎక్కడా బోర్ కొట్టించకుండా దర్శకుడు పీవీ సాయి సన్నివేశాలను చక్కగా తీశాడు. రచన కూడా అతడే. రెండు రోజుల కిందట ‘తమడా మీడియా’ యూట్యూబ్ ఛానల్ దీన్ని విడుదల చేసింది. కాసేపు రొటీన్‌కు భిన్నంగా వెళ్లాలనుకొంటే ఈ షార్ట్ ఫిలిమ్‌పై ఓ లుక్కేయండి.
చిల్ మామా
రచన, దర్శకత్వం:
పీవీ సాయి సోమయాజులు
విడుదల: సెప్టెంబర్ 19
వ్యూస్: 50 వేలు
Updated Date - 2020-09-23T05:30:00+05:30 IST