నా భార్యది ప్రేమా? అనుమానమా?
ABN, First Publish Date - 2020-02-13T04:59:18+05:30
నేనొక భార్యా బాధితుడిని. నాదొక విచిత్రమైన సమస్య. బాగా చదువుకుని ఒక విద్యాసంస్థ నిర్వహిస్తున్నాను. ఒక అమ్మాయిని ప్రేమించి కొన్ని కారణాల వల్ల పెళ్లి
నేనొక భార్యా బాధితుడిని. నాదొక విచిత్రమైన సమస్య. బాగా చదువుకుని ఒక విద్యాసంస్థ నిర్వహిస్తున్నాను. ఒక అమ్మాయిని ప్రేమించి కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేక విడిపోయాం. ఆ తర్వాత మా బంధువుల అమ్మాయితో నాకు వివాహం అయింది. నా వృత్తిరీత్యా నేను అందరితో కలుపుగోలుగా ఉంటాను. నా భార్యకు అది నచ్చదు. నచ్చచెప్పినా వినదు. ఊరికే నా ఫోన్ చూసి లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇప్పటికీ నాకు పాత ప్రేమికురాలితో సంబంధం ఉందని ఆమె అనుమానం. అక్కడికీ నా స్మార్ట్ ఫోన్ ఆమెకి ఇచ్చేసి మాములు ఫోన్ వాడుతున్నా. అయినా వేధింపులు ఆగలేదు. ఇందులోనూ మెసేజీలు డిలీట్ చేసానని గొడవ. ఈ ఫోన్ కూడా బస్ కింద పడేశా. దాంతో నేను అందుబాటులో లేక బిజినెస్ నెమ్మదించింది. అయినా నా భార్య మారడం లేదు. నాతో మాట్లాడటం లేదు. ఇది ప్రేమా?అనుమానమా? ఆమెకి ఎలా చెప్పాలి?
- గౌతమ్
ప్రేమతో కూడిన అనుమానం కావచ్చు. లేదా అనుమానంతో కూడిన ప్రేమ! ప్రస్తుతం మీ సమస్య అది కాదేమో! ముందు మీ భార్య మనస్తత్వం అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. ఆమె చదువు, కుటుంబ వాతావరణం, ఆర్థిక స్థితి... ఇవన్నీ ఆలోచించాలి. ఆమె తీవ్రమైన అభద్రతా భావానికి గురవుతున్నారు. బహుశా ఆమె మితభాషి కావచ్చు. లేదా మీ వ్యవహార శైలి నచ్చడం లేదేమో! అయినా అది మీ ఆర్థిక మూలాల్ని దెబ్బతీసేదిగా ఉండకూడదు. వెంటనే మీ భార్యతో మాట్లాడండి. కొన్నాళ్ళు భార్యాభర్తలుగా కాకుండా స్నేహితుల్లా ఉందామని చెప్పండి. వీలయితే మీ సంస్థలో ఉద్యోగం ఇవ్వండి. మీ పని, అందులో వ్యవహారాలు తెలిస్తే మెల్లగా మార్పు వస్తుంది. ఇక మీ ప్రేమ సంగతి... అది ముగిసిన అధ్యాయమని స్పష్టంగా చెప్పండి. ఇంత చేశాక కూడా... ఆమె వెంటనే మారిపోవాలని అనుకోకండి. అది మీమీద ఏర్పడే నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఇదంతా మీ వల్ల కాదు అనుకుంటే నిపుణులను సంప్రతించండి.
ఫ కె.శోభ
ఫ్యామిలీ కౌన్సెలర్, హార్ట్ టు హార్ట్,
Updated Date - 2020-02-13T04:59:18+05:30 IST