వైరస్ vs వినోదం..
ABN, First Publish Date - 2020-07-29T05:30:00+05:30
కరోనా విలయంతో ప్రజలకు వినోదం కరువైంది. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకొనే పరిస్థితి కనిపించడం లేదు. అయితే సినీ రూపకల్పనపై ఆసక్తి ఉన్న యువతరానికి ఇదేమీ అడ్డు కావడంలేదు....
కరోనా విలయంతో ప్రజలకు వినోదం కరువైంది. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకొనే పరిస్థితి కనిపించడం లేదు. అయితే సినీ రూపకల్పనపై ఆసక్తి ఉన్న యువతరానికి ఇదేమీ అడ్డు కావడంలేదు. లాక్‌డౌన్ కాలంలో ఎదురవుతున్న ఇబ్బందులూ, పాటించాల్సిన జాగ్రత్తలూ ప్రధానాంశాలుగా లఘు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు... అప్రమత్తం చేస్తున్నారు.
కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే యువత లాక్‌డౌన్ సమయంలో తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. లాక్‌డౌన్ వారి సృజనాత్మకతకు స్ఫూర్తినిస్తోంది. ‘కొవిడ్-19’ నేపథ్యంలో వైవిధ్యభరితమైన చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. వీటిలో కొన్ని లఘుచిత్రాలతో పాటు వెబ్‌సిరీస్‌లు కూడా తయారవుతున్నాయి. విశేషమేమిటంటే, వీరిలో సినీ రంగానికి చెందినవారే కాదు, ఔత్సాహికులు కూడా ఉన్నారు.
లాక్‌డౌన్‌లో లేడీస్ కష్టాలు
ఇదివరకు వీకెండ్ ఎప్పుడు వస్తుందా... సెలవు ఎప్పుడు దొరుకుతుందా అని ఎదరుచూసేవాళ్లు జనం. కానీ కరోనా దెబ్బకు అంతా ఇళ్లలోనే లాకైపోవడంతో ఎప్పుడెప్పుడు ఆఫీసుకెళదామా అని ఆతృతగా ఉన్నారు. మగవాళ్ల పరిస్థితి ఎలా ఉన్నా... ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్లకు మాత్రం కష్టాలు ఎక్కువైపోయాయి. ఎడతెరిపిలేని పనితో పాటు శారీరక, మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇలా లాక్‌డౌన్ వేళ చుట్టుపక్కల స్నేహితురాళ్లందరూ ఒకచోట చేరి తమ బాధలు చెప్పుకొనే ఫన్నీ వీడియోనే ‘లాక్‌డౌన్‌లో లేడీస్ కష్టాలు’. చంద్రగిరి సుబ్బు రూపొందించిన ఈ లఘు చిత్రం నవ్వులు పూయిస్తుంది. రెండు లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. పిల్లలు కావాలన్న కాంక్షతో లేచింది మొదలు తన భర్త తనను ఏ పనీ చేసుకోనివ్వడంలేదని ఓ స్నేహితురాలు బోల్డ్‌గా చెప్పే మాటలు కడుపుబ్బా నవ్విస్తాయి. ‘మా ఆయన ఇంట్లో కూడా పీపీఈ కిట్ వేసుకొని తిరుగుతున్నాడు. ఓ ముద్దు ముచ్చట లేద’ని మరో మహిళ వాపోతుంది. ‘బస్తాలు బస్తాలు నిత్యావసరాలు తెచ్చి మావాడు ఇంటిని గోడౌన్ చేశాడ’ని వాపోతారు ఇంకొకరు. కరోనా కాలంలో ఆడవాళ్లు ఎదుర్కొంటన్న ఇబ్బందులను హాస్యంతో చక్కగా తెరకెక్కించారు చంద్రగిరి సుబ్బు.
వ్యక్తిగత శుభ్రతే శ్రీరామరక్ష
ఓ అబ్బాయీ, అమ్మాయీ స్నేహితులు. అయితే, వారిద్దరికీ మూడేళ్లుగా మాటల్లేవు. ఆ అమ్మాయి కాలేజీ రోజుల నుంచీ శానిటైజర్ వాడుతూ ఉంటుంది. అతను ఆమెను ఆట పట్టిస్తూ ఉండేవాడు. మూడేళ్ల తరువాత అతను ఆమెకు ఫోన్ చేస్తాడు. తమ స్నేహాన్ని గుర్తు చేస్తాడు. ఆమె శుభ్రత పాటించడం గురించి ప్రస్తావిస్తూ, తను అలా చేయకపోవడం వల్లనే కరోనా సోకిందని చెబుతాడు. ఇదీ నాలుగు నిమిషాల ‘శానిటైజర్’ షార్ట్ ఫిలిమ్ కథ. కన్నడ నటుడు రామ్ మంజునాథ్ దీనికి దర్శకత్వం వహించారు. ‘‘లాక్‌డౌన్ ప్రారంభమయ్యాక ఒక రోజు శానిటైజర్ కొనేందుకు మందుల దుకాణానికి వెళ్లాను. అక్కడ విన్న ఓ సంభాషణ ఈ లఘు చిత్రానికి స్ఫూర్తినిచ్చింది. ఈ కరోనా కాలంలో వ్యక్తిగత శుభ్రత పాటించడం, శానిటైజర్లు వినియోగించడం ఎంత ముఖ్యమో ఈ చిత్రం ద్వారా ప్రజలకు చెప్పాలన్నదే నా ఉద్దేశం’ అంటారు మంజునాథ్.
కపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్
ఇది కూడా కరోనా టైమ్‌లో వచ్చిన సెటైరికల్ షార్ట్ ఫిలిమ్. ఓ యువ జంట ‘వర్క్ ఫ్రమ్ హోమ్’లో పడే ఇబ్బందులు... ఇంట్లో ఒకరి పని ఒకరు పంచుకునే చేసుకొనే అనుభూతులను సూటిగా సుత్తి లేకుండా చూపించారు నిఖిల్ జోగి, అను ప్రసాద్. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అనగానే బద్దకంగా పని మొదలుపెట్టడం, ఒకటే ల్యాప్‌టాప్‌ను ఇద్దరూ ఉపయోగించుకోవడం, ఆఫీసు నుంచి బాస్ అక్షింతలు వేయడం... అన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయీ చిత్రంలో. అదే సమయంలో చూస్తున్నంతసేపూ నవ్వులు పండిస్తాయి. ఉద్యోగస్థులైన భార్యాభర్తలుగా అమర్‌దీప్, శ్రవంతిల అభినయం ఈ లఘుచిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. తెరపై వాళ్లిద్దరూ నిజమైన జంటలా అనిపిస్తారు. మూడు రోజుల కిందట యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికి రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్‌లు కొట్టారు. ఇందులోని సన్నివేశాలు ఇంటి నుంచి పని చేసే ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి.
మాస్క్ లేదంటే పైసలు కట్...
‘‘అన్‌లాక్ 1.0 తరువాత ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వస్తారని అందరూ ఊహించినదే. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. ఆంక్షలు విధిస్తుంది. కానీ జనం పాటించడం లేదు. ఈ అంశాన్ని సరదాగా చెబుతూ, దాని వెనుక ఉన్న సందేశాన్ని వాళ్ల ఆలోచనల్లో నింపాలని ప్రయత్నించాను. లాక్‌డౌన్ 4.0 ముగిసి, అన్‌లాక్ 1.0 అమల్లోకి వచ్చినప్పుడు తీసిన షార్ట్ ఫిలిమ్- లాక్‌డౌన్ 5.0’’ అని చెబుతున్నారు గురురాజ్ ఎస్. ఆయన విజ్యువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు. ఆయన దర్శకత్వం వహించిన మూడు నిమిషాల నిడివి ఉన్న లఘు చిత్రం ‘లాక్‌డౌన్ 5.0’. విశేషం ఏమిటంటే, ఇది జీరో బడ్జెట్ ఫిలిమ్. దీన్ని గురురాజ్ తన సీనియర్ 7- డీ కెమేరాతో చిత్రీకరించారు. అయితే దీనికి ఎంతో ప్రణాళిక వేసుకోవాల్సి వచ్చిందంటారాయన. ‘‘మాస్కులు ధరించాలనే సందేశాన్ని ఈ చిత్రం గట్టిగా చెబుతుంది. ఎవరైనా బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించకపోతే, ఫోన్ అన్‌లాక్ కాకుండా ఉండేలా మొబైల్ కంపెనీల సహకారంతో ఒక పద్ధతి ఏర్పాటు చేయాలి. మూడుసార్లు ఎవరైనా మాస్కు ధరించలేదని తేలితే అతని నెట్‌వర్క్ ప్రొవైడర్ ఖాతా నుంచి రూ.200 తగ్గించాలి. ఇలాంటి నియమం ఉంటే ప్రజల్లో నియంత్రణ ఉంటుందనిపించింది. ఆ ఆలోచనే నా కథకు మూలం’’ అని వివరించారు గురురాజ్.
Updated Date - 2020-07-29T05:30:00+05:30 IST